- ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి
- నెలాఖరుకల్లా కన్వీనర్ల నియామకం
- విద్యా విధానంపై త్వరలో జాతీయ సెమినార్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, ఈసెట్, ఐసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూళ్లను సిద్ధం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమక్షంలో సోమవారం ఆయా సెట్‌ల తేదీలు, ఇతర వివరాలను విడుదల చే యనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పడ్డాక రూపొందించిన తొలి డైరీని, స్టాటిస్టికల్ బుక్‌లెట్‌ను పాపిరెడ్డి శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో ప్రవేశ పరీక్షల తేదీలు, ఆయా పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీ పేర్లను ప్రకటిస్తామని, రెండో దశలో సెట్‌ల కన్వీనర్లను ప్రకటిస్తామన్నారు. వర్సిటీల నుంచి వచ్చి ప్యానెల్ జాబితాలను పరిశీలించి కన్వీనర్లను ఎంపిక చేస్తామన్నారు. ఎంసెట్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన తేదీకి మూడ్రోజులు ముందు లేదా తర్వాత ఎంసెట్ నిర్వహిస్తామన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాతే వీసీల నియామకం
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ వైస్ చాన్సలర్ల (వీసీలు) నియామక ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఈ నెల 8 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉందని పాపిరెడ్డి చెప్పారు. వీసీల నియామకం త్వరగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారన్నారు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లోకి రానున్నందున ఎన్నికల ప్రక్రియ అనంతరం కొత్త వీసీలను ప్రకటిస్తామన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని పాపిరెడ్డి వివరించారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యకు ఎటువంటి విధానం ఉండాలనే అంశంపై త్వరలోనే జాతీయ స్థాయిలో సెమినార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండ్రోజులపాటు నిర్వహించనున్న సెమినార్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు, నిపుణులు కూడా పాల్గొంటారని, విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై వారందరితో చర్చిస్తామన్నారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వెంకటాచలం, మల్లేశ్, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, అకడమిక్ సెల్ రీడర్ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంట్రన్స్‌ల తేదీలపై రేపు ప్రకటన
Published Sun, Jan 3 2016 3:59 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement