కులమే బలం!
‘ఎన్నికలలో ఎన్ని‘కళలో’.. ఓట్ల కోసం ఎన్ని వలలో..’ అన్నట్లుగా మారింది బల్దియా పోరు. మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో సం‘కుల’ సమరానికి తెరలేపాయి. ప్రధాన పార్టీల్లో టికెట్ల కేటాయింపుల్లో కుల సమీకరణాలు ప్రధానపాత్ర పోషించాయి. కులాల వారీగా ఆయా సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టేందుకు ఆయా కులాల జనాభా, వారి బలాబలాలను, ఓట్లశాతాన్ని బేరీజు వేసుకొనే ప్రధాన పార్టీలు పలు డివిజన్లలో టికెట్లు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. గత మూడురోజులుగా ఓట్లు.. సీట్లు లెక్కల్లో మునిగిన పార్టీలు.. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇక పార్టీ తరఫున ప్రకటించిన అభ్యర్థులకు బి-ఫారాల పంపిణీ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమయ్యాయి.
- సాక్షి, సిటీబ్యూరో
* గ్రేటర్‌లో ఆసక్తికరంగా మారిన కుల సమీకరణలు
* టికెట్ల కేటాయింపులో అన్ని పార్టీల్లోనూ తర్జన భర్జనలు
* మహిళలు, బీసీలకు పెద్దపీట వేసిన టీఆర్‌ఎస్
* కాంగ్రెస్, టీడీపీలూ బీసీలవైపే మొగ్గు
గ్రేటర్ ఎన్నికలు ఈసారి అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో అన్ని రకాల కసరత్తులు చేశాకే చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించాయి. కొన్ని పార్టీలు ఇప్పటికీ గోప్యత పాటిస్తూనే ఉన్నాయి. కుల సమీకరణల విషయంలో జాగ్రత్తలు పాటించాయి. ఏ డివిజన్‌లో ఏ సామాజిక వర్గం ప్రాబల్యం ఎంత..ఏ వర్గానికి బలం ఉందనే విషయంలో ముందస్తు అంచనాలు వేసుకుని అభ్యర్థులను ప్రకటించినట్లుగా స్పష్టమవుతోంది.
ఇక జనరల్ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ మహిళలకు సీట్లివ్వడం ద్వారా ఆయా వర్గాల ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేసింది. బీసీలకు ఈ పార్టీ అత్యధికంగా 66 సీట్లు ఇచ్చింది. టీడీపీప్రకటించిన 80 సీట్లలో బీసీలకు 51 సీట్లు కేటాయించింది. ఎంఐఎం 65 మంది అభ్యర్థులకు పార్టీ బి-ఫారాలను పంపిణీ చేసింది. ఇందులో 30 మంది బీసీ మైనార్టీలకు చోటు కల్పించింది. కాంగ్రెస్ ప్రకటించిన 125 స్థానాల్లో బీసీలకు 40 సీట్లిచ్చింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం.
అధికార టీఆర్‌ఎస్‌లో బీసీలకు 66 సీట్లు
గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో పోటీచేయనున్న అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్ 147 మంది అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. టికెట్ల కేటాయింపులో మహిళలకు పెద్దపీట వేసింది. అభ్యర్థుల జాబితాలో 78 మంది మహిళలుండడం విశేషం. ఆ తర్వాత బీసీ సామాజిక వర్గానికి 66 సీట్లిచ్చింది. ఓసీలకు 47 మందికి కార్పొరేటర్ టికెట్లిచ్చింది. ఇక ముస్లిం మైనార్టీలకు 24 సీట్లు, ఎస్సీలకు 8, ఎస్టీలకు 2 సీట్లు కేటాయించింది.
కులాల వారీగా టికెట్ల కేటాయింపును పరిశీలిస్తే.. అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి 28 సీట్లిచ్చింది. కమ్మ కులస్తులకు 4, వెలమలకు 3, కాపునాయుడులకు ఒకటి, వైశ్యులకు 2, రాజులకు 1, మార్వాడీలకు ఒకటి, ఓసీ ముస్లింలకు 7 స్థానాలిచ్చారు. ఎస్సీలకు కేటాయించిన 8 సీట్లలో ఆరు స్థానాల్లో మాదిగలు, మరో రెండు చోట్ల మాలలకు అవకాశమిచ్చారు.
బీసీల్లో కులాల వారీగా ఇలా....
బీసీలకు కేటాయించిన సీట్ల వివరాలను పరిశీలిస్తే..కులాల వారీగా మున్నూరుకాపులకు 11, యాదవులకు 9, గౌడ్‌లకు 13, పద్మశాలీలకు 3, వడ్డెర్లకు ఒకటి, ఆరెకటికలకు ఒకటి, ముదిరాజ్‌లకు 5, గంగపుత్రులకు 3, విశ్వకర్మలకు 1, నాయీ బ్రాహ్మణులకు 2, సగరలకు 1, రజకులకు 1, వరాలకు ఒకటి, కురుమలకు ఒకటి, వంజెరకు ఒకటి, బొందిలికి ఒకటి, లోధాలకు 2, మైనార్టీ బీసీలకు 9 సీట్లిచ్చారు.
టీడీపీలో బీసీలకు 51 సీట్లు
మొత్తం 80 డివిజన్లకు పోటీచేయనున్న అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఇందులో 39 మహిళలకు కేటాయించారు. మిగతా 41 స్థానాలను పురుషులకు కేటాయించారు. ఇందులో బీసీలకు 51 సీట్లు, ఓసీలకు 19, ఎస్సీలకు 6, ఎస్టీలకు ఒకటి, ముస్లిం మైనార్టీలకు మూడు స్థానాలిచ్చారు. కాగా కులాలవారీగా పరిశీలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి ఏడు, కమ్మ కులస్తులకు ఏడు, బీసీ ముస్లింలకు 12, యాదవులకు 11, గౌడ్‌లకు 9, మున్నూరుకాపులకు 6, ఎస్సీ మాదిగలకు 4, ఎస్సీ మాలలకు 2, బీసీ వడ్డెర్లకు 2, పద్మశాలీలకు 2, వెలమలకు రెండు, ముదిరాజ్‌లకు 2, మార్వాడీ, ఆరెకటిక, లోధా, శ్రీవైష్ణవ, విశ్వబ్రాహ్మణ, సూర్యవంశ కులస్తులకు ఒక్కో స్థానం కేటాయించారు. మిగతా 9 స్థానాలను మైనార్టీ బీసీలకు కేటాయించారు.
కాంగ్రెస్‌లో బీసీలకు 40 సీట్లు...
కాంగ్రెస్ 125 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది. ఇందులో బీసీలకు 40 , జనరల్‌కు 73 డివిజన్లు కేటాయించారు. ఎస్సీలకు 8, ఎస్టీలకు నాలుగు సీట్లను కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారీగా జాబితాను ప్రకటించినా కులాల జాబితా ప్రకటించకుండా జాగ్రత్తపడింది.