యాకుత్‌పురా: పాత కక్షల కారణంగా నలుగురు యువకులు ముగ్గురిపై దాడి చేసిన సంఘటన హైదరాబాద్ నగరం భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ వి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టా మురాద్ మహాల్ ప్రాంతానికి చెందిన ముజఫర్ అలీ (22) చార్మినార్ సమీపంలో సెల్‌ఫోన్ రిపేరింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా శనివారం రాత్రి దుకాణం వద్దకు వచ్చిన అక్రమ్ అనే యువకుడు ముజఫర్ ఇంటి వద్ద కొందరు యువకులు గుమిగూడారని చెప్పారు. దీంతో ముజఫర్ హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి వద్ద మజాజ్ అనే యువకుడు ఇమ్రాన్, షాబాజ్, ఇమ్రోజ్‌లతో కలిసి ముజఫర్‌పై దాడికి పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారు.
ముజఫర్ ఇంటి తలుపులు కొట్టగా ఇంట్లో నుంచి ముజఫర్ తల్లి బయటికి వచ్చింది. ఎవరు కావాలని అడగ్గా.. మజాజ్ తల్లిపై దాడి చేశాడు. దీంతో ముజఫర్, మజాజ్‌ల మధ్య గొడవ జరిగింది. మజాజ్ తన వెంట ఉన్న ఇమ్రాన్, ఇమ్రోజ్, షాబాజ్‌లతో కలిసి ముజఫర్‌పై దాడికి పాల్పడ్డాడు. దాడిని అడ్డుకోవడానికి వచ్చిన అబుబాకర్, సయ్యద్ మోయిజ్‌లను సైతం మజాజ్ గ్యాంగ్ చితకబాదారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ముజఫర్, అబుబాకర్, మోయిజ్‌లు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం జరిగిన దాడిపై ముజఫర్ భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాతకక్షలతో ముగ్గురు యువకులపై దాడి
Published Sun, Aug 30 2015 6:31 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement