‘ఆబ్కారీ’ విభజనకు కసరత్తు
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎక్సైజ్ సూపరింటెండెంటే జిల్లా బాస్
సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీ శాఖ ఉద్యోగల విభజనకు కసరత్తు మొదలైంది. జిల్లాల పునర్విభజనతో ఆబ్కారి శాఖ స్వరూపమే మారిపోనుంది. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ జిల్లా ప్రధానాధికారిగా ఉండగా, కొత్త జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లే బాస్‌లుగా మారబోతున్నారు. మూడేసి జిల్లాలకు ఒక ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఇన్‌చార్జిగా ఉంటారు. నెలరోజుల్లోగా కొత్త జిల్లాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పంపిణీ పూర్తి చేయాలని సర్కార్ ఆదేశించడంతో కొద్దిరోజులుగా ఆబ్కారీ శాఖ భారీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో ఆ శాఖ అధికారులు ఇప్పటికే రెండుసార్లు సమావేశమై చర్చించారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా 560 పోస్టులు అవసరమని అధికారులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వ పెద్దలు తిరస్కరించి, ఉన్నవారితోనే నెట్టుకు రావాలని స్పష్టం చేశారు.
అక్టోబర్ 11 నాటికి అన్ని జిల్లాలో ఎక్సైజ్ కార్యాలయాలు ఏర్పాటు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24 ఎక్సైజ్ యూనిట్లు ఉండగా, ప్రతి యూనిట్‌కు ఓ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) అధికారిగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మాత్రమే హైదరాబాద్, సికింద్రాబాద్, ధూల్‌పేటలకు ఈఎస్‌లు ఉండగా, ప్రస్తుత రంగారెడ్డిని విభజిస్తే ఏర్పాటయ్యే నాలుగు జిల్లాలకు ఇద్దరే ఈఎస్‌లుంటారు. ఈ నేపథ్యంలో 27 జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లనే బాస్‌లుగా నియమించి, ఇప్పుడున్న కార్యాలయాలనే ఎక్సైజ్ కార్యాలయాలుగా కొనసాగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 16 మంది అసిస్టెంట్ కమిషనర్లను ప్రతి రెండు జిల్లాలకు ఓ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా నియమించనున్నట్లు సమాచారం.
ఫీల్డ్ సా్‌టఫ్ కూడా...
ఆబ్కారీ శాఖలో ప్రస్తుతం 4,134 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఫీల్డ్ స్టాఫ్ 3,607 కాగా, 527 మంది పరిపాలన విభాగం ఉద్యోగులు. డీసీ, ఏసీ, ఈఎస్‌లు పోగా మిగిలిన ఫీల్డ్ స్టాఫ్ 3,553 మందిని 27 జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. అలాగే 527 మంది మినిస్టీరియల్ స్టాఫ్‌ను కూడా అన్ని జిల్లాలకు పంచాలని యోచిస్తున్నారు.