
హైదరాబాద్: ఓయూసెట్–2018 ప్రవేశ పరీక్షలను జూన్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ బుధవారం తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఓయూసెట్–2018ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, డిగ్రీ ఫైనలియర్ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 26 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో జూన్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఓయూసెట్ ప్రవేశ పరీక్షల్ని తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
13న మాక్ ఐసెట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ నెల 13న మాక్ ఐసెట్ నిర్వహించనున్నట్లు ఆర్‌జీ కేడియా కాలేజీ ఆఫ్ కామర్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
గురువారం (10వ తేదీ) నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామంది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు పరీక్ష ఉంటుందని తెలిపింది. మాక్ ఐసెట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని పేర్కొంది. వివరాలకు 040–24738939, 040–65889309 నంబర్లను సంప్రదించాలని కాలేజీ డైరెక్టర్ డీవీజీ కృష్ణ వెల్లడించారు.
‘టెన్త్ రీ–వెరిఫికేషన్‌కు రేపటితో ఆఖరు’
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి పరీక్షల జవాబు పత్రాల రీ–వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు శుక్రవారంలోగా నిర్ణీత చలానాతో కూడిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.ప్రభాకర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను పోస్టు చేయాలనుకునే విద్యార్థులు ఈ నెల 15లోపు చేరేలా పంపాలన్నారు. గడువు తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణించమని ఆయన స్పష్టం చేశారు.
జూన్ 4–19 వరకు టెన్త్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 4 నుంచి 19 వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫెయిలైన విద్యార్థుల రోల్స్ డాటా వివరాలను www.bse. telagana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు.
12,13 తేదీల్లో పీడీ, లైబ్రేరియన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 12, 13 తేదీలలో రాత పరీక్షలు నిర్వహించనున్నామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి హాల్‌టికెట్లు సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.