
చిరుతో కవిత సెల్పీ.. లుక్కేయండి మరీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణమంతా సందడిగా కనిపించింది. ఉల్సాసభరితంగా ఆహ్లాదకరంగా దర్శనం ఇచ్చింది. శనివారం పోలింగ్ నేపథ్యంలో ఓటు వేసేందుకు ఢిల్లీకి వచ్చిన తెలుగు ప్రాంతాల ఎంపీలు మరింత ఆకర్షణీయంగా కనిపించారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఒకరినొకరు సరదాగా పలకరించుకున్నారు. వీరిలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత మరింత ఆకట్టుకున్నారు.
తనకు ఎదురైన ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించి నమస్కారాలు చేస్తూ ముందుకు వెళ్లిన ఆమె కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ నటుడు చిరంజీవితో సరదాగా కనిపించారు. ఆయనతో కలిసి సెల్ఫీ దిగారు. కవితతోపాటు ఇతర ఎంపీలు కూడా చిరుతో సెల్ఫీలు దిగారు. ఓటింగ్ అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల ప్రకారం బీజేపీ అభ్యర్థి వెంకయ్యనాయుడికే తాము ఓటు వేశామని చెప్పారు. ఇక ఎంపీ కవిత చిరంజీవితో కలిసి దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ‘ఫ్యాన్ మూమెంట్ విత్ మెగాస్టార్’ అంటూ ట్వీట్ చేశారు.