
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి నయీమ్‌తో సంబంధాలు
- సంచలన విషయాలు బయటపెట్టిన సినీ నిర్మాత నట్టికుమార్
- ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ సర్కారే నయీమ్‌ను పోషించింది
- నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్‌కుమార్, శివరామకృష్ణలకు కూడా నయీమ్‌తో సంబంధాలు
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది తెలుగుదేశం ప్రభుత్వమేననీ, అతడి దుర్మార్గాలకు పలువురు టీడీపీ నాయకులు అండగా నిలిచారని సినీ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. టీడీపీ నేత, ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకి నయీమ్ గ్యాంగ్‌తో సత్సం బంధాలున్నాయన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నట్టికుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ పవర్‌ప్లాంట్‌కు సంబంధించి నయీమ్‌తో అచ్చెన్నాయుడు చేతులు కలిపారన్నారు. కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
‘‘నర్సన్నపేటలోని నా థియేటర్ వెంకటేశ్వరా మహల్‌ను నయీమ్ అనుచరులు అజీజ్, అంజిరెడ్డిలు అక్రమంగా లాక్కున్నారు. ఓ స్థలం వివాదంలో రెండు నెలల క్రితం నయీమ్ గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని నా మిత్రుడితోపాటు ఓ ఎమ్మెల్యే ద్వారా సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయ్యాను. నన్ను నేను కాపాడుకోగలిగాను. ఓ రోజు ఫ్లైట్‌లో కలిసిన అచ్చెన్నాయుడితో ఈ విషయాలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. నయీమ్‌తోనే సెటిల్ చేసుకోమన్నారు. నయీమ్ అండతో ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ప్రత్యేక పాలన కొనసాగించారు. మొన్నటివరకూ విశాఖ ఏసీపీగా పనిచేసిన రమణమూర్తి, నర్సన్నపేట సీఐ చంద్రశేఖర్, డీఎస్పీ, ఎస్పీల దగ్గరకు వెళ్లాను. న్యాయం చేయమని కోరాను. ఏం చేయలేమన్నారు. రివర్స్‌లో సీఐ చంద్రశేఖర్ నన్నే బెదిరించారు’’ అని నట్టికుమార్ చెప్పారు.
థియేటర్లన్నీ నయీమ్ డబ్బుతోనే..
విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న థియేటర్లన్నీ నయీమ్ డబ్బుతోనే కడుతున్నారని నట్టికుమార్ పేర్కొన్నారు. ‘‘నయీమ్ అనుచరుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఈ థియేటర్ల దందా నడుస్తోంది. అక్కడ థియేటర్లన్నిటిలో జగ్గిరెడ్డి క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం రూ.5 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఒక్క రూపాయికి కూడా లెక్కలు ఉండవు. నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్‌కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, తెలుగులో కొన్ని చిత్రాలు చేసిన బాలీవుడ్ నటుడు-నిర్మాత సచిన్ జోషిలతోనూ నయీమ్‌కు సంబంధాలున్నాయి. సచిన్ జోషి డబ్బుతో బండ్ల గణేశ్ సినిమాలు నిర్మించారు. తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నయీమ్ మనుషులతో వసూలు చేసేందుకు సచిన్ జోషి ప్రయత్నించారు.
ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నయీమ్ అండతోనే విశాఖలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అశోక్‌కుమార్ సంపాదించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి అల్వాల్‌లో ఓ గెస్ట్‌హౌస్ ఉంది. ఆయుధాలతో సహా నయీమ్ అనుచరులు అందులో ఉన్నారు. నయీమ్ ఒక్కడే మరణించాడు. అతడి అనుచరులు, సైన్యం మరణించలేదు’’ అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నయీమ్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సిట్‌పై తనకు నమ్మకం ఉందని చెప్పారు. నయీమ్ ఆగడాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిజాయితీగా విచారణ జరిపించాలన్నారు.