నేడే మహా నిమజ్జనపర్వం..
- ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వ విభాగాలు
- 388.5 కి.మీ. మేర సాగనున్న శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జన పర్వానికి భాగ్యనగరం సర్వ సన్నద్ధమైంది. భారీ ఊరేగింపు.. టపాసుల మోతలు.. బాణసంచా వెలుగులు.. బ్యాండ్ మేళాలు.. డీజే హోరు.. భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా నేడు జరగనున్న వేడుకకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిమజ్జనోత్సవానికి అన్ని ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. నగరంలోని అన్ని మార్గాలనూ కలుపుకుని సుమారు 388.5 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్రలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు విభాగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, సీపీడీసీఎల్, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, రైల్వే, రవాణా శాఖలు నిమజ్జనానికి అన్ని వసతులు కల్పించాయి. హుస్సేన్‌సాగర్‌తోపాటు ప్రధాన నిమజ్జన కేంద్రాలైన సరూర్‌నగర్, ఐడీఎల్, హస్మత్‌పేట, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గంచెరువు, పల్లె చెరువు, పత్తికుంట చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. హుస్సేన్‌సాగర్ వద్ద 23 భారీ క్రేన్లను ఏర్పాటు చేశాయి. ఆయా ప్రాంతాల్లో సుమా రు 60 వేలకు పైగా విగ్రహాలు బుధ, గురువారాల్లో నిమజ్జనం కానున్నట్లు అంచనా.
ప్రజలు సహకరించాలి: మేయర్
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పకడ్బందీ ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని సైతం గురువారం ఉదయం 6 గంటలకే కదిలించేందుకు నిర్వాహకులు అంగీకరించారని చెప్పారు. వర్షాలు కురుస్తున్నందున మండపాల నిర్వాహకులు