Nattikumar
-
ఏడాదికి ఎనిమిది సినిమాలు చేస్తా!
‘‘నేను సినిమా రంగానికి వచ్చి 32 ఏళ్లు అవుతోంది. ఆఫీస్‌బాయ్ నుంచి నిర్మాత స్థాయికి ఎదిగాను. దాసరి నారాయణరావు, డి. రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ నా గురువులు. రమేష్ ప్రసాద్‌గారు నాకు ఆర్థికంగా అండగా నిలిచిన రోజులను మరచిపోలేను. నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’అన్నారు నిర్మాత, దర్శకుడు నట్టికుమార్. బుధవారం(సెప్టెంబరు8) నట్టికుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఏడాది నా పుట్టినరోజున ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది నాకు మరింత ప్రియమైంది. నా కుమారుడు నట్టి క్రాంతి హీరోగా నటించిన ‘సైకో వర్మ’, నా కుమార్తె నట్టి కరుణ హీరోయిన్గా పరిచయం అవుతున్న ‘డీఎస్‌జే’(దెయ్యంతో సహజీవనం) సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే 2000లో దర్శకత్వం మానేసిన నేను మళ్లీ ఇప్పుడు ‘డీఎస్‌జే’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ ఏడాది ప్రత్యేకలు ఇవి. నా కుమార్తె నట్టి కరుణ హీరోయిన్గా ఆర్టికల్ 370 అంశంపై ఓ సినిమా చేస్తున్నా. రాజశేఖర్‌గారితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. మరో మూడు సినిమాలు గురించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఎనిమిది సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. రాజశేఖర్ ‘అర్జున’ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. రామ్‌గోపాల్ వర్మతో నేను చేసిన సినిమాలు త్వరలో విడుదలవుతాయి’’ అని అన్నారు. -
కరోనా వైరస్‌కు రుణపడ్డాను
కరెంట్ ఎఫైర్స్‌ను కంటెంట్‌గా వాడుకుని సినిమాలు తీస్తుంటారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ‘కరోనా వైరస్’ చిత్రాన్ని తీశారాయన. ఈ నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ –‘‘నన్ను నమ్మి ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు. లాక్డౌన్ టైమ్‌లో హీరోలు, దర్శకులు అంట్లు తోముకుంటూ, వంటలు వండుకుంటూ, ఇళ్లు ఊడ్చుకుంటూ టైమ్‌పాస్ చేస్తే నేను మాత్రం సినిమాలు తీశాను. కరోనా వైరస్ దీవెనలు ఉండడంవల్లే ఎవరూ కరోనా బారిన పడకుండా ఈ సినిమా చేయగలిగాం. అందుకే కరోనా వైరస్‌కు రుణపడి ఉన్నాను’’ అన్నారు. ‘‘కరోనా వల్ల ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్న సమయంలో వర్మ నుండి పిలుపు వచ్చింది. ఓ కుటుంబంలా ఒకేచోట ఉంటూ నటీనటులందరం ఈ కుటుంబకథా చిత్రంలో నటించాం’’ అని శ్రీకాంత్ అయ్యంగార్, వంశీ చాగంటి, సోనియా ఆకుల అన్నారు. నిర్మాత నట్టికుమార్, దర్శకుడు అగస్త్య మంజు తదితరులు పాల్గొన్నారు. -
ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ
‘‘నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో మొదటినుంచీ సినిమాలు తీస్తూనే ఉన్నాను. నా మొదటి సినిమా ‘శివ’ నుంచి కూడా అలానే చేశాను. ‘సర్కార్, 26/11, రక్తచరిత్ర’ సినిమాలు తీశాను. ‘మర్డర్’ సినిమా కూడా నిజ జీవితాల నుంచి తీసుకున్న కథాంశమే. ఏ కథ అయినా నిజజీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిందే’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ఆయన తాజా చిత్రం ‘మర్డర్’ వివాదంలో ఇరక్కుంది. ప్రణయ్, అమృతల ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారనే వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో సినిమాను ఆపేయాలని అమృత కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ని విచారించి, తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘మర్డర్’ సినిమా ఫలానా వాళ్ల జీవితం అని ఎప్పుడూ చెప్పలేదు. ఒక కేసు చాలా పాపులర్ అయింది. అందరూ ఈ సినిమా అదే అనుకున్నారు. కానీ కాదని ఎప్పుడో చెప్పాను. కేసు పెట్టిన వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. నాకు ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, నట్టి కరుణ కూడా పాల్గొన్నారు. -
సినీ నిర్మాత నట్టి కుమార్‌కు జైలు
విజయనగరం లీగల్: చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ స్థానిక మొబైల్ మెజిస్ట్రేట్ కె.దీపదివ్యకృప శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుని న్యాయవాది ఇనుగంటి రమేష్ తెలిపిన వివరాలు.. నట్టి కుమార్ కరుణాలయ ఫిల్మ్స్ పేరుతో విశాఖలో సినీ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. 2009 సెప్టెంబర్‌లో విజయనగరంలోని రాజ్యలక్ష్మీ థియేటర్లో ‘శంఖం’ సినిమా రెండు వారాల పాటు ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యంతో రూ.6.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, వారం రోజుల తరువాత సినిమా ప్రదర్శన నిలిపేశారు. దీంతో యాజమాన్యానికి, నిర్మాతకు మధ్య వివాదం తలెత్తింది. పెద్దల జోక్యంతో నిర్మాత రూ.5.5 లక్షలు థియేటర్ యాజమాన్యానికి ఇవ్వడానికి అంగీకరించి చెక్‌ను థియేటర్ మేనేజింగ్ పార్ట్నర్ ఎ.రవికుమార్‌కు ఇచ్చారు. అయితే, నట్టి కుమార్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. దీనిపై రవికుమార్ కోర్టును ఆశ్రయించగా, నట్టికుమార్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. (విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్) -
