* గుర్తుతెలియని దుండగుల ఘాతుకం
* హైదర్షాకోట్‌లో కలకలం
* రంగంలోకి దిగిన పోలీసులు
* నిందితుల కోసం సీసీ కెమెరాల పరిశీలన
రాజేంద్రనగర్: హైదర్షాకోట్ సాయిహర్షనగర్‌లో గురువారం సాయంత్రం వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలో జంట హత్యలు జరగడంతో ఆప్రాంతవాసులు ఉలి క్కిపడ్డారు. పోలీసుల వివరాల మేరకు..హైదర్షాకోట్ సాయిహర్షనగర్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఇంట్లో వేదాల సింహాద్రి(65), వేదాల సులోచన(60) నివాసముంటున్నారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన వీరు 20 సంవత్సరాల కిందట నగరానికి వచ్చారు. సింహాద్రి చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసి పదవీ విరమణ పొందారు. అలాగే సులోచన మొయినాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేసి ఐదునెలల క్రితం పదవీ విరమణ పొందింది.
వీరికి ఇద్దరు సంతానం. కూతురు పావని వివాహమైంది. ఆమె ఆర్టీసీ కాలనీలో నివాసముంటోంది. కుమారుడు బెంగళూరులో ఉంటున్నాడు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. సింహాద్రి ఇంట్లో ఉసిరిచెట్టు ఉంది. కార్తీకపౌర్ణమి కావడంతో సింహాద్రి ఇంటి నుంచి ఉసిరికాయలు తీసుకురమ్మని సమీపం నివాసముంటున్న ఓ ఇంటి యజమాని వాచ్‌మన్‌కు చెప్పింది. గురువారం సాయంత్రం 5:30 సమయంలో వాచ్‌మన్ గేటు వద్దనుంచి వారిని పిలిచాడు. ఎలాంటి సమాధానం రాలేదు. విషయాన్ని పక్కింటివారికి తెలిపాడు.
అతను లోనికి వెళ్లిచూడగా రక్తపుమడుగులో సింహాద్రి కొన ఊపిరితో ఉన్నాడు. ఈ విషయాన్ని స్థానికులు 108, నార్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. సింహాద్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. మరో బెడ్‌రూమ్‌లో సులోచన నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. ఆమె నిర్జీవంగా పడివుంది. నోట్లోంచి రక్తంకారి ఉండడం, బెడ్‌పై పెనుగులాడిన ఆనవాళ్లు కనిపించాయి. బెడ్‌పై ఓ పర్సులో నగదు, టేబుల్‌పై నగదు అలాగే ఉన్నాయి. అల్మారా తెరిచినట్టు ఆనవాళ్లు కూడా లేవు.
ఇంటిముందు రబ్బర్ చెప్పులు మాత్రం ఉన్నాయి. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మొదట సులోచనను, అనంతరం సింహాద్రిపై దాడిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ ఇంట్లోని మూడు బెడ్‌రూమ్‌లతో పాటు హాలు, కిచెన్‌రూమ్ పరిసరాల్లో తిరిగి బాల్కానీలోకి వచ్చి అటూ ఇటూ తిరిగి బయటకు వచ్చింది. అనంతరం 300 మీటర్ల ప్రధాన రహదారి వరకు వెళ్లి తిరిగి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోని శవం వద్ద బయట వరండాలో కూర్చుండిపోయింది. నిందితుడు ఒకరు లేదా ఇద్దరు ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఈ సంఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు, ఆస్తి తగాదాలు, లేదా ఇతర ఏమైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో నగదు కానీ, బంగారు కానీ చోరీ కాలేదని డీసీపీ రమేష్‌నాయుడు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కూతురు పావని ఇంటికి చేరుకొని తల్లి శవాన్ని చూసి విలపించింది. తమకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని, ఎవరు ఇంతటి దారుణానికి పాల్పడ్డారో తెలియదంటూ రోదించింది. ఇదిలా ఉండగా సాయంత్రం 5.30 ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లినట్లు పక్కవారు చూశారు. దీంతో వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ కాలనీ కావడంతో సీసీ కెమెరాల్లో ఏమైనా క్లూ దొరుకుతుందా అన్న కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్‌గౌడ్, సర్పంచ్ కృష్ణారెడ్డి సందర్శించారు.
వృద్ధ దంపతుల దారుణహత్య
Published Fri, Nov 7 2014 2:49 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
Advertisement
Advertisement