
నట్టికుమార్
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలు మన సినిమాలు చూస్తున్నారు. వారు లేకుంటే మనకు (చిత్రసీమ) ఈ పేరు ప్రఖ్యాతులు ఉండవు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. హోదా సాధనకు తెలుగు చిత్రపరిశ్రమ ఏకతాటిపైకి రావాలి’’ అని నిర్మాత నట్టికుమార్ అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రత్యేక హోదా సాధన ప్రక్రియలో భాగంగా సినీ పరిశ్రమ ఒక్క రోజు బంద్ పాటించి, దీక్షకు కూర్చునేందుకు ముందుకు రావాలి. మన నిరసనలను ఏపీతో పాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లోనూ తెలియజేయవచ్చు.
ఓ రోజు షూటింగ్ బంద్ చేయడంతో పాటు ఏపీలో థియేటర్లు కూడా మూసివేయాలి. ఆరుగురు సినీ పెద్దలు సినీరంగాన్ని అంతా కలుపుకుని వెళ్లకుండా కేవలం వారు మాత్రమే అమరావతికి వెళ్లి తమ మద్దతు, సినీరంగం మద్దతు చంద్రబాబునాయుడి ప్రభుత్వానికి ఉంటుందని చెప్పడం వెనక వారి స్వార్థ ప్రయోజనాలున్నాయనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలకు, పవన్‌కల్యాణ్‌కు, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలకు మద్దతు తెలపకుండా చంద్రబాబుకి తెలపడంపై అనుమానాలున్నాయి. హోదా కోసం నిరసన తెలిపేందుకు వారంలోగా ఓ తేదీ నిర్ణయించాలి. లేకుంటే సినీరంగంలోని వారిని కలుపుకుని నేనే ఒక రోజు నిరసన చేపడతా’’ అన్నారు.
ఆ హక్కు ‘మా’కు లేదు
‘‘చిత్రపరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ అమ్మాయి నిరసన తెలియజేస్తే వెంటనే అత్యవసర సమావేశం నిర్వహించిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ ప్రత్యేక హోదాపై నిరసన తెలిపే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నట్టికుమార్ ప్రశ్నించారు. హోదా అంశం ఆ అమ్మాయి విషయం కంటే చిన్నదా? ఓ అమ్మాయిని ఫిల్మ్‌నగర్ నుంచి బహిష్కరించే హక్కు ‘మా’కు లేదు. ఇలాంటి నిర్ణయాలు రాచరికపు వ్యవస్థలో ఉండేవి’’ అన్నారు.