ప్రత్యేక హోదా కోసం సినీరంగం పోరాడాలి
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలు మన సినిమాలు చూస్తున్నారు. వారు లేకుంటే మనకు (చిత్రసీమ) ఈ పేరు ప్రఖ్యాతులు ఉండవు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. హోదా సాధనకు తెలుగు చిత్రపరిశ్రమ ఏకతాటిపైకి రావాలి’’ అని నిర్మాత నట్టికుమార్ అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రత్యేక హోదా సాధన ప్రక్రియలో భాగంగా సినీ పరిశ్రమ ఒక్క రోజు బంద్ పాటించి, దీక్షకు కూర్చునేందుకు ముందుకు రావాలి. మన నిరసనలను ఏపీతో పాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లోనూ తెలియజేయవచ్చు. ఓ రోజు షూటింగ్ బంద్ చేయడంతో పాటు ఏపీలో థియేటర్లు కూడా మూసివేయాలి. ఆరుగురు సినీ పెద్దలు సినీరంగాన్ని అంతా కలుపుకుని వెళ్లకుండా కేవలం వారు మాత్రమే అమరావతికి వెళ్లి తమ మద్దతు, సినీరంగం మద్దతు చంద్రబాబునాయుడి ప్రభుత్వానికి ఉంటుందని చెప్పడం వెనక వారి స్వార్థ ప్రయోజనాలున్నాయనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలకు, పవన్‌కల్యాణ్‌కు, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలకు మద్దతు తెలపకుండా చంద్రబాబుకి తెలపడంపై అనుమానాలున్నాయి. హోదా కోసం నిరసన తెలిపేందుకు వారంలోగా ఓ తేదీ నిర్ణయించాలి. లేకుంటే సినీరంగంలోని వారిని కలుపుకుని నేనే ఒక రోజు నిరసన చేపడతా’’ అన్నారు. ఆ హక్కు ‘మా’కు లేదు ‘‘చిత్రపరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ అమ్మాయి నిరసన తెలియజేస్తే వెంటనే అత్యవసర సమావేశం నిర్వహించిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ ప్రత్యేక హోదాపై నిరసన తెలిపే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నట్టికుమార్ ప్రశ్నించారు. హోదా అంశం ఆ అమ్మాయి విషయం కంటే చిన్నదా? ఓ అమ్మాయిని ఫిల్మ్‌నగర్ నుంచి బహిష్కరించే హక్కు ‘మా’కు లేదు. ఇలాంటి నిర్ణయాలు రాచరికపు వ్యవస్థలో ఉండేవి’’ అన్నారు. -
మరో ఎన్టీఆర్ బయోపిక్: ఆత్మఘోష
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అందాల నటుడు నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా వరుసగా సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తాను ప్రధానపాత్రలో బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఇప్పటికే షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇక ప్రముఖ దర్శకుడు నట్టికుమార్ కూడా ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయనున్నట్టు ప్రకటించారు. ‘నందమూరి తారక రామారావు ఆత్మఘోష’ పేరిట ఈ సినిమాను తెరకెక్కిస్తానని, వైస్రాయ్ హోటల్ ఘటన నుంచి 2019 ఎన్నికల వరకు అన్ని నిజాలే చూపిస్తానని దర్శకుడు నట్టికుమార్ అంటున్నారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఆయనను గద్దె నుంచి దింపిన ఉదంతంలో వైస్రాయ్ ఘటన కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మీరు ఎవరు? కే రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, జెమిని కిరణ్, కేఎల్ నారాయణ ఇటీవల చంద్రబాబును కలసి సినిమా పరిశ్రమ మద్దతు ఉంటుందని చెప్పారని, చిత్ర పరిశ్రమ మొత్తం మద్దతు టీడీపీకి ఉంటుందని చెప్పడానికి వారు ఎవరని నట్టికుమార్ ప్రశ్నించారు. ఎంపీ టికెట్లు, లాబీయింగ్ వంటి స్వప్రయోజనాల కోసం వారు చంద్రబాబును కలిశారని, అలాంటప్పుడు చిత్ర పరిశ్రమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించడానికి వారు ఎవరని నిలదీశారు. ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన నిరాహార దీక్షకుగానీ, ఇతరుల ఆందోళనలకుగానీ వారు ఎందుకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు. సినీ పరిశ్రమలో మొత్తం లక్షమంది ఉన్నారని, వారందరి మద్దతు తెలుగుదేశం పార్టీకి లేదని తేల్చిచెప్పారు. నటి శ్రీరెడ్డి విషయంలో అర్జెంట్‌గా ప్రెస్‌మీట్ పెట్టిన సినీ పెద్దలు.. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మీడియా సమావేశం పెట్టి మాట్లాడలేదని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ మొత్తం ఒక్క రోజు షూటింగ్‌లు ఆపి హోదాకు మద్దతు తెలుపాలని నట్టికుమార్ సూచించారు. -
ఆది నుంచి ఆయనంతే.!
