కృష్ణమ్మ పరవళ్లు
శ్రీశైలానికి భారీగా వస్తున్న వరద
* ఎగువన వర్షాలతో మహోగ్రంగా ప్రవాహాలు
* నారాయణపూర్ నుంచి 2.32 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు..
* ఇప్పటికే జూరాలకు 1.28 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
* నేటి ఉదయానికి 2 నుంచి 3 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం
* వచ్చిన నీరంతా శ్రీశైలానికి.. ప్రస్తుతం 1,38,401 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
* వరదపై అప్రమత్తం కావాలి: తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచన
సాక్షి, హైదరాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది జల కళను సంతరించుకుంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ముంచెత్తుతున్న వర్షాలతో మహోగ్రంగా దిగువకు పరవళ్లు తొక్కుతోంది.
కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి ఏకంగా 2.32 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ నీరంతా జూరాల వైపు పరుగు పెడుతోంది. గురువారం సాయంత్రానికే జూరాలకు వరద ఉధృతి 1.28 లక్షల క్యూసెక్కుల మేర ఉంది. ఎగువ ప్రవాహాలు జత కలిస్తే శుక్రవారం ఉదయానికి ఇన్‌ఫ్లో ఏకంగా 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల పైచిలుకు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. దీంతో జూరాల నుంచి 1.38 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ నీరంతా శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. ఈ ప్రవాహాలు ఇలాగే కొనసాగితే... శుక్రవారం నుంచి శ్రీశైలానికి రోజుకు 20 టీఎంసీల చొప్పున నీరు వచ్చే అవకాశముందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. వరద ఉధృతి భారీగా ఉండే దృష్ట్యా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
మహోగ్ర వేగంతో..
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది విశ్వరూపం చూపిస్తోంది. అక్కడి ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్‌తో పాటు ఇతర చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో.. కర్ణాటకకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. ఆల్మట్టి డ్యామ్‌లోకి గురువారం ఉదయం లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా.. సాయంత్రానికి అది ఏకంగా 2 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఆ నీరంతటినీ దిగువన నారాయణపూర్‌కు వదులుతున్నారు.
నారాయణపూర్ ప్రాజెక్టు ఇప్పటికే నిండటంతో... ముందుజాగ్రత్తగా 2.32 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల్లోకి రోజుకు ఏకంగా 20 టీఎంసీల మేర వరద నీరు వస్తుండటంతో కేంద్ర జల సంఘం అప్రమత్తత ప్రకటించింది. ఇక నారాయణపూర్ నుంచి వదులుతున్న 2.32 లక్షల క్యూసెక్కుల ప్రవాహం జూరాల వైపు పరుగులు పెడుతోంది. గురువారం సాయంత్రానికే జూరాలకు 1.28 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి 89,986 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా మరో 45వేల క్యూసెక్కులు కలిపి మొత్తంగా 1,38,401 క్యూసెక్కులను దిగువన శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు.
శుక్రవారం ఉదయానికి జూరాలకు రెండు నుంచి మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. దీంతో నీటి విడుదలను మరింతగా పెంచనున్నారు. గురువారం సాయంత్రానికి శ్రీశైలానికి 1,38,401 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. శుక్రవారం సాయంత్రానికి ఇది భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 215.8 టీఎంసీల సామర్థ్యానికి గాను 49.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక శ్రీశైలం నుంచి 18,111 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ వాస్తవ మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 504.5 అడుగులకు నీరు చేరింది.
వరద నిర్వహణ చర్యలు చేపట్టండి
జూరాల, శ్రీశైలానికి భారీ వరద వచ్చే దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని.. వరద నిర్వహణ చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కృష్ణా బోర్డు అప్రమత్తం చేసింది. ఇప్పటికే కేంద్ర జల సంఘం చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకొని అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఇక దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి విజయవంతంగా కొనసాగుతోంది. మూడు యూనిట్ల ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
‘పుష్కల’ స్నానం
వరుణుడు కరుణించడంతో తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న కృష్ణా పుష్కరాలకు కొత్త కళ చేకూరనుంది. మరో వారం రోజుల్లోనే పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కానీ ఇటీవలి వరకూ కృష్ణాలో చుక్క నీరు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీవర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దిగువకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.