ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
♦ 46 వేల మంది సిబ్బంది నియామకం
♦ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
లింగోజిగూడ: ఫిబ్రవరి 2న నిర్వహించనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్, ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గాను 46 వేల మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎల్‌బీనగర్ జంట సర్కిళ్ల(3ఎ, 3బి) కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని విభాగాల అధికారులకు శిక్షణ పూర్తి చేశామని, ఈవీఎం యంత్రాలను ఆయా కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచామని చెప్పారు.
ఈవీఎంలు మొరాయిస్తే ముందు జాగ్రత్తగా అదనంగా 27 శాతం మిషిన్‌లను అందుబాటులో ఉంచామన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 50 లక్షల ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారన్నారు. మరో రెండు రోజుల్లో అందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన శిబిరాలు నిర్వహించామని పేర్కొన్నారు. విద్యార్థులకు సంకల్ప పత్రాలు అందజేసి వారి తల్లిదండ్రులు ఓటేసే విధంగా కృషి చే స్తున్నామన్నారు. అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక టీమ్‌లు ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాయని చెప్పారు.
అందరూ సమన్వయంతో పనిచేయాలి...
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ కోరారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారుల నియామకానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. జోనల్ అధికారులు, ఆర్‌ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరూ నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. జోనల్ అధికారులకు వాహనాలు అందుబాటులో ఉంటాయని, పోలింగ్ సందర్భంగా గంటకు ఒకసారి డేటాను పంపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల ఎన్నికల పరిశీలకులు దినకర్‌బాబు, ఒమర్ జలీల్, జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డీసీలు పంకజ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.