► జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న వర్షాలతో ఏర్పడుతున్న పాట్‌హోల్స్‌ను ఎప్పటికప్పుడు పూడ్చివేస్తున్నామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఇందుకుగాను 88 తక్షణ మరమ్మతు బృందాలు, 119 మాన్సూన్ యాక్షన్ టీమ్‌లు పనిచేస్తున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ బృందాలు వర్షాలకు రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చడంతోపాటు దెబ్బతిన్న రహదారులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సీజన్‌లో 22,614 రోడ్లపై గుంతల్ని గుర్తించగా ఇప్పటివరకు 14,940 పూడ్చివేశామని పేర్కొన్నారు. 724 నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించగా 719 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 963 సివరేజి వాటర్ డ్రెయిన్లకు మరమ్మతులు చేయాల్సి ఉండగా 673 పనులు పూర్తిచేసినట్లు , 902 మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేయాల్సి ఉండగా 895 పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. పది ప్రాంతాల్లో గోడలు, ఇళ్లు కూలిపోగా వాటి వ్యర్థాలను తొలగించినట్లు తెలిపారు. కూలిపోయిన పది విద్యుత్ స్తంభాలను తొలగించామని పేర్కొన్నారు. ఈనెల 21 తేదీన మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఇప్పటి వరకు రోజువారీగా పూడ్చిన గుంతల వివరాలను పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి.
తక్షణ స్పందన..
మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్ లేకుండా తమ సిబ్బంది తక్షణం స్పందించారని తెలిపారు. ముఖ్యంగా పీవీఎన్నార్ ఎక్స్‌ప్రెస్‌వే 102 పిల్లర్, నాచారం, లంగర్‌హౌస్, నాంపల్లి స్టేషన్, లక్ష్మిదాస్ బాడా, ఒలిఫెంటా బ్రిడ్జి, కర్బలా మైదానం, ఆరాంఘర్ రైల్వే బ్రిడ్జి, మొజాంజాహి మార్కెట్, రాజŒ భవన్‌రోడ్, ఖైరతాబాద్, సరూర్‌నగర్ పీ అండ్ టీ కాలనీ, కూకట్‌పల్లి, గుడిమల్కాపూర్, విజయనగర్‌కాలనీ, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడ్డ నీటినిల్వలను తక్షణమే తొలగించారని పేర్కొన్నారు. నగరంలోని 46 ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి నీటినిల్వలు ఏర్పడకుండా తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.