
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అందాల నటుడు నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా వరుసగా సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తాను ప్రధానపాత్రలో బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఇప్పటికే షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
ఇక ప్రముఖ దర్శకుడు నట్టికుమార్ కూడా ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయనున్నట్టు ప్రకటించారు. ‘నందమూరి తారక రామారావు ఆత్మఘోష’ పేరిట ఈ సినిమాను తెరకెక్కిస్తానని, వైస్రాయ్ హోటల్ ఘటన నుంచి 2019 ఎన్నికల వరకు అన్ని నిజాలే చూపిస్తానని దర్శకుడు నట్టికుమార్ అంటున్నారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఆయనను గద్దె నుంచి దింపిన ఉదంతంలో వైస్రాయ్ ఘటన కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
మీరు ఎవరు?
కే రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, జెమిని కిరణ్, కేఎల్ నారాయణ ఇటీవల చంద్రబాబును కలసి సినిమా పరిశ్రమ మద్దతు ఉంటుందని చెప్పారని, చిత్ర పరిశ్రమ మొత్తం మద్దతు టీడీపీకి ఉంటుందని చెప్పడానికి వారు ఎవరని నట్టికుమార్ ప్రశ్నించారు. ఎంపీ టికెట్లు, లాబీయింగ్ వంటి స్వప్రయోజనాల కోసం వారు చంద్రబాబును కలిశారని, అలాంటప్పుడు చిత్ర పరిశ్రమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించడానికి వారు ఎవరని నిలదీశారు. ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేసిన నిరాహార దీక్షకుగానీ, ఇతరుల ఆందోళనలకుగానీ వారు ఎందుకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు. సినీ పరిశ్రమలో మొత్తం లక్షమంది ఉన్నారని, వారందరి మద్దతు తెలుగుదేశం పార్టీకి లేదని తేల్చిచెప్పారు. నటి శ్రీరెడ్డి విషయంలో అర్జెంట్‌గా ప్రెస్‌మీట్ పెట్టిన సినీ పెద్దలు.. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మీడియా సమావేశం పెట్టి మాట్లాడలేదని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ మొత్తం ఒక్క రోజు షూటింగ్‌లు ఆపి హోదాకు మద్దతు తెలుపాలని నట్టికుమార్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment