‘ఫోర్జరీ’ బాగోతానికి తెర
కుత్బుల్లాపూర్: ‘ఫోర్జరీ పనుల’ కుంభకోణానికి పోలీసులు తెర దింపారు. కేసులోని ప్రధాన సూత్రధారితో పాటు పాత్రధారులను శుక్రవారం అదుపులోకి తీసుకుని, వీరి వద్ద నుంచి రూ.7 లక్షలు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ లింగ్యానాయక్‌ల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్-15లో కాంట్రాక్టర్లుగా పనులు నిర్వహించే మాధురి, లక్ష్మణ్‌రాజు, మల్లేశ్, రాజు, రేక్యానాయక్, సుధీర్‌లు పనులు చేయకుండానే చెక్కుల ద్వారా రూ.46.35 లక్షలు డ్రా చేశారు. ఇది గుర్తించిన ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ చెన్నారెడ్డి సదరు వ్యక్తులపై ఈ నెల 4న జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోప్యంగా ఉంచిన ఈ విషయంపై ‘ఫోర్జరీ పనులు’ శీర్షికతో ఈ నెల 6న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంట్రాక్టర్లపై వివిధ సెక్షన్ల కింద కేసు చేసిన జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్ దర్యాప్తు బాధ్యతను ఎస్‌ఐ లింగ్యానాయక్‌కు అప్పగించారు.
ఆరుగురికి రిమాండ్..
ఈ కేసులో నార్త్ జోన్ ఆడిటర్ వెంకటస్వామితో పాటు కాంట్రాక్టర్లు లక్ష్మణ్‌రాజు, మల్లేశ్‌ల వద్ద సూపర్‌వైజర్లుగా పని చేసే నవీన్‌రెడ్డి, మజర్, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఉపేందర్‌రెడ్డి, విజయ్, కంప్యూటర్ ఆపరేటర్ లింగయ్యలను శుక్రవారం అరెస్టు చేసి మేడ్చల్ కోర్టుకు రిమాండ్ చేశారు. వెంకటస్వామి నుంచి రూ.5 లక్షలు, ఇతర సిబ్బంది నుంచి రూ.2 లక్షలు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.