మా నీటికి అడ్డుపడితే ఊరుకోం | don't impede our water, Harish rao warns AP leaders | Sakshi
Sakshi News home page

మా నీటికి అడ్డుపడితే ఊరుకోం

Published Wed, May 18 2016 3:51 AM | Last Updated on Thu, Mar 28 2019 5:35 PM

మా నీటికి అడ్డుపడితే ఊరుకోం - Sakshi

మా నీటికి అడ్డుపడితే ఊరుకోం

- ఏపీ నేతలకు మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
- కృష్ణాలో మా వాటా మేం వినియోగించుకుంటున్నాం
- పక్క రాష్ట్రాల వాటాలో అదనంగా చుక్క కూడా కోరుకోవడం లేదు
- ఆర్డీఎస్‌పై ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు అడ్డుపడతారా? ఇది మానవత్వమేనా?
- చర్చకు 10 రోజులుగా ప్రయత్నిస్తున్నా దేవినేని నుంచి స్పందన లేదు

 
సాక్షి, హైదరాబాద్

కృష్ణా జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కుల మేరకే నీటిని వినియోగించుకుంటున్నామని, పక్క రాష్ట్రాల వాటాలో ఒక్క చుక్క కూడా అదనంగా కోరుకోవడం లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తమకు హక్కుగా సంక్రమించిన నీటికి అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, వాటిని వాడుకునేందుకు యత్నిస్తుంటే ఏపీ అడ్డుకోవడం సబబు కాదన్నారు.

‘‘ఆర్డీఎస్ కాల్వలఆధునీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్ణయం జరిగింది. ఇప్పుడు దాన్ని అమలు చేద్దామంటే ఏపీ అడ్డుకోవడం దారుణం. ఇది మానవత్వమేనా?’’ అని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం మంత్రి చందూలాల్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మదన్‌రెడ్డిలతో కలిసి సచివాలయంలో హరీశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఎస్ పనుల ఆధునీకరణ కోసం కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్రాన్ని ఒప్పించామని, ఇదే విషయమై చర్చిద్దామని పది రోజులుగా కోరుతున్నా ఏపీ మంత్రి దేవినేని ఉమ మాత్రం స్పందించడం లేదన్నారు. కర్ణాటక అధికారులు సోమవారం పనులు ఆరంభిస్తే కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీఓ పనులు ఆరంభించరాదంటూ రాయచూర్ కలెక్టర్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు. న్యాయమైన వాటా కోరుతుంటే ఇలా పనులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. తక్షణమే ఆ లేఖ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పనులను కొనసాగించేలా చూడాలంటూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

అవి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులే..
కృష్ణాలో మొత్తంగా 448 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని, అందులో ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే.. 150 టీఎంసీలు ఏపీకి, 77 టీఎంసీలు తెలంగాణకు కలిపి మొత్తంగా 227 టీఎంసీలు కేటాయించారని మంత్రి హరీశ్ చెప్పారు. మిగిలిన 221 టీఎంసీల మిగులు జలాల ఆధారంగా పాలమూరు, డిండి ప్రాజెక్టులు చేపట్టాలని ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయించారని వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం.. పట్టిసీమ నుంచి నీటిని తీసుకెళ్తే ఎగువ రాష్ట్రాలకు ఆ నీటిలో 45 టీఎంసీల మేర నీటి హక్కు లభిస్తుందన్నారు. ఇక 811 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉందని, అయితే ఇందులో 200 టీఎంసీలకు మించి తెలంగాణ వాడటం లేదని స్పష్టంచేశారు.

కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013(ఉమ్మడి రాష్ట్రం)లోనే జీవో 72 ఇచ్చారని, అలాగే కృష్ణాలో 30 టీఎంసీల నీటితో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారని మత్రి గుర్తుచేశారు. అలాంటప్పుడు అవి ముమ్మాటికీ పాత ప్రాజెక్టులేనని, వీటిపై కొత్తగా అపెక్స్ కమిటీ అనుమతులు అవసరం లేదన్నారు. ఉమ్మడి ఏపీలోనే నీటి కేటాయింపులు చేసి, సర్వేలు చేసి, నిధులు ఖర్చు చేసిన ప్రాజెక్టులను ఇప్పుడు కొత్త ప్రాజెక్టులంటారా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. అధికార , ప్రతిపక్ష నేతల మధ్య కొట్లాటలకు తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు వేదికగా చేసుకుంటున్నారని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోసుకున్న ఉసురు చాలదా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement