నిలదీసిందని నిప్పు పెట్టారు...
కొడుకును ఎందుకు కొట్టారని అడిగినందుకు..
ఇంటిపై దాడి, మహిళపై పెట్రోల్ పోసి నిప్పు
తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్న బాధితురాలు
ఎనిమిది మంది రిమాండ్.. పరారీలో ఇద్దరు
అడ్డగుట్ట: తన కొడుకును ఎందుకు కొట్టావని నిలదీసిన పాపానికి మహిళపై ఓ వ్యక్తి కక్షగట్టాడు. తన కుటుంబసభ్యులతో ఆమె ఇంటిపై దాడి చేశాడు. అందరినీ చితకబాదాడు. అడ్డువెళ్లిన ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం...అడ్డగుట్ట వడ్డెరబస్తీకి చెందిన మల్లేష్ ఆదివారం తన వీధిలో నుంచి కారు తీస్తుండగా అదే ప్రాంతానికి చెందిన వేణు(11) అనే బాలుడు అడ్డంగా వచ్చాడు. ఆగ్రహానికి గురైన మల్లేష్ కారుదిగి ఆ బాలుడ్ని కొట్టాడు. ఇది గమనించిన శ్రీకాంత్ అనే యువకుడు ఎందుకుకొడుతున్నావని ప్రశ్నించడంతో మల్లేష్ అతడిని కూడా కొట్టాడు. దీంతో శ్రీకాంత్ తల్లి చంద్రకళ (40)(గాయపడిన మహిళ) వచ్చి ఎందుకు నా కొడుకును కొడుతున్నావని అడిగింది. దీంతో మల్లేష్-చంద్రకళల మధ్య వాగ్వాదం జరిగింది. బస్తీ నాయకులు వచ్చి ఉదయం మాట్లాడుదామని చెప్పి గొడవను అదుపు చేశారు.
ఉదయాన్నే దారుణం...
తనతో గొడవపడిన చంద్రకళపై కక్షగట్టిన మల్లేష్ సోమవారం ఉదయాన్నే తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఇంటిపై దాడి చేశాడు. చంద్రకళ కుటుంబసభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. తన పిల్లలను కాపాడుకొనేందుకు అడ్డువెళ్లినచంద్రకళపై మల్లేష్ మేనల్లుడు బంటీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం హాహాకారాలతో నిండిపోయింది. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గొడవపడుతున్న వారిని చెదరగొట్టారు. కాలినగాయాలతో పడివున్న చంద్రకళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 30 శాతం కాలిన గాయాలతో చంద్రకళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ గొడవ కారణమైన మల్లేష్(50), శివకుమార్, పొట్టికుమార్, శివ, సాయికిరణ్, బంటి, వెంకటేష్, కేతమ్మ, శంకరమ్మ, సాలమ్మ (మొత్తం 10 మంది)పై పోలీసులు 147, 148, 149 ఐపీసీ, 307 కేసులు నమోదు చేశామని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే శంకరమ్మ, సాలమ్మలు పరారీలో ఉన్నారని, మిగిలిన 8 మంది నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు.