అయ్యో పాపం జెన్‌కో | genco record fall in the production | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం జెన్‌కో

Published Tue, Apr 19 2016 2:30 AM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

అయ్యో పాపం జెన్‌కో - Sakshi

అయ్యో పాపం జెన్‌కో

► రికార్డు స్థాయిలో పతనమైన ఉత్పత్తి సామర్థ్యం
► 2015-16లో 73.21 శాతానికి పడిపోయిన వైనం
► గత 13 ఏళ్లలో ఇదే అత్యల్పం
► జెన్‌కో ఉత్పత్తి లక్ష్యం 17,076 మిలియన్ యూనిట్లు
► ఉత్పత్తి చేసింది మాత్రం 15,123 మిలియన్ యూనిట్లే
► జెన్‌కోకు రూ.800 కోట్ల ఆదాయానికి గండి
► వినియోగదారులపై రూ.600 కోట్ల అనవసర భారం
► విద్యుత్‌కు ప్రైవేటు వైపు మొగ్గు చూపడమే కారణం

 
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యుత్‌పై ప్రేమ కొంపముంచింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఉత్పత్తి సామర్థ్యం(పీఎల్‌ఎఫ్) ‘రికార్డు’ స్థాయిలో పతనమైంది. చౌకగా లభించే జెన్‌కో విద్యుత్ కాదని అధిక ధరలతో ప్రైవేటు విద్యుత్‌ను ఇష్టారాజ్యంగా కొనుగోలు చేయడంతో సంస్థ కుంగిపోయింది. 2012-13లో 84.2 శాతంగా ఉన్న జెన్‌కో పీఎల్‌ఎఫ్.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014-15లో 80.31 శాతానికి తగ్గింది.

2015-16లో మరింత పతనమై 73.21 శాతానికి దిగజారింది. వ్యవసాయ సంక్షోభంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పడిపోయింది. అయినా.. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించడానికి ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కోలో ఉత్పత్తిని తగ్గించేశారు. దీంతో జెన్‌కో పీఎల్‌ఎఫ్ రికార్డు స్థాయిలో పతనమైంది. 2003-04 నుంచి 2015-16 మధ్య వరకు 13 ఏళ్ల పీఎల్‌ఎఫ్ గణాంకాలను పరిశీలిస్తే అత్యల్ప పీఎల్‌ఎఫ్ ఇదే కావడం గమనార్హం. ఉత్పత్తి తగ్గడంతో జెన్‌కో రూ.800 కోట్ల ఆదాయాన్ని కోల్పోగా.. అధిక ధరలు గల ప్రైవేటు విద్యుత్ వల్ల వినియోగదారులపై సుమారు రూ.600 కోట్లకు పైగా అదనపు భారం పడింది.

పీఎల్‌ఎఫ్ అంటే..?
ఓ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్ సామర్థ్యంతో పోల్చితే వాస్తవంగా జరిపిన విద్యుదుత్పత్తి శాతాన్ని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)గా పరిగణిస్తారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి 6000-7000 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. 600 మెగావాట్ల కాకతీయ-2 థర్మల్ కేంద్రం నిర్మాణం పూర్తికావడంతో మూడు నెలల కింద తెలంగాణ జెన్‌కో ప్లాంట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2282.5 మెగావాట్ల నుంచి 2882.5 మెగావాట్లకు పెరిగింది. రాష్ట్రానికి కావాల్సిన మిగిలిన విద్యుత్ ను కేంద్రం, ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు.

జెన్‌కో విద్యుత్ ధర యూనిట్‌కు సగటున రూ.4 వరకు ఉండగా..తాత్కాలిక ఒప్పందాలతో ప్రైవేటు కంపెనీల నుంచి యూనిట్‌కు రూ.5.90-6.10 వరకు చెల్లించి విద్యుత్ కొనుగోళ్లు జరుపుతున్నారు. వరుస కరువుతో వ్యవసాయం కుదేలై ఏడాదిన్నరగా విద్యుత్ డిమాండూ తగ్గిపోయింది. విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగ వాటా 30 శాతం ఉంటుందని అంచనా. ఏడాదికేడాది 8 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల కోసం ప్రభుత్వం తాత్కాలిక, మధ్య కాలిక ఒప్పందాలు కుదుర్చుకుంది.

డిమాండ్ అంచనాలు తలకిందులు కావడంతో అదనపు విద్యుత్‌ను వదులుకోవడం అనివార్యంగా మారింది. దీంతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించేందుకు జెన్‌కోలో ఉత్పత్తిని తగ్గించారు. ఎడాపెడా జెన్‌కో ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేయడంతోనే సంస్థ పీఎల్‌ఎఫ్ 73.21 శాతానికి పతనమైంది.