నగరంలో ఉన్నన్నాళ్లూ వివాదాలే సంచలన కేసుల్లో తెరవెనుక సెటిల్మెంట్లు టీడీపీకి అత్యంత విధేయుడిగా నడుచుకున్న అధికారి ప్రజలు,ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దురుసుతనం నట్టి కుమార్ నోటి వెంట మరోసారి బహిర్గతం సాక్షి,విశాఖపట్నం: న్యాయం చేయమంటే నా వల్ల కాదని విశాఖ ఏసీపీ రమణమూర్తి తప్పించుకున్నారని సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గ్యాంగ్ స్టర్ నయీమ్ అక్రమాలకు ఎందరో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కొమ్ముకాశారంటూ అదే సమయంలో రమణ పేరును నట్టి కుమార్ ప్రస్థావించడంతో నయీంతో రమణ సంబంధాలపై నగరంలో చర్చ జరుగుతోంది. విశాఖ ఈస్ట్ సర్కిల్ ఏసీపీగా పనిచేసిన రమణ ఆది నుంచి వివాదస్పదుడే. టీడీపీ ప్రభుత్వానికి అత్యంత విధేయునిగా పనిచేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సైతం లెక్కచేయకుండా వారి పట్ల పలుమార్లు దురుసుగా ప్రవర్తించిన రమణ వివిధ కేసుల్లో సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిలో ప్రధానంగా నగరంలో సంచలనమైన ఓ హిజ్రా హత్య కేసును నీరుగార్చడం వెనుక ఏసీపీ ప్రోద్బలం ఉందని అప్పట్లో ఆరోపణలు విన్పించాయి. ఈ కేసులో అధికారపార్టీకి చెందిన ఓ నేతను కాపాడేందుకు అప్పట్లో చాలా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. చివరికి కేసును పక్కదారి పట్టించి ఆ నేతకు ఎలాంటి సమస్య లేకుండా చేసేశారు. ఇలాంటి సెటిల్మెంట్లు ఆయనకు నిత్యకత్యమనే ఆరోపణలు గుప్పుమన్నప్పటికీ అధికార పార్టీ అండ ఉండటంతో అతనిపై జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించేవారుకాదు. ఇక ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఏ కార్యక్రమం చేపట్టినా అక్కడ రమణ వాలిపోయేవారు. వారిని అణచివేసేవారు. ఒకానొక సందర్భంలో సాక్షాత్తూ ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తించి విమర్శల పాలయ్యారు. తాజాగా నయీం కేసును కూడా రమణమూర్తి పట్టించుకోలేదని నిర్మాత నట్టికుమార్ బయటపెట్టడంతో రమణకు నయీంకు సంబంధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నయీం కేసును రమణ ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్న పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని నెలల క్రితం సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీౖయెన రమణకు వెంటనే పోస్టింగ్ ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వ్ ఉంచడం వెనక కూడా ఆయపపై వచ్చిన ఆరోపణలే కారణమని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో రమణ విశాఖలో పనిచేసినప్పుడు ఆయన డీల్ చేసిన కేసుల వివరాలను పరిశీలిస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
మంత్రి అచ్చెన్నాయుడికి నయీమ్‌తో సంబంధాలు
-
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి నయీమ్‌తో సంబంధాలు
- సంచలన విషయాలు బయటపెట్టిన సినీ నిర్మాత నట్టికుమార్ - ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ సర్కారే నయీమ్‌ను పోషించింది - నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్‌కుమార్, శివరామకృష్ణలకు కూడా నయీమ్‌తో సంబంధాలు సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది తెలుగుదేశం ప్రభుత్వమేననీ, అతడి దుర్మార్గాలకు పలువురు టీడీపీ నాయకులు అండగా నిలిచారని సినీ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. టీడీపీ నేత, ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకి నయీమ్ గ్యాంగ్‌తో సత్సం బంధాలున్నాయన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నట్టికుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ పవర్‌ప్లాంట్‌కు సంబంధించి నయీమ్‌తో అచ్చెన్నాయుడు చేతులు కలిపారన్నారు. కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ‘‘నర్సన్నపేటలోని నా థియేటర్ వెంకటేశ్వరా మహల్‌ను నయీమ్ అనుచరులు అజీజ్, అంజిరెడ్డిలు అక్రమంగా లాక్కున్నారు. ఓ స్థలం వివాదంలో రెండు నెలల క్రితం నయీమ్ గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని నా మిత్రుడితోపాటు ఓ ఎమ్మెల్యే ద్వారా సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయ్యాను. నన్ను నేను కాపాడుకోగలిగాను. ఓ రోజు ఫ్లైట్‌లో కలిసిన అచ్చెన్నాయుడితో ఈ విషయాలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. నయీమ్‌తోనే సెటిల్ చేసుకోమన్నారు. నయీమ్ అండతో ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ప్రత్యేక పాలన కొనసాగించారు. మొన్నటివరకూ విశాఖ ఏసీపీగా పనిచేసిన రమణమూర్తి, నర్సన్నపేట సీఐ చంద్రశేఖర్, డీఎస్పీ, ఎస్పీల దగ్గరకు వెళ్లాను. న్యాయం చేయమని కోరాను. ఏం చేయలేమన్నారు. రివర్స్‌లో సీఐ చంద్రశేఖర్ నన్నే బెదిరించారు’’ అని నట్టికుమార్ చెప్పారు. థియేటర్లన్నీ నయీమ్ డబ్బుతోనే.. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న థియేటర్లన్నీ నయీమ్ డబ్బుతోనే కడుతున్నారని నట్టికుమార్ పేర్కొన్నారు. ‘‘నయీమ్ అనుచరుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఈ థియేటర్ల దందా నడుస్తోంది. అక్కడ థియేటర్లన్నిటిలో జగ్గిరెడ్డి క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం రూ.5 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఒక్క రూపాయికి కూడా లెక్కలు ఉండవు. నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్‌కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, తెలుగులో కొన్ని చిత్రాలు చేసిన బాలీవుడ్ నటుడు-నిర్మాత సచిన్ జోషిలతోనూ నయీమ్‌కు సంబంధాలున్నాయి. సచిన్ జోషి డబ్బుతో బండ్ల గణేశ్ సినిమాలు నిర్మించారు. తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నయీమ్ మనుషులతో వసూలు చేసేందుకు సచిన్ జోషి ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నయీమ్ అండతోనే విశాఖలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అశోక్‌కుమార్ సంపాదించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి అల్వాల్‌లో ఓ గెస్ట్‌హౌస్ ఉంది. ఆయుధాలతో సహా నయీమ్ అనుచరులు అందులో ఉన్నారు. నయీమ్ ఒక్కడే మరణించాడు. అతడి అనుచరులు, సైన్యం మరణించలేదు’’ అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నయీమ్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సిట్‌పై తనకు నమ్మకం ఉందని చెప్పారు. నయీమ్ ఆగడాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిజాయితీగా విచారణ జరిపించాలన్నారు. -
'సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులంతా జగన్ వెంటే'
విశాఖ : సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులందరూ వైఎస్ జగన్ వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ ఛాంబర్ మాజీ ఛైర్మన్ నట్టికుమార్ అన్నారు. జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. రాజన్న రాజ్యం దగ్గరలోనే ఉందని నట్టికుమార్ అన్నారు. సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆయన తెలిపారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌పై నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్ మాటలు వింటుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యాలు చేశారు. 'నేను పవన్ అభిమానినే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన మీద అభిమానం పోయింది' అని నట్టికుమార్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ నిలబడ్డానికి వైఎస్ రాజశేఖరెడ్డి కారణమని ఆయన అన్నారు. మహోన్నతమైన వ్యక్తిపై పవన్ మాటలు సరికాదని సూచించారు. హెలికాఫ్టర్‌లో వచ్చి మాట్లాడటం కాదు, ఒక రోజు పాదయాత్ర చేయి చూద్దామని నట్టికుమార్ సవాల్ విసిరారు. మీ సినిమాల కోసం ఉరివేసుకున్న వారిని ఎన్నడైనా పరామర్శించావా అని పవన్ ను నట్టి కుమార్ ప్రశ్నించారు.