అప్పటివరకూ సభను జరగనివ్వం: డీకే అరుణ
హైదరాబాద్ : రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేసే వరకు సభను జరగనివ్వమని టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో డీకే అరుణ మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలపై ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ముందుకు రావాలని ప్రభుత్వానికి డీకే అరుణ సూచించారు. లేకుంటే రైతుల ఆత్మహత్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఏడాది కాలంలో రైతులు ఏ విధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారో వీక్షిద్దామని చెప్పారు. అప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్సు కరిగి రైతు రుణాలు ఒకే దఫాలో మాఫీ చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జల విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ఉభయ సభల సమావేశానికి అనుమతి ఇవ్వరాదని డీకే అరుణ ఈ సందర్భంగా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.