‘ఈ-టౌన్ ప్లానింగ్’కు కసరత్తు
* రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి
* రూపకల్పనలో కొత్త సాఫ్ట్‌వేర్
* ఇకపై ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల పరిశీలన
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల్లో ఇప్పటికే ‘ఈ-ఆఫీస్’ అమల్లోకి రాగా.. తాజాగా టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ ఇదే విధానాన్ని కొనసాగించేందుకు కసరత్తు జరుగుతోంది. భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు సైతం ఆన్‌లైన్‌లోనే పరిశీలించే ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ-ఆఫీస్‌తో అనుసంధానం చేసి ‘ఈ-టౌన్ ప్లానింగ్’ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి వచ్చే అన్ని దరఖాస్తులను స్కానింగ్ చేసి ఆన్‌లైన్ ద్వారానే సంబంధిత అధికారులకు పంపుతున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో భవనాల అనుమతుల దరఖాస్తుల పరిశీలన సమయంలో నిర్మించబోయే భవనం ఎత్తు, రహదారి వెడల్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంత విస్తీర్ణంలో.. ఎన్ని అంతస్తుల భవనానికి ఎన్ని అడుగుల సెట్‌బ్యాక్ వదలాలి వంటి అంశాల్ని పరిశీలిస్తున్నారు.
ఈ-ఆఫీస్ అమల్లోకి వచ్చినా.. ప్లాన్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ పరిశీలన తప్పనిసరి. ఈ పరిశీలన (స్క్రూటిని) సైతం ఆటోమేటిగ్గా జరిగేందుకు సాఫ్ట్‌వేర్ రూపొందించనున్నారు. ఉదాహరణకు 200-300 చ.మీ.లలో నిర్మించే 12 మీటర్ల లోపు భవనాలకు ముందువైపు రెండడుగులు.. మిగతా మూడు వైపులా ఒకటిన్నర అడుగు సెట్‌బ్యాక్‌గా వదలాల్సి ఉంటుంది. స్థల విస్తీర్ణం.. అంతస్తులు.. తదితర అంశాలను ఇకపై కొత్త సాఫ్ట్‌వేర్ పరిగణనలోకి తీసుకొని నిర్మించబోయే భవనానికి ఎటు వైపు ఎన్ని అడుగుల సెట్‌బ్యాక్ వదలాలో సూచిస్తుంది.
నిబంధనల మేరకు ప్లాన్ ఉందో లేదో దరఖాస్తు స్కానింగ్ సమయంలోనే తెలుస్తుంది. ఈ-ఆఫీస్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇప్పటికే 3,314 ఫైళ్లు, సెంట్రల్‌జోన్‌లో 1,215 ఫైళ్లు, నార్త్‌జోన్‌లో 735, ఈస్ట్‌జోన్‌లో 191 ఫైళ్లు స్వీకరించినట్లు సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. అన్ని కార్యాలయాల్లో వెరసి పది లక్షలకుపైగా పేజీలు స్కాన్ చేసినట్టు చెప్పారు. కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రాగానే ఈ-ఆఫీస్‌తో అనుసంధానం చేయడం ద్వారా టౌన్‌ప్లానింగ్ ఫైళ్లు మరింత త్వరగా పరిష్కారం కాగలవన్నారు.