
‘ఆహారం’.. ఆందోళనకరం..!
ఐదేళ్లలో 35 లక్షల ఎకరాలు తగ్గిన ఆహారధాన్యాల సాగు
తెలంగాణ అర్థగణాంక దర్శిని నివేదికలో వెల్లడైన నిజాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం భారీగా పడిపోతోంది. కరువు పరిస్థితులు... లక్షలాది ఎకరాలు బీళ్లుగా మారడం... పత్తి వంటి వాణిజ్య పంటల వైపు రైతులు తరలిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కేవలం ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం ఏకంగా 34.92 లక్షల ఎకరాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 2010-11లో రాష్ట్రంలో 86.07 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాల పంటల సాగు జరగ్గా... 2015-16లో 51.15 లక్షల ఎకరాలకు పడిపోయి 34.92 లక్షల ఎకరాలు తగ్గింది. కీలకమైన పప్పుధాన్యాల సాగు 2010-11లో 18.92 లక్షల ఎకరాలు ఉండగా... 2015-16లో అదికాస్తా 11.37 లక్షల ఎకరాలకు దిగింది. అంటే 7.55 లక్షల ఎకరాలు మేర తగ్గాయి. మరో వైపు పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. 2010-11లో పత్తి సాగు విస్తీర్ణం 34.87 లక్షల ఎకరాలు ఉండగా... 2015-16లో 44.45 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇలా 9.58 లక్షల ఎకరాలకు పెరిగింది.
తగ్గిన దిగుబడి...
ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడంతో ఆ ప్రభావం పంటల ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపింది. 2010-11లో 92.60 లక్షల మెట్రిక్ టన్నులు పండిన ఆహారధాన్యాలు... 2015-16 వచ్చే సరికి 49.35 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. అందులో కీలకమైన పప్పుధాన్యాల ఉత్పత్తి 4.74 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. ఇక కందిపప్పు ఉత్పత్తి 2010-11లో 1.51 లక్షల మెట్రిక్ టన్నులు ఉం డగా... 1.03 లక్షల మెట్రిక్ టన్నులకు దిగిం ది. అదే సమయంలో పత్తి ఉత్పత్తి 2010-11లో 30.35 లక్షల బేళ్ల నుంచి 2015-16లో 36.08 బేళ్లకు పెరిగింది. సాగు విస్తీర్ణంతో పోలిస్తే పత్తి ఉత్పత్తి పెరగలేదు.
బీళ్లుగా 15 లక్షల ఎకరాలు
రాష్ట్రంలో 1.63 కోట్ల ఎకరాల భూమి సాగుకు అనుకూలమైనా సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలే అవుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు భూములను బీళ్లుగా వదిలేస్తున్నారు. కొందరు వాణిజ్య పంటలవైపు మరలిపోవడంతో ఆహారధాన్యాల సాగు తగ్గింది. పత్తి విస్తీర్ణం పెరిగినా కరువు కారణంగా రైతులు నష్టపోయి, అప్పుల పాలయ్యారు. రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యల్లో దాదాపు 60 శాతానికి పైగా పత్తి రైతులవేనని అంచనా. అందుకే పత్తి పంటను నిరుత్సాహపరచాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. ఆహారధాన్యాల పంటలవైపు రైతులను మరల్చాలని భావిస్తోంది.