
andhra
ఎప్పుడో 2012 సంవత్సరం నాటి పంట బీమా ఇప్పటికీ రైతులకు సరిగా అందకపోవడంతో వాళ్లు ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
ఎప్పుడో 2012 సంవత్సరం నాటి పంట బీమా ఇప్పటికీ రైతులకు సరిగా అందకపోవడంతో వాళ్లు ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ఆర్ జిల్లాలో 55వేల మంది శనగరైతులు బీమా కోసం ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు.
సాధారణంగా 2012 రబీ అంటే, కనీసం 2013 నాటికన్నా రావాలని, కానీ ఇప్పుడు 2016 గడిచిపోతున్నా చాలామందికి ఆ బీమా సొమ్ము రాలేదని.. ఇప్పుడు కూడా దీనిపై మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. వ్యవసాయ బీమా కార్పొరేషన్లపై ఒత్తిడి తెస్తే, రెండు నెలల క్రితం 29వేల మందికి సంబంధించి రూ. 132 కోట్లు విడుదల చేశారని, కానీ అందులో కూడా రూ. 95 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి వెళ్లాయని.. మిగిలిన రూ. 37 కోట్ల విషయం ఏమైందో తెలియదని చెప్పారు.
దాని సంగతి అలా ఉంటే, 55 వేల మంది రైతుల్లో మిగిలిన 26వేల మంది పరిస్థితి మరింత దయనీయంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. సాధారణంగా రైతులు ప్రీమియం చెల్లించేటపుడే వాళ్ల దరఖాస్తులో తప్పులుంటే తెలియజేయాలని, అలాగే తిరస్కరించడానికి తగిన కారణాలుంటే ఒకటి లేదా రెండు నెలల్లో తిప్పి పంపేయాలని అన్నారు. కానీ ఇక్కడ మాత్రం.. 2012 రబీకి సంబంధించి మాత్రం ఇప్పటికి మూడున్నరేళ్లయిన తర్వాత.. ఇప్పుడు వాళ్ల దరఖాస్తుల్లో తప్పులు చూపిస్తున్నారని, ఇది ఎంతవరకు ధర్మమని ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు తదితర నియోజకవర్గాలకు సంబంధించి ఈ సమస్య ఉందని ఆయన తెలిపారు. అయితే సమయానికి వ్యవసాయశాఖ మంత్రి సభలో లేకపోవడంతో, సమస్యను నోట్ చేసుకున్నానని, సంబంధిత మంత్రికి తెలియజేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానం చెప్పారు.