హైదరాబాద్‌లో కనెక్షన్‌పై రూ.5 వసూలుకు నిర్ణయం
కేబుల్ ఆపరేటర్లకు వాణిజ్య పన్నుల శాఖ ఆదేశాలు
వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమైన ఆపరేటర్లు
ఈ నెల నుంచే అమల్లోకి..
గ్రేటర్‌పై నెలసరి పన్ను భారం రూ. 1.20 కోట్ల పైనే
సాక్షి, హైదరాబాద్: వినోద సాధనమైన కేబుల్ టీవీ మరింత భారం కానుంది. వాణిజ్య పన్నుల శాఖ వినోదం పేరుతో ‘పన్ను’ పీకేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో పన్నుల ద్వారా ఆదాయం సమకూరే అన్ని మార్గాలపై దృష్టిసారించిన ఈ శాఖ.. తాజాగా కేబుల్ టీవీ కనెక్షన్లపై కన్నేసింది. తొలుత నగరంలోని వినియోగదారుల నుంచి వినోద పన్ను వసూలు చేసేందుకు సిద్ధమైంది. మహా నగర పరిధిలో కేబుల్ టీవీ ప్రసారాల ద్వారా వినోద పన్ను వసూలుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. వాస్తవంగా జీహెచ్‌ఎంసీ కేబుల్ టీవీ కనెక్షన్ల చార్జీలపై 20 శాతం వినోద పన్ను వసూలు చేసి అందులో రెండు శాతాన్ని వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించాల్సి ఉంది. ఆయితే జీహెచ్‌ఎంఎసీ అధికారులు కేబుల్ కనెక్షన్ల రాబడిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో వినోద పన్ను వసూళ్లు లేకుండాపోయాయి. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంచుకునే పనిలో భాగంగా ఒక అడుగు ముందుకేసి కేబుల్ కనెక్షన్లపై నేరుగా వినోద పన్నులోని తన వాటాను వసూలు చేసేందుకు తయారైంది. అక్టోబర్ నుంచి కేబుల్ ఆపరేటర్లు కనెక్షన్‌పై నెలకు రూ.5 వినోద పన్ను చెల్లించాలని ఏకంగా ఆదేశాలు జారీ చేసింది.
24 లక్షల కనెక్షన్లు
గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 24 లక్షల కేబుల్ టీవీ కనెక్షన్లు, మరో 4 లక్షల వరకు డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఎమ్‌ఎస్‌ఓగా ఉన్న సిటీ కేబుల్, హాత్‌వే, డిజీ కేబుల్, ఆర్‌వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ సంస్థలు కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాయి. ఎమ్‌ఎస్‌ఓల కంట్రోల్ రూమ్ నుంచి ట్రంక్ లైన్ ద్వారా ప్రసారాలు స్థానిక కేబుల్ ఆపరేటర్లకు అందుతాయి. కేబుల్ ఆపరేటర్లు స్థానిక కేంద్రాల ద్వారా వినియోగదారులకు ప్రసారాలు అందిస్తున్నారు. నగరంలో రెండు వేల మంది పైగా కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. వినియోగదారులకు కేబుల్ ద్వారా ప్రసారాలు అందిస్తున్నందుకు నెలకు రూ.150-200 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వినోద పన్ను భారాన్ని వినియోగదారులపైనే మోపేందుకు కేబుల్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న నెలసరి చార్జీలతో పాటు అదనంగా రూ.5 వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ లెక్కన గ్రేటర్‌లోని వినియోగదారులపై నెలకు సుమారు రూ.1.20 కోట్ల అదనపు భారం పడనుంది. వినియోగదారులు వినోద పన్నును తమ ఆపరేటర్ ద్వారా వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాలని కొన్ని ఎంఎస్‌ఓలు స్క్రోలింగ్ ఇవ్వడం గమనార్హం.
కేబుల్ కనెక్షన్లపై వినోద పన్ను
Published Wed, Oct 14 2015 3:29 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM
Advertisement
Advertisement