బెంగళూరు తరహాలో నిమజ్జనం | GHMC plans for Ganesh Immersion to Bangalore style and Special pools | Sakshi
Sakshi News home page

బెంగళూరు తరహాలో నిమజ్జనం

Published Fri, Jul 15 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

బెంగళూరు తరహాలో నిమజ్జనం

బెంగళూరు తరహాలో నిమజ్జనం

సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనానికి బెంగళూరు తరహాలో ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేయడానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. బెంగళూరు నగరంలోని ఉల్సూరు సరస్సు తరహాలో జీహెచ్‌ఎంసీలోని చర్లపల్లి చెరువులో ప్రత్యేక కొలనును గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం నిర్మించనున్నారు. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలతో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మేయర్ బొంతు రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చర్లపల్లి డివిజన్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు.

తొలిదశలో మొత్తం పది చెరువుల్లో నిమజ్జనాలకు ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేస్తామని హైకోర్టుకిచ్చిన నివేదిక కనుగుణంగా పది చెరువుల్లో ఈ ఏర్పాట్లు చేయనున్నారు. చర్లపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న కొలను అంచనా వ్యయం రూ. 67 లక్షలు. దాదాపు 2,025 చ.మీ.ల విస్తీర్ణంలో నాలుగు మీటర్ల లోతున ఉండేలా ఈ ప్రత్యేక కొలనును నిర్మించి.. ఏరోజు కారోజు నీటిని నింపుతారు. ప్రతిరోజూ నిమజ్జనం పూర్తయ్యాక విగ్రహాలను తిరిగి బయటకు తీసి ప్రత్యేక ప్రదేశానికి తరలిస్తారు. నీటిని కూడా వెలుపలికి పంపించి తిరిగి కొత్తనీటితో నింపుతారు. వీలును బట్టి చర్లపల్లి చెరువు నుంచే నీటిని కొలనులోకి తరలించడమో లేక ట్యాంకర్ల ద్వారా నింపడమో చేస్తారు.

కొలను చుట్టూ మెట్లు, తదితరమైనవి అచ్చం బెంగళూరు లోని ఉల్సూరు కొలను నమూనాలో నిర్మించనున్నారు. ఇందులో రోజుకు దాదాపు 2వేల విగ్రహాల వరకు నిమజ్జనం చేయవచ్చునని అంచనా. త్వరలో రానున్న గణేశ్ నిమజ్జన సమయానికి ఈ కొలనును వినియోగంలోకి తేవాలనేది లక్ష్యం. ఇక్కడ నిమజ్జనం చేసే విగ్రహాలను 6 నుంచి 8 అడుగులకు మించకుండా ఉండేలా, సహజ సిద్ధ రంగులతో తయారుచేసేలా పరిసరాల ప్రజలకు అవగాహన  కల్పిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. కొలను వద్ద ఎస్టీపీని కూడా ఏర్పాటుచేసి, నీటిని శుద్ధి చేశాక తిరిగి చెరువులోకి వదులుతామన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌లను ఆక్రమించిన వారు వాటిని ఖాళీ చేసి చెరువుల సుందరీకరణ పనులకు సహకరించాలని, వారికి తగిన పునరావాసం కల్పిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.
 
వచ్చే ఏడాది 50 కొలనుల ఏర్పాటు
వచ్చే సంవత్సరం గ్రేటర్‌లోని 50 చెరువుల వద్ద నిమజ్జనాలకు ప్రత్యేక కొలనులు నిర్మించనున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. గురువారం చర్లపల్లి చెరువు వద్ద నిమజ్జన కొలను(బేబీ ట్యాంక్)కు ఆయన శంకుస్థాపన చేశారు. కాగా చర్లపల్లి చెరువును రూ. 4.90 కోట్లతో సుందరీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement