
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న చేపమందు పంపిణీ చేసేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ మేరకు చేపమందు పంపిణీ చేసే బత్తిన హరినాథ్ గౌడ్, కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వపరంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ గురువారం సచివాలయంలో మంత్రికి వినతిపత్రం సమర్పించారు.మంత్రి మాట్లాడుతూ.. గతేడాదిలాగే అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. వారంలో అన్ని శాఖల అధికారులతో భేటీ ఏర్పాటు చేసి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, ఆదేశాలు జారీ చేస్తామన్నారు.