దొంగగా మారిన ఫ్యామిలీ ఫ్రెండ్
దొంగగా మారిన ఫ్యామిలీ ఫ్రెండ్
Published Sat, Dec 10 2016 9:13 AM | Last Updated on Fri, Sep 7 2018 1:59 PM
ఒకటి కాదు, రెండు కాదు.. 17 ఏళ్లుగా ఆ రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. దాన్ని అలుసుగా తీసుకున్న ఓ చిట్‌ఫండ్ వ్యాపారి తన స్నేహితుడి ఇంట్లోనే కన్నం వేశాడు. మొత్తం రూ. 4.17 లక్షలు నొక్కేశాడు. కానీ.. పక్క ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరా పుణ్యమాని అడ్డంగా దొరికేశాడు. పోలీసులు నేరుగా అతడి ఇంటికి వెళ్లి మరీ పట్టుకుని కటకటాల్లో పెట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. రామచంద్రరావు అనే నిందితుడి కుటుంబ స్నేహితులైన రాజోత్తమ్ రెడ్డి దంపతులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఫిషర్పురా ప్రాంతంలో ఉంటారు. రామచంద్రరావు నివాసం జీడిమెట్ల. గురువారం సాయంత్రం రాజోత్తమ్ దంపతులు పనిమీద బయటకు వెళ్లారు.
ఆ విషయం తెలిసిన రామచంద్రరావు, వాళ్ల ఇంట్లోకి వెళ్లి బీరువా తాళం తెరిచి రూ. 4.13 లోల నగదు తీసుకున్నాడు. వాస్తవానికి ఉదయమే ఆ ఇంటికి వెళ్లిన రామచంద్రరావు, అప్పుడే అక్కడి తలుపు గడియలకున్న స్క్రూలను లూజ్ చేసి ఉంచాడని, దాంతో తర్వాత సులభంగా దాన్ని తీసేశాడని పోలీసులు చెప్పారు. గురువారం సాయంత్రం బయటి నుంచి తిరిగొచ్చిన రాజోత్తమ్ రెడ్డి భార్య కవిత.. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు. పోలీసులు చుట్టుపక్కల అంతా గాలిస్తుండగా, తన ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉందని, దాని ఫుటేజి చూడమని పక్కింట్లో ఉండే నరేష్ అనే వ్యక్తి చెప్పారు. దాంట్లో రామచంద్రరావు లోపలకు వెళ్లడం, హడావుడిగా బయటకు రావడం రికార్డయింది. పోలీసులు వెంటనే అతడి ఇంటికి వెళ్లి సోదా చేసి, మొత్తం పోయిన సొత్తంతటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే.. 17 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా ఉంటూ, చిట్‌ఫండ్ వ్యాపారంలో కూడా భాగస్వామి అయిన రామచంద్రరావు ఇలా చేశాడంటే బాధితులు నమ్మలేకపోతున్నారు. ఈ కేసును సులభంగా ఛేదించడంలో నరేష్ ఎంతగానో సాయపడ్డారని, ఆయనను అభినందించామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement