
సాక్షి, హైదరాబాద్: ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు పోతోందని, కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 89 రహదారుల పనుల కోసం రూ.142 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చామని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు .
కొడంగల్ నియోజకవర్గంలోని 36 రోడ్డు పనులను తానే మంజూరు చేయించానంటూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రకటనలు జారీ చేసుకోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీ, బీటీ రోడ్ల కోసం ఎమ్మెల్యేల నుంచి ఏటా వందలాది ప్రతిపాదనలు వస్తున్నాయని, అలాంటి ప్రతిపాదనలేవీ పంపని ఏకైక ఎమ్మెల్యే రేవంత్ అని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడే నాటికి కొడంగల్ నియోజకవర్గంలోని 39 గ్రామాలకు రహదారి సౌకర్యమే లేదని, దీనికి కాంగ్రెస్, టీడీపీలు కారణం కాదా అని ప్రశ్నించారు. అప్పుడు అభివృద్ధి చేయడం చేతగాని రేవంత్.. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను తానే చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 376 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామని, సమైక్య పాలనలో 756 గ్రామాలకు రహదారి సౌకర్యమే కల్పించలేకపోయారని పేర్కొన్నారు.