జెండా చిరిగి స్తంభం మిగిలింది | flag tore, pillar remain | Sakshi
Sakshi News home page

జెండా చిరిగి స్తంభం మిగిలింది

Published Fri, Jun 17 2016 2:22 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

జెండా చిరిగి స్తంభం మిగిలింది - Sakshi

జెండా చిరిగి స్తంభం మిగిలింది

  •                దేశంలోనే అతిపెద్ద జెండా దుస్థితి ఇది
  •                 పక్షం రోజుల్లో చిరిగిన మూడు జెండాలు
  •                 గాలి ప్రభావం తగ్గేవరకు జెండా ఎగరేయొద్దని నిర్ణయం
  •  

     సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద జెండాకు గాలి రూపంలో పెద్ద సమస్య ఎదురవుతోంది. స్తంభంపైకి పతాకాన్ని ఎక్కిస్తే చాలు పర్రున చిరిగిపోతోంది. బలంగా వీచే గాలి ప్రభావాన్ని తట్టుకునేలా ప్రత్యేక పాలిస్టర్ వస్త్రంతో రూపొందించినప్పటికీ అది తట్టుకోలేకపోతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన అతిపెద్ద జెండా పరిస్థితి ఇది. పక్షం రోజుల్లోనే మూడు జెండాలు చిరిగి పోవటంతో ప్రస్తుతం అధికారులు స్తంభం నుంచి జెండాను తాత్కాలికంగా దించివేశారు. వర్షాకాలం వచ్చినా ఇప్పటి వరకు చినుకు జాడ లేకపోవటంతో గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. 291 మీటర్ల ఎత్తులో జెండాను ఎగరేయాల్సి ఉన్నందున అక్కడ గాలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది.

     

     దీంతో జెండా చాలా వేగంగా రెపరెపలాడుతూ ఆ ఒత్తిడితో చిరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గాలి వేగం తగ్గేవరకు జెండాను ఎగరవేయొద్దని అధికారులు నిర్ణయించారు. బుధవారం  జెండా చిరగటంతో దాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయలేదు. దీనిపై ఢిల్లీలోని ‘ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు కేవీ గిల్‌తో అధికారులు చర్చించారు. గాలి ప్రభావం తీవ్రంగా ఉంటే ఏర్పాటు చేసేకొద్దీ జెండాలు చిరిగిపోతూనే ఉంటాయని, ఇది ‘మాన్యుమెంట్ ఫ్లాగ్’ కేటగిరీలోకి వస్తున్నందున కొద్దిరోజులు జెండా తొలగించినా నిబంధనలకు ఇబ్బంది ఉండదని సూచించినట్టు సమాచారం. వాతావరణ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ గాలివాటం ఎలా ఉండనుందో ముందస్తు సమాచారం ఇచ్చేలా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

     

     దీంతో అధికారులు ప్రస్తుతం జెండాను తొలగించారు. జూన్ రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దీన్ని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేశారు. దేశంలో అతి ఎత్తయిన జెండాగా రాంచీలోని పతాకం రికార్డుల్లో నిలవగా, అతి పెద్ద జెండాగా సంజీవయ్య పార్కులోని జెండా రికార్డుకెక్కింది. సరిగ్గా వారం క్రితం తొలి జెండా ఓ మూలన చిరిగిపోయింది. చిన్నగా మొదలైన చిరుగు రోజురోజుకు పెరగటంతో గుర్తించిన అధికారులు దాన్ని తొలగించి మరోటి ఏర్పా టు చేశారు. తొలి జెండాతోపాటు ముందుజాగ్రత్త చర్యగా రెండోది తెప్పించి పెట్టుకోవటంతో ఉపయోగపడింది.

     

     అది కూడా చిరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళనతో ముంబైలోని సారాబాయి ఫ్లాగ్ కంపెనీకి మూడు జెండాలను, తొలి జెండాను రూపొందించిన ఖమ్మం వాసికి మరో మూడు జెండాలకోసం ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం నాలుగు జెండాలు వచ్చాయి. రెండో జెండాను ఏర్పాటు చేసిన మూడు రోజులకే అది కూడా చిరిగిపోయింది. దీంతో  బుధ వారం మరో జెండాను ఎక్కిస్తుండగా గాలి తాకిడికి అది స్తంభంలోని ఓ అతుకు వద్ద చిక్కుకుని చిరిగిపోయింది. ఒక్కో జెండా ఖరీదు రూ.1.15 లక్షలకు పైమాటే కావటంతో అధికారులు మరో జెండా ఎగరేసే సాహసం చేయలేదు.

     

     జెండా నిర్వహణకు కమిటీ...

     ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ జెండాను హెచ్‌ఎండీఏకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని నిర్వహణకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement