ఆధిపత్య పోరు..!
మైనార్టీ సంక్షేమ శాఖలోకార్యదర్శి వర్సెస్ డెరైక్టర్
అధికార ఉత్తర ప్రత్యుత్తరాలపై మెమో జారీ చేసిన కార్యదర్శి
తీవ్రంగా పరిగణించి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాసిన డెరైక్టర్
ఉపముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా ఆగని వివాదం
గాడి తప్పుతున్న మైనార్టీ సంక్షేమం
సిటీబ్యూరో: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం దేవుడెరుగు గానీ....శాఖ కార్యదర్శి , డెరైక్టర్ల మధ్య ఆధిపత్య పోరు పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు లక్ష్యానికి చేరుకోగా పోగా, వాటిపై అధికారుల్లో కనీసం జవాబు దారీతనం కరువైంది. కొంత కాలంగా ఇరువురి మధ్య రగులుతున్న అంతర్గత వివాదానికి ఇటీవల ఒక అధికారి సర్వీస్ పొడిగింపు ప్రతిపాదనల వ్యవహారం మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో మైనార్టీ సంక్షేమ విభాగాలపై డెరైక్టర్ అజమాయిషీ లేకుండా చేసేవిధంగా కార్యదర్శి మెమో జారీ చేయడం సంచలనం సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన డెరైక్టర్ ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖను రాయడం చర్చనీయాంశంగా తయారైంది. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యం చేసుకున్నా వివాదానికి తెర పడనట్లు తెలుస్తోంది.
ప్రచ్ఛన్న యుద్దం..
మైనార్టీ సంక్షేమ శాఖపై ప్రత్యేకంగా మంత్రి ప్రాతినిధ్యం లేక పోవడం ఉన్నత స్థాయి అధికారుల మధ్య ఆధిపత్యం పోరుకు దారి తీసినట్లయింది. గత ఏడాది కాలంగా కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డెరైక్టర్ ఎంజే అక్బర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల కార్యదర్శి ‘‘ 2014 అక్టోబర్ 28న లేఖ నంబర్ 1501/2014-2 ద్వారా జారీ అయినా మెమో (మైనార్టీ సంక్షేమ విభాగాల ద్వారా ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు, ఉత్తర ప్రత్యుత్తరాల అంశం)’ పై తిరిగి కార్లిఫికేషన్ ఇస్తూ అదే నంబర్‌తో మరో మెమో జారీ చేయడం కలకలం రేపింది. ఈ మెమోలో ‘ మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ శాఖాపరమైన అధిపతి. డెరైక్టర్ నిధుల పంపిణీ, పాలసీ సంబంధించిన అంశాలకు పరిమితం. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ సంస్థ. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తోంది. ఇతర కార్పొరేషన్‌ల మాదిరిగా ఇండిపెండెంట్‌గా కార్యకలాపాలు కొనసాగించాలి, అంటూ పేర్కొనడం మైనార్టీ విభాగాలపై డెరైక్టర్ ఆజమాయిషి లేకుండా చేసినట్లయింది.
ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ...
రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జారీ చేసిన మెమోపై తీవ్రంగా స్పందించిన డెరైక్టర్ ఒక అడుగు ముందుకువేసి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాశారు. ఈ నెల 9వ తేదిన లేటర్ నెంబర్ సీ /49సీఎండబ్ల్యు/ఎడిఎంఎన్/2016 ద్వారా గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు , మెమోలు, ఆదేశాలను కోడ్ చేస్తూ సుమారు ఏడు పేజీల సుద్ఘీ లేఖాస్త్రాన్ని సంధించడం శాఖలో సంచలనం సృష్టించింది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 2014 అక్టోబర్ 28న జారీ చేసిన మెమోకు కార్లిఫికేషన్‌గా ఇటీవల జారీ అయినా మెమో భిన్నంగా ఉందని, ఇది పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొనడం కారద్యర్శిపై ఎదురుదాడికి దిగినట్లయింది. వాస్తవంగా 2014లో మైనార్టీ సంక్షేమ శాఖ సహయ కార్యదర్శి ఒక మెమో జారీ చేస్తూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ కిస్ట్రియన్(మైనార్టీ) కార్పొరేషన్‌లు ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు,అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు డెరైక్టర్ ద్వారా సమర్పించాలని, నేరుగా సంబంధిత శాఖ కార్యదర్శి, ప్రభుత్వానికి పంపవద్దని సూచించిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం మైనార్టీ కమిషనరేట్ (డెరైక్టరేట్) ఏర్పాటు నేపథ్యంలో జారీ చేసిన జీవో నంబర్ 37,161,130.345 లతో పాటు జారీ అయినా మెమోల్లో గల మైనార్టీ సంక్షే మ శాఖ డెరైక్టరేట్‌కు గల అధికారాలు, విభాగాల ద్వారా అమలయ్యే పథకాలపై పర్యవేక్షణ, తదితర అంశాలను డెరైక్టర్ లేఖలో వివరించారు.
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత కూడా జారీ కాబడిన మెమోలోని అంశాలను కోడ్ చేస్తూ... ఇటీవల కార్లిఫికేషన్ ఇచ్చిన మెమోను అనుసరించి తగిన పరిష్కా రం చూపాలని లేఖలో విజ్ఞప్తి చేయడం కార్యదర్శిని సవాల్ చేసినట్లయింది. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత పెరిగినట్లయింది.