జనంపై రూ.600 కోట్ల భారం
ఒకసారి ప్రైవేటు కంపెనీలతో తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అనివార్య పరిస్థితిలో ఆ విద్యుత్‌ను వదులుకోవాల్సి వస్తే సదరు కంపెనీలకు డిస్కంలు విద్యుత్ ధరలో 20 శాతాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన యూనిట్‌కు రూ.1.20 పెనాల్టీ చెల్లించి ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోవచ్చు. ప్రైవేటు విద్యుత్ వదులుకొని అంతే మొత్తంలో జెన్‌కో నుంచి రూ.4  చొప్పున విద్యుత్ కొనుగోళ్లను కొనసాగిస్తే మొత్తం వ్యయం (పెనాల్టీతో కలిపి) యూనిట్‌పై రూ.5.20కు మించదు. అయితే జెన్‌కో విద్యుత్‌ను వదులుకుని ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించడంతో యూనిట్ విద్యుత్ ధర రూ.8కు పెరిగింది.

అదేలానంటే.. జెన్‌కో విద్యుత్ వదులుకున్నందుకు ఆ సంస్థకు డిస్కంలు రూ.2 చొప్పున స్థిర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రైవేటు విద్యుత్ ధర రూ.6 కలిపితే మొత్తం యూనిట్ ధర రూ.8కి చేరింది. అంటే జెన్‌కోతో పోల్చితే ప్రైవేటు విద్యుత్ ధరలు యూనిట్‌పై రూ.2.80 అధికం అన్నమాట! పీపీఏల్లో ఉండే వెసులుబాటు ప్రకారం పెనాల్టీ లేకుండా 15 శాతం విద్యుత్‌ను వదులుకోవచ్చు. కేవలం 85 శాతం విద్యుత్‌కే పెనాల్టీ వర్తిస్తుంది. ఈ నిబంధనను సైతం పరిగణలోకి తీసుకుంటే మరో 20 పైసలు కలిసొస్తుంది.

దీన్ని కూడా కలుపుకుంటే ప్రైవేటు విద్యుత్‌కు అదనంగా యూనిట్‌పై రూ.3 చెల్లించినట్టే! ఈ లెక్కన ఏడాది కాలంలో దాదాపు 2 వేల మిలియన్ యూనిట్ల జెన్‌కో విద్యుత్‌ను బ్యాక్ డౌన్ చేయడం వల్ల యూనిట్‌కు రూ.3 చొప్పున వినియోగదారులపై రూ.600 కోట్లకు పైగా అనవసర భారం పడింది. తాజాగా రూ.2 వేల కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించడం వెనుక అధిక ధరలతో ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లే కారణమన్న ఆరోపణలున్నాయి.

రూ.800 కోట్ల ఆదాయానికి గండి
రాష్ట్రంలోని ప్లాంట్ల నుంచి 2015-16లో 17,076 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయాలని జెన్‌కో లక్ష్యంగా పెట్టుకోగా .. కేవలం 15,123 మిలియన్ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. లక్ష్యంతో పోల్చితే 2 వేల మిలియన్ యూనిట్ల లోటు నమోదైంది. యూనిట్ విద్యుత్‌కు రూ.4 ధర చొప్పున లెక్కగట్టినా జెన్‌కో ఏడాది కాలంలో రూ.800 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.

ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం భారీగా పతనం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో బొగ్గు లోటు, ఉద్యమాలు, సమ్మెలు విద్యుదుత్పత్తికి ఆటంకాన్ని కలిగించేవి. సకల జనుల సమ్మె వల్ల 2013-14లో అత్యల్పంగా 74.5 శాతం పీఎల్‌ఎఫ్ నమోదైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసింది.

అయినా విద్యుదుత్పత్తి సామర్థ్యం రికార్డు స్థాయికి పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ డిమాండ్ లేని వేళల్లో తాము రూ.2-3కే యూనిట్ విద్యుత్‌ను విక్రయిస్తున్నా .. తెలంగాణ డిస్కంలు మాత్రం యూనిట్‌కు రూ.6 వరకు అధిక ధరలు చెల్లించి విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయని ఇండియా ఎనర్జీ ఎక్స్ఛేంజీ సంచలన ఆరోపణ చేసింది. విద్యుత్ చార్జీల పెంపుపై ఇటీవల ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో ఆ సంస్థ ప్రతినిధులు హాజరై విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు పాటిస్తున్న మెరిట్ ఆర్డర్‌పై థర్డ్ పార్టీ ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేశారు. చౌకగా లభించే జెన్‌కో, ఎనర్జీ ఎక్స్ఛేంజీ విద్యుత్‌ను కాదని ఖరీదైన విద్యుత్‌ను కొనుగోలు చేయడం వెనక మతలబు ఏమిటని పారిశ్రామికవేత్తలు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు.





 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement