ఎఫ్ క్లబ్ లైసెన్స్ రద్దు, 14 పబ్‌లకు వార్నింగ్
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ దూకుడు పెంచింది. నిబంధనలు అతిక్రమించిన ‘ఎఫ్’ క్లబ్ లైసెన్స్‌ను సిట్ రద్దు చేసింది. అంతేకాకుండా మరో 14 పబ్‌లు, బార్‌లకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు మరోవైపు నోటీసులు జారీ చేసినవారిని విచారణ చేస్తున్నారు.
ఇప్పటివరకూ విచారణ ఎదుర్కొన్నవారు వెల్లడించిన ప్రకారం...పబ్బుల్లోనే డ్రగ్స్ కల్చర్ నడుస్తున్నట్లు వెల్లడించడంతో సిట్...పబ్బులపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా నగరంలోని 17 పబ్బుల నిర్వాహకులను ఇవాళ (శనివారం) విచారణకు పిలిచారు. విచారణలో భాగంగా డ్రగ్స్ సరఫరా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే డ్రగ్స్ కేసులో మరో ఇద్దర్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన మహ్మద్ ఉస్మాన్, అర్నవ్ మండల్ నుంచి 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.