సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించి సెషన్స్ జడ్జి స్థాయిలో హైదరాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు జీవో విడుదల చేశారు. ఫాస్ట్‌కోర్టుకు సంబంధించిన ఆదేశాలను న్యాయశాఖ ఈ ఏడాది ఇప్పటికే వెలువరించినా అందులో రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించలేదు.
తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ సెషన్స్ జడ్జి నేతృత్వంలో నిర్వహించే ప్రత్యేక న్యాయస్థానం కిందకు వస్తాయని పేర్కొన్నారు. 2016లో దాఖలైన ఓ రిట్ పిటిషన్‌పై తీర్పు సందర్భంగా ప్రతి రాష్ట్రంలోనూ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసినట్లు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment