
'సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులంతా జగన్ వెంటే'
విశాఖ : సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులందరూ వైఎస్ జగన్ వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ ఛాంబర్ మాజీ ఛైర్మన్ నట్టికుమార్ అన్నారు. జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. రాజన్న రాజ్యం దగ్గరలోనే ఉందని నట్టికుమార్ అన్నారు. సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆయన తెలిపారు.
జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌పై నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్ మాటలు వింటుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యాలు చేశారు. 'నేను పవన్ అభిమానినే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన మీద అభిమానం పోయింది' అని నట్టికుమార్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ నిలబడ్డానికి వైఎస్ రాజశేఖరెడ్డి కారణమని ఆయన అన్నారు. మహోన్నతమైన వ్యక్తిపై పవన్ మాటలు సరికాదని సూచించారు. హెలికాఫ్టర్‌లో వచ్చి మాట్లాడటం కాదు, ఒక రోజు పాదయాత్ర చేయి చూద్దామని నట్టికుమార్ సవాల్ విసిరారు. మీ సినిమాల కోసం ఉరివేసుకున్న వారిని ఎన్నడైనా పరామర్శించావా అని పవన్ ను నట్టి కుమార్ ప్రశ్నించారు.