గ్రేటర్ ఎన్నికల్లో మాకు సరి లేరు: తలసాని
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమతో పోటీ పడే స్థాయిలో ఎవరూ లేరని రెండు, మూడు స్థానాలు ఎవరివో తేల్చుకోవాల్సింది టీడీపీ, కాంగ్రెస్‌లేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన మీట్ ది మీడియాలో తలసాని మాట్లాడారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే అమలు చేసిందన్నారు.
కల్యాణలక్ష్మి, పెన్షన్లు, నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ తదితర పథకాల అమలుతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రూ.25 వేల కోట్లతో ఫ్లైఓవర్లు వంటి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. పేదవారు గొప్పగా బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో నివసించే వారంతా హైదరాబాదీయులేనని, నగరంలో గత 19 మాసాలుగా అన్ని ప్రాంతాలవారు సామరస్యంగా జీవిస్తున్నారన్నారు. గ్రేటర్‌లో వంద సీట్లు గెలుస్తామని, ఎంఐఎంతో ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదని స్పష్టం చేశారు.