నమ్మకంగా పని చేసి కొల్లగొడతాడు...
బీహార్‌లో పాతనేరస్తుడి అరెస్టు
సొత్తు స్వాధీనం
హైదరాబాద్: వ్యాపారి ఇంట్లో నమ్మకం పని చేస్తున్నట్టు నటించి రూ. 10 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లిన పాతనేరస్తుడిని ఎస్సార్ నగర్ పోలీసులు బీహార్‌లో అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రం రాజ్‌మణి గ్రామానికి చెందిన శివనాథ్ ముఖియా (21) పాతనేరస్తుడు. సంపన్నుల ఇళ్లల్లో పని మనిషిగా చేరి, అదను చూసుకొని యజమాని ఇంట్లో నగలు, నగదు దొంగిలించుకుపోవడం ఇతడి నైజం. గతంలో ఇతనిపై బంజారాహిల్స్, సికింద్రాబాద్ మారేడ్‌పల్లి, సైఫాబాద్ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
మూడు నెలల క్రితం తెలిసిన వారి ద్వారా బల్కంపేట ప్రశాంతినగర్ కాలనీకి చెందిన వ్యాపారి లక్ష్మీనారాయణ తైన్‌వాలా ఇంట్లో పనికి కుదిరాడు. శివనాథ్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలు తెలుసుకోకుండానే లక్ష్మీనారాయణ ఇతడిని పనిలో పెట్టుకున్నారు. నమ్మకం పని చేస్తున్నట్టు నటించిన శివనాథ్ ఒక రోజు యజమాని ఇంటి తాళాలను చోరీ చేసి వాటికి నకిలీ తాళాలు చేయించాడు. మూడు నెలలు నమ్మకంగా పని చేసిన శివనాథ్ ఈ నెల 18న యజమానులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లగా నకిలీ తాళాలతో ఇంట్లోకి ప్రవేశించి 20 తులాల బంగారు నగలు, 3 వజ్రాలతో కూలిన ఆభరణాలు, 20 తులాల వెండి, 2 సెల్‌ఫోన్‌లు, రూ. 2.3 లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు. సీసీ కెమెరా పుటేజీల ద్వారా ఈ చోరీ శివనాథ్ చేసినట్టు నిర్ధారించుకున్న పోలీసులు అతడి వివరాలు ఏమీ లేకపోవడంతో బీహార్‌కు చెందిన కొంత మందికి సీసీ కెమెరా ఫుటేజీ చూపించి నేరస్తుడి ఆచూకీ కనుగొన్నారు.
బీహార్‌కు వెళ్లి...
ఎస్సార్ నగర్ డీఐ సతీష్, ఎస్సై జి.శ్రీనివాస్ బృందం బీహార్‌కు వెళ్లింది. నిందితుడు శివనాథ్ నివాసం బందిపోట్లు ఉండే ప్రాంతంలో ఉండటంతో బీహార్ పోలీసులతో కలిపి 40 మంది పోలీసులు వెళ్లి దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శివనాథ్‌ను నగరానికి తీసుకొచ్చి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇతడిపై పీడీ యాక్స్ ప్రయోగించనున్నట్టు డీసీపీ తెలిపారు.