
అవయవ దానంతో ప్రాణదానం
నగరవాసుల్లో పెరుగుతున్న అవగాహన
సాక్షి, ముంబై: అవయవ దానంపై నగరవాసుల్లో అవగాహన పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 శవదానాలు నమోదుకాగా, గత ఏడాదిలో 20 శవదానాలు మాత్రమే నమోదయ్యాయి. నగరంలో చాలా మంది శరీర అవయవాలు పనిచేయక వీటి దానం కోసం వేచి చూస్తున్నారు. గతంలో లక్షలు ఖర్చుచేసి వీటిని పొందాలనుకున్నా ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. అయితే ఇప్పుడిప్పుడే దీనిపై నగరవాసుల్లో అవగాహన పెరుగుతోంది.
ఈ ఏడాది ఇప్పటివరకు 33 కిడ్నీలు, 17 కాలేయాలు దానం చేశారు. అయితే 2013 ఏడాది మొత్తంలో దాతలు 34 కిడ్నీలు, 17 కాలేయాలే దానం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా వుండగా, నగర ఆస్పత్రులు అవయవ దానం విషయంలో 2012 రికార్డును కూడా అధిగమించనున్నాయి. 2012లో 26 శవదానాలు జరుగగా, 43 కిడ్నీలు, 18 కాలేయాల దానం జరిగింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో రెండు ఊపిరితిత్తుల దానం కూడా జరిగిందని అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా అవయవాలను ఆస్పత్రులకు సరఫరా చేసే జోనల్ ట్రాన్ప్‌ప్లాంట్ కో-ఆర్డినేషన్ కమిటీ (జెడ్‌టీసీసీ) సభ్యుడు మాట్లాడుతూ.. అవయవ దానంపై నగర వాసుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. జాతీయ మహిళా కమిషన్, మాజీ ముంబై మేయర్ నిర్మల సమంత్ ప్రభావాల్కర్ కుమార్తె (18) మెదడులో రక్తస్రావం జరగడంతో మరణించింది. ఆమెకు అవయవ దానంపై అవగాహన ఉండడంతో కూతురి అవయవాలను దానం చేసింది.
సదరు బాలిక కిడ్నీ, కాలేయం ఇద్దరు రోగులకు అమర్చడంతో ప్రాణాలను నిలబెట్టింది. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ ఏ కన్నతల్లికైనా తన కూతురి అవయవాలను దానం చేయడం చాలా కఠినంగా ఉంటుందని అన్నారు. అయితే ఆ అవయవాలు మరికొన్ని ప్రాణాలను నిలబె ట్టేందుకు ఉపయోగపడినప్పుడు దానం చేయడమే ఉత్తమమన్నారు. దీనివల్ల తమ పిల్లలు వేరే రూపంలో బతికే ఉన్నారనే ఆత్మసంతృప్తి మిగులుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా జెడ్‌టీసీపీ అధ్యక్షుడు గుస్తాద్ దేవర్ మాట్లాడుతూ.. అవయవ దానంపై నగర వాసుల్లో అవగాహన పెరగడంతో స్థానికంగా చాలా ఆస్పత్రులు అవయవ మార్పడి చేస్తున్నాయన్నారు. జెడ్‌టీసీపీలో దాదాపు 3,050 మంది రోగులు కిడ్నీ కోసం రిజిస్టర్ చేసుకోగా, 200 మంది కాలేయ మార్పిడి కోసం రిజిస్టర్ చేసుకున్నారని ఆయన వివరించారు.