నియోజకవర్గానికో అగ్నిమాపక కేంద్రం
⇒హోంమంత్రి నాయిని వెల్లడి
⇒100 మినీ వాటర్ టెండర్ వెహికిల్స్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కాటన్, జిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి రెండు నుంచి మూడు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 100 మినీ వాటర్ టెండర్(మిస్ట్) వెహికిల్స్‌ను హోం కార్యదర్శి అనితా రాజేందర్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ జనరల్ రాజీవ్ రతన్‌తో కలసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...‘అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి భారీగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. 119 అగ్నిమాపక కేంద్రాలు అవసరముండగా, 100 వరకు మంజూరయ్యాయని చెప్పారు. మినీ వాటర్ టెండర్ వెహికల్స్‌ను నడిపేందుకు ప్రొఫెషనల్ డ్రైవర్లు అవసరం లేదని, అందుబాటులో ఉన్న సిబ్బందే సరిపోతారని అనితా రాజేందర్ అన్నారు. అనంతరం పీపుల్స్ ప్లాజా నుంచి వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ శిక్షణ సంస్థ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు తయారు చేసిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు.
హోంగార్డుల పర్మినెంట్‌కు సానుకూలమే
హోంగార్డులను పర్మినెంట్ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగానే ఉన్నారని నాయిని అన్నారు. హోంగార్డుల వేతనాన్ని రూ.9 వేల నుంచి 12 వేలకు పెంచడంతో పాటు వారికి డ్రెస్సులు, బస్సుపాస్‌లను కూడా ప్రభుత్వమే అందిస్తోందని అన్నారు. గతంలో హోంగార్డుగా పనిచేసి డిస్మిసయి.. ఎమ్మెల్యేగా పోటీచేసిన వ్యక్తి ఆందోళనకు దిగి అనవసర రాద్ధాంతం చేసి వార్తల్లో వ్యక్తిగా నిలవాలనుకుంటున్నాడని అన్నారు.