‘జీవన్‌దాన్’కు ఐదు వేల మంది అంగీకారం
యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్
- మంత్రి లక్ష్మారెడ్డి, హీరో నాగార్జున
- సహా పలువురు ప్రముఖుల హాజరు
సాక్షి, హైదరాబాద్: జీవన్‌దాన్‌కు విశేష స్పందన లభించింది. చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసేందుకుగాను శనివారం ఐదువేల మంది ముందుకు వచ్చారు. ఈ మేరకు వారంతా జీవన్‌దాన్ అంగీకారపత్రంపై సంతకం చేశారు. యశోద ఆస్పత్రి, జీవన్‌దాన్ సంయుక్తంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించిన ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్‌లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సినీనటుడు అక్కినేని నాగార్జున, డీజీపీ అనురాగ్‌శర్మ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, యశోద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వరరావు, జీవన్‌దాన్ ఇన్‌చార్జి డాక్టర్ జి స్వర్ణలత, వైజీహెచ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ సహా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. జీవన్‌దాన్‌లో ఇప్పటి వరకు 18 వేల మంది దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దిందని చెప్పారు. అరుదైన కాలేయ, గుండె మార్పిడి చికిత్సలను కూడా ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. ఏటా 15 లక్షల మంది వివిధ ప్రమాదాల బారిన పడి మరణిస్తుండగా, వీరిలో 5 నుంచి 10 శాతానికి మించి కుటుంబాలు అవయవదానానికి అంగీకరించడం లేదన్నారు. నాగార్జున మాట్లాడుతూ తాను అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేసి, నిజ జీవితంలో సూపర్‌హీరో అయ్యానని అన్నారు. అవయవదానం చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైజీహెచ్ చైర్మన్ జి రవీందర్‌రావు మాట్లాడుతూ జీవన్‌దాన్‌కు అత్యాధునిక అంబులెన్స్‌ను విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల దాతల నుంచి సేకరించిన అవయవాలను వేగంగా, సురక్షితంగా స్వీకర్తల చెంతకు చేర్చవచ్చన్నారు.