సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సంస్థ (టీఎస్–ఆయిల్‌ఫెడ్)లో సహకార వ్యవస్థ దెబ్బతిన్నది. నూనె గింజలు పండించే రైతు సొసైటీల ప్రాతినిధ్యం లేకుండానే ఆయిల్‌ఫెడ్ నడుస్తుండటం సహకార స్ఫూర్తికి విరుద్ధం. సొసైటీలకు ఎన్నికలు లేవు. చైర్మన్ల నియామకం లేదు. అధికారులదే హవా. ఆయిల్‌ఫెడ్ టర్నోవర్ దాదాపు రూ.300 కోట్లుంది. అందులో సుమారు రూ.100 కోట్ల డిపాజిట్లున్నాయి. కానీ, ఆ సొమ్మంతా అధికారుల చేతుల్లోనే ఉండటం విమర్శలకు తావిస్తోంది. 35 వేల మంది రైతుల వాటా సొమ్ము రూ.4 కోట్ల అతీగతీ లేదు. వారికి రావాల్సిన వాటా ఎటుపోతుందో తెలియడంలేదు. సొసైటీల కింద కోట్లాది రూపాయలతో గోదాములు నిర్మించి గాలికి వదిలేశారు. పామాయిల్ రైతులకు సేవ చేసే సంస్థగా ఆయిల్‌ఫెడ్ మిగిలిపోయింది.
నూనె గింజల రైతులను దళారుల నుంచి ఆదుకోవడానికి దాదాపు 330 సొసైటీలను తెలంగాణలో ఏర్పాటు చేశారు. ఆ సొసైటీల ఆధారంగా ఆయిల్‌ఫెడ్‌ను నెలకొల్పారు. అవి రైతుల నుంచి వేరుశనగను మద్దతు ధరకు కొనుగోలు చేసి ప్రైవేటు ఫ్యాక్టరీల్లో నూనె ఉత్పత్తి చేసి వినియోగదారులకు అందజేసేవారు. తర్వాత బీచుపల్లిలో నూనె ఉత్పత్తి ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అప్పట్లోనే దాని సామర్థ్యం రోజుకు 100 టన్నులు. అక్కడ వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తి చేసేవారు. 8 ఏళ్లు నడిచాక దాన్ని మూసేశారు. ఫ్యాక్టరీ మూతపడటంతో సొసైటీలను నిర్వీర్యం చేశారు. దీంతో వేరుశనగ పండించే సొసైటీ సభ్యులకు కనీస మద్దతు ధర అందని పరిస్థితి నెలకొంది. రైతులకు అండగా ఉండాల్సిన ఆయిల్‌ఫెడ్ చేతులెత్తేస్తోంది. సొసైటీలు నిర్వీర్యం కావడంతో రాష్ట్రంలోని దాదాపు 200 గోదాములు నిరుపయోగంగా మారాయి. కొన్నింటిని అమ్మేశారు.
నాడు ఉత్పత్తి... నేడు ప్యాకింగ్
బీచుపల్లిలో నూనె ఉత్పత్తి చేసి వినియోగదారులకు స్వచ్ఛమైన వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెలను విజయ బ్రాండ్ పేరుతో విక్రయించేవారు. బీచుపల్లి ఫ్యాక్టరీ నిలిచిపోయాక ఇప్పుడు బ్రోకర్ల నుంచి నూనెలను కొనుగోలు చేసి కేవలం ప్యాకింగ్ చేసే పరిస్థితికి ఆయిల్‌ఫెడ్ దిగజారింది. విజయ నూనెల నాణ్యతపైనా, తూకంపైనా అనేకసార్లు విమర్శలు వచ్చాయి.
సొసైటీలను నిర్వీర్యం చేశారు..
నూనె గింజల ఉత్పత్తిదారుల సొసైటీలతోనే ఆయిల్ ఫెడ్ ఏర్పడింది. కానీ సహకార స్ఫూర్తికి విరుద్ధంగా సొసైటీలను నిర్వీర్యం చేసి రైతు ప్రాతినిధ్యం లేకుండా ఆయిల్‌ఫెడ్ నడుపుతున్నారు. ఖానాపూర్ గోదాములో చౌక దుకాణం నడుపుతున్నారు.
–రుక్మారెడ్డి, ఖానాపూర్ సొసైటీ మాజీ అధ్యక్షులు, బిజినేపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
ఎన్నికలు లేకుండా చేశారు...
నూనె గింజల ఉత్పత్తిదారులతో ఏర్పాటైన 330 సొసైటీలను నిర్వీర్యం చేసి ఆయిల్‌ఫెడ్‌ను నడపడం అప్రజాస్వామికం. ఆయిల్‌ఫెడ్‌లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సహకార సొమ్మును అధికారుల చేతుల్లో పెట్టడం దారుణం.
– రావి నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయిల్‌ఫెడ్ ఉద్యోగుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment