పాలమూరుకు రూ.8,046 కోట్లు... ప్రాణహితకు రూ.7,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న, రీ ఇంజనీరింగ్ చేసిన ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో నిధుల వరద పారనుంది. సాగునీటి శాఖకు కేటాయించనున్న రూ.25 వేల కోట్ల బడ్జెట్‌లో వాటికే దాదాపు 70 శాతం నిధులు వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అత్యధికంగా రూ.8,046 కోట్లు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.7,400 కోట్లను ప్రతిపాదించారు. ప్రాజెక్టుల పురోగతి ఆధారంగా గత డిసెంబర్‌లో సమర్పించిన ప్రతిపాదనల్లో మార్పుచేర్పులు చేసిన సాగునీటి పారుదల శాఖ సోమవారం ఆర్థికశాఖకు తుది ప్రతిపాదనలు అందజేసింది. సత్వరమే పూర్తి చేసే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తుది అంచనాలను రూపొందించింది.
ప్రాజెక్టులు పూర్తయితే సిరుల పంట: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులకు ఏ మేర కు నిధులు అందుతాయన్న అంచనాలను కూడా నీటిపారుదల శాఖ వివరించింది. సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ) కింద రూ.400 కోట్లు, సమర్థ నీటి వాడక కార్యక్రమం(ఈఏపీ) కింద రూ.650 కోట్లు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి(ఆర్‌ఐడీఎఫ్) కింద రూ.400 కోట్లు వస్తాయని అంచనాల్లో చూపింది. మిగతా నిధులను రాష్ట్రం నుంచి కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో కొత్తగా చేపడుతున్న పాలమూరుకు రూ.8,046 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించగా, ప్రాణహితకు రూ.7,400 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు. డిండికి రూ.750 కోట్లకు ప్రతిపాదనలు ఇవ్వగా రీ ఇంజనీరింగ్ చేసిన దుమ్ముగూడెం(శ్రీరామ ప్రాజెక్టు)కు రూ.400 కోట్లు, కంతపనల్లికి రూ.200 కోట్లు, ఇందిరమ్మ వరద కాల్వకు రూ.505 కోట్లతో బడ్జెట్ ప్రణాళిక వేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశాలున్నాయి. అందులో ఒక్క మహబూబ్‌నగర్‌లోనే 8 లక్షలకు పైగా ఎకరాలకు నీటిని అందిచవచ్చు. ఈ నేపథ్యంలోనే పాలమూరులో నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు రూ.900 కోట్ల మేర నిధులను ప్రతిపాదించారు. ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులకు బడ్జెట్ ప్రతిపాదనల్లో ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. వీటితోపాటే నాగార్జునసాగర్, నిజాంసాగర్ ఆధునీకరణ పనులకు రూ.600 కోట్ల నిధులు కేటాయించాలని విన్నవించారు. చిన్న నీటి పారుదల శాఖకు గతంలో కేటాయించిన మాదిరే రూ.2,264.36 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖకు నివేదించారు.
నిధుల్లో అధికం భూసేకరణకే...
తమ శాఖకు రూ.25 వేల కోట్ల బడ్జెట్‌లో సింహభాగం భూసేకరణకే వెచ్చించాల్సి ఉంటుందని సాగునీటి శాఖ తేల్చి చెప్పింది. ఇందుకు మొత్తంగా రూ.5,530 కోట్లు అవసరమవుతాయని, అందులో పాలమూరు ఎత్తిపోతలకు రూ.3 వేల కోట్లు, ప్రాణహితకు రూ.1,400 కోట్లు అవసరమని తెలిపింది. ప్రాజెక్టుల పరిధిలోని సహాయ పునరావాసానికి రూ.2,512 కోట్లు ప్రతిపాదించగా.. అందులో పాలమూరు పరిధిలో రూ.1,700కోట్లు, ప్రాణహిత పరిధిలో రూ.600 కోట్లు అవసరమని వివరించారు.
కొత్త ప్రాజెక్టులకే అధిక నిధులు
Published Tue, Feb 9 2016 3:31 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement