నేడు అవయవ దానంపై అవగాహన సదస్సు
- హాజరుకానున్న అక్కినేని నాగార్జున
సాక్షి, సిటీబ్యూరో: అవయవ దానంపై విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలను చైతన్యపరిచేందుకు యశోద ఆస్పత్రి యాజమాన్యం, జీవన్‌దాన్ సంయుక్తంగా నడుం బిగించాయి. ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్ పేరుతో శనివారం ఉదయం 11.45 గంటలకు శిల్పారామంలోని శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమాన్ని నిర్విహ స్తున్నాయి. సినీ నటుడు అక్కినేని నాగార్జున, యశోద ఆస్పత్రి ఎమ్‌డీ జీఎస్ రావు తదితరులు పాల్గొంటారు.
అవయవ మార్పిడితో పునర్జన్మ
నగరంలోని మోహన్ ఫౌండేషన్ ద్వారా గత పదేళ్లలో 155 బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి వెయ్యి ఆర్గాన్స్‌ను సేకరించి, 854 మందికి పునర్జన్మను ప్రసాదించినట్టు చెబుతున్నారు. 2013 జులై వరకు నిమ్స్ జీవన్‌దాన్ ద్వారా 370 మందికి ప్రాణం పోశారు. కేవలం వైద్యులు నిర్ధారించిన బ్రెయిన్‌డెడ్ బాధితులే కాదు... బతికుండగానే శరీరంలో సగ భాగాన్ని బాధితులకు ఉచితంగా ఇచ్చేందుకు బంధువులూ (లైవ్ డోనర్స్) ముందుకు వస్తున్నారు. అరుదైన శస్త్ర చికిత్సలకు, ఫార్మా కంపెనీలకు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రసిద్ధి చెందిన ఆరోగ్య రాజధాని హైదరాబాద్ తాజాగా ఆర్గాన్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్లకు కేంద్ర బిందువుగా మారుతోంది.
నిమ్స్‌లో ఇప్పటి వరకు 650 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరిగితే, గ్లోబల్ ఆస్పత్రిలో 300 కాలేయ మార్పిడి, 110 మూత్ర పిండాలు, ఐదు గుండె మార్పిడి శస్త్ర చ్రికిత్సలు జరిగాయి. రాష్ట్రంలో తొలిసారిగా యశోద ఆస్పత్రిలో రెండు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గాంధీ, ఉసామనియా, కిమ్స్, అపోలో, కేర్, స్టార్, ఆస్పత్రుల్లోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఈ శస్త్ర చికిత్స చేయించుకున్న వారిలో 80 శాతం మంది సజీవంగాఉన్నట్లు సంబంధిత వైద్యులు చెబుతున్నారు.