ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా తమ్ముడి అసంతృప్తి
హైదరాబాద్ : గ్రేటర్ నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసినా పార్టీల్లో అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. కాంగ్రెస్, టీడీపీ ఆశావాహులు తమకు టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అక్బర్‌బాగ్ డివిజన్ టికెట్ ఆశించిన తెలుగుదేశం విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ రెడ్డి తనకు టికెట్ దక్కకపోవడంతో చెలరేగిపోయారు. అనుచరులతో కలిసి బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌పై దాడికి దిగారు. పార్టీ ఫ్లెక్సీలు చించేసి బీభత్సం సృష్టించారు.
విద్యార్థులు, యువజనులను పార్టీ అవసరాలకు వాడుకొని ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వమంటే విద్యార్థులు రాజకీయాలకు పనిరారంటు అవమానించారని శ్రీకాంత్ రెడ్డి వాపోయారు. ఇతర పార్టీల్లో విద్యార్థి విభాగం నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలవుతుంటే టిడిపిలో మాత్రం కనీసం కార్పోరేటర్ టికెట్ కూడా దక్కటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గాంధీ భవన్ సాక్షిగా ఇద్దరు మహిళ నేతలు కొట్లాటకు దిగారు. నేతల ఎదురుగానే బాహాబాహీకి సిద్ధం అయ్యారు. ఫలక్నూమా డివిజన్ టికెట్ కోసం మహిళా నేతలు గొడవకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు పార్టీనేతలు సర్ధి చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.