
నాడు తండ్రులు.. నేడు పిల్లలు
రాజకీయాలు వారసత్వంగా పిల్లలకు రావడం పరిపాటి.
బంజారాహిల్స్‌లో రసవత్తర పోరు
బంజారాహిల్స్: రాజకీయాలు వారసత్వంగా పిల్లలకు రావడం పరిపాటి. అయితే, బంజారాహిల్స్ డివిజన్‌లో ఈ వారసత్వం రసవత్తర పోటీకి నాంది పలికింది. ఒకప్పుడు తండ్రులు ప్రత్యర్థులుగా పోటీ పడగా.. ఇప్పుడు వారి పిల్లలు ఆ పోటీని కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ బరిలో ఈ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ నుంచి ఎంపీ కె. కేశవరావు(కేకే) కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, బీజేపీ నుంచి మేచినేని కిషన్‌రావు కొడుకు శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఇప్పుడు తమ పిల్లల గెలుపు కోసం ఇరువురి తండ్రులు కృషి చేస్తున్నారు. ప్రణాళికతో ఈ ఇద్దరూ కార్యకర్తలు, తమ పరిచయస్తులతో మమేకమవుతూ ఎన్నికల గెలుపు కోసం పథకాలు రూపొందిస్తున్నారు. విజయలక్ష్మి తండ్రి కేకే మాజీ జర్నలిస్టు. శ్రీనివాస్‌రావు తండ్రి మేచినేని కిషన్‌రావు కూడా మాజీ జర్నలిస్టే. పూర్వాశ్రమంలో ఈ ఇద్దరూ ప్రత్యేకంగా పత్రికలు నడిపారు. మేచినేని కిషన్‌రావు ‘సమయం’ పత్రికను నిడిపితే.. కేకే ‘డైలీ న్యూస్’ పత్రికను నడిపారు. డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులుగా విజయలక్ష్మి, శ్రీనివాసరావు పోటీ పడుతుంటే.. గతంలో కేశవరావు, కిషన్‌రావు ఇద్దరూ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేకేపై కిషన్‌రావు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఈ ఇద్దరూ మాజీ మంత్రులు కూడా కావడం విశేషం.
కేకే కార్మికశాఖ మంత్రిగా పనిచేస్తే.. కిషన్‌రావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. మరో విషయం ఏంటంటే హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేకే, కిషన్‌రావు ఇద్దరూ తలపడ్డారు. ఈ ఎన్నికల్లో మాత్రం కిషన్‌రావుపై కేకే గెలుపొందారు. ఇలా ఈ ఇద్దరూ చాలా విషయాల్లో తలపడినవారే. కేకే, కిషన్‌రావు కూతురు, కొడుకు పోటీ చేస్తున్న డివిజన్‌లో ఈ ఆసక్తికర పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కేకే, కిషన్‌రావులు నివసించేది బంజారాహిల్స్ రోడ్ నెం.12లోనే కావడం ఒక విశేషమైతే, ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నా ఆప్యాయంగా పలకరించుకుంటారు. రాజకీయాల్లో తలపండిన ఈ ఇద్దరు నేతలు తమ పిల్లల గెలుపు కోసం వేస్తున్న ఎత్తుల్లో ఎవరు విజేతగా నిలుస్తారో అని డివిజన్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.