రోగుల నోట్లో బురద!
{పభుత్వ దవాఖానాల్లో ‘మంచి’నీరు కరువు
నెలల తరబడి క్లీన్ చేయని వాటర్ సంపులు
ట్యాంకుల్లో నాచు, పక్షుల వ్యర్థాలు, తోక పురుగులు
కుళాయిల నుంచి రంగుమారిన నీరు సరఫరా
సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు, వారి బంధువులు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా సరిగా దొరకడం లేదు. అసలే రోగంతో ఆస్పత్రికి వస్తున్న వారు ఇక్కడి అపరిశుభ్రమైన నీరు తాగి మరిన్ని ఇక్కట్లకు గురవుతున్నారు. మొత్తమ్మీద వైద్యాధికారులు, కాంట్రాక్టర్లు కలిసి రోగుల నోట్లో బురద చల్లుతున్నారు. రోజుల తరబడి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయక పోవడం, ట్యాంకులపై మూతల్లేకపోవడంతో దుమ్ముదూళి కణాలు నీటిలో చేరడంతో పాటు పిచ్చుకల మలవిసర్జన, తోక పురుగులు, బురద తేలిఆడుతోంది. తెలియక ఈ నీరు తాగిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మళ్లీ అదే ఆస్పత్రిలో చేరుతున్నారు. నగరంలోని ప్రతిష్టాత్మాక ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఈఎన్‌టీ, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, ఫీవర్ ఆస్పత్రుల్లో నిర్వహణ లోపం వల్ల ఒక్కో నీటి సంపు అడుగు భాగంలో భారీగా బురుదనీరు పేరకపోయి కుళాయిల నుంచి రోగులకు సరఫరా అవుతోంది.
ఉస్మానియా ట్యాంకుల్లో పిచ్చుకల వ్యర్థాలు
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అవుట్‌పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 2000-2500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1500 మంది చికిత్స పొందుతుంటారు. వీరికి సహాయకులుగా మరో వెయ్యిమంది ఉంటారు. వైద్య సిబ్బంది మరో రెండు వేలు ఉంటారు. రోజుకు 50 లక్షల లీటర్లకుపై గా నీరు అవసరం కాగా 29,47,640 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని 14 ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. ట్యాంకులకు మూతల్లేక పోవడంతో దుమ్ము, ధూళీ వచ్చి చేరుతోంది. పావురాల మలవిసర్జన నీటిపై తేలిఆడుతోంది. మల, మూత్ర విసర్జన అవ సరాలకు మినహా ఇతర అవసరాలకు వినియోగించడం లేదు. కలుషిత నీరుతాగి మూడేళ్ల క్రితం 40 మంది నర్సింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ట్యాంకులను ప్రతి పదిహేను రోజులకోసారి బ్లీచింగ్‌తో శుభ్రం చే యాల్సి ఉన్నా కనీసం నెలకోసారి కూడా చేయడం లేదు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరి శీలించాల్సిన ఆర్‌ఎంఓలు వాటిని పట్టించుకోవడం లేదు.
గాంధీ మంచినీటి ట్యాంకుల్లో ఈ కొలి బ్యాక్టీరియా
ఆసియాలోనే అతిపెద్ద ఆస్పత్రిగా గుర్తింపు పొందిన గాంధీ జనరల్ ఆస్పత్రిలో కూడా మంచినీటికి కటకటే. ఎప్పటికప్పుడు ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో నీటిపై నాచు తేలుతోంది. కుళాయిల నుంచి సరఫరా అవుతున్న నీటిలో ఈ కొలి బ్యాక్టీరియా ఉండటంతో తాగడానికి పనికిరావడం లేదు. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సరిపడు నీరు సరఫరా కాకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. వైద్యులే కాదు ఎవరైనా రోగులు మందు బిల్ల వేసుకునేందుకు మంచినీరు కావాలంటే పైసలు పెట్టి కొనుక్కోవాల్సిందే.
సంపులు క్లీన్ చేయకపోవడం వల్లే..
కంటి ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వానికి జలమండలి నివేదిక
సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో ఇటీవల బురుద నీరు సరఫరా కావడం, 250కిపైగా శస్త్రచికిత్సలు నిలిచిపోవడం తెలిసిందే. బురద నీరు సరఫరా చేయడం వల్లే శస్త్రచికిత్సలు నిలిపివేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆ తర్వాత జలమండలి అధికారులు ఏడు ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించి, పరీక్షించగా అసలు విషయం బయట పడింది. ఆస్పత్రిలోని వాటర్ ట్యాంకులను నెలల తరబడి క్లీన్ చేయకపోవడం వల్లే ట్యాంకు అడుగు భాగంలో ఐదు ఇంచుల మేర బురద మట్టి పేరుకపోయింది. ట్యాంక్‌లోని నీరు ఖాళీ అవడంతో బురద నీరు కుళాయిల్లోకి వచ్చి చేరింది. ఎప్పటికప్పుడు ట్యాంకులను క్లీన్ చేయకపోవడమే ఈ ఘటనకు కారణమని జలమం డలి అధికారులు స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల అవి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి.
మంచినీరు కొనాల్సిందే
గోలి వేసుకుందామంటే గుక్కెడు మంచి నీళ్లు దొరకడం లేదు. దాహమేస్తే చాలు ఖాళీ సీసాలు పట్టుకుని రోడ్డువెంట పరుగెట్టాల్సి వస్తుంది. అక్కడక్కడా ఫ్రిజ్‌లు కన్పించినా తాగు నీరు దొరకడం లేదు. ఉన్న నీరు కూడా కలుషితం కావడంతో తాగేందుకు పనికి రావడం లేదు. డబ్బులు పెట్టి మంచినీళ్లను కొనుక్కోవాల్సి వస్తోంది.
- జి.శ్రీనివాస్ యాదవ్, మంగళ్‌హట్