
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరంతర విద్యుత్, సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిపట్ల ఎవరికైనా అనుమానాలుంటే, ఏ వేదిక నుంచైనా నివృత్తి చేసేందుకు సిద్ధమని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. డాక్యుమెంట్లను ఆధారంగా చూపి స్పష్టత ఇస్తామని చెప్పారు. నిరంతర విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీలేదని, దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో మిగులు విద్యుత్ లభ్యత ఉండడంతో సాధ్యమైందని కాంగ్రెస్, టీ జేఏసీ నేతలు చేసిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు.
పూర్తి సమాచారం తెలియకుండానే కొందరు అలా మాట్లాడుతున్నారని అన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పవర్ ఎక్సే ్చంజీల్లో చౌక గా విద్యుత్ లభ్యత ఉన్నా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. తాత్కాలిక ఒప్పందాల ద్వారా వ్యయసగటు యూనిట్‌కు రూ.3.87 అయితే, పవర్ ఎక్స్‌ఛేంజీల్లో రూ.3.98 ఉందన్నారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్లను పారదర్శకంగా జరుపుతున్నామని పేర్కొన్నారు.
24 గంటలపై పునరాలోచన లేదు..
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై పునరాలోచన లేదని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచిస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నుంచి తమకు అలాంటి సూచనల్లేవన్నారు.
మోటార్ల ఆటోస్టార్టర్లను తొలగించాలని రైతులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని, ఎక్కడా బలవంతం పెట్టడం లేదని చెప్పారు. ఆటోస్టార్టర్ల నష్టాలను వివరిస్తున్నామన్నారు. వాటి తొలగింపుపై సీఎం త్వరలో రైతులకు విజ్ఞప్తి చేయనున్నారని తెలిపారు. వ్యవసాయానికి 2016–17లో 14,300 మిలియన్ యూనిట్లు, 2017–18లో 15,600 ఎంయూ విద్యుత్ సరఫరా చేయగా, 2018–19లో 16,853 ఎంయూలను సరఫరా చేయాల్సి ఉంటుంద ని అంచనా వేశామన్నారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో పెరిగే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని చెప్పారు. అందుకే రాష్ట్రం లో విద్యుత్ చార్జీలను పెంచడం లేదన్నారు. విద్యుత్ సబ్సిడీని రూ.5,400 కోట్లకు పెంచుతామని సీఎం హామీ ఇచ్చారన్నారు. నిరంతర విద్యుత్‌తో గ్రామీణ ప్రాంతాలకు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశముందన్నారు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌పై ఇతర రాష్ట్రాల అధికారులు తనకు ఫోన్ చేసి వివరాలు సేకరించారని వెల్లడించారు.
ఏఈ సిలబస్‌లో మార్పులుండవు
ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం కొత్త సిలబస్‌తోనే రాతపరీక్ష నిర్వహిస్తామని ప్రభాకర్‌రావు తెలిపారు. అభ్యర్థులు కోరుకున్న సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. గేట్ సిలబస్ ఆధారంగానే రాత పరీక్ష ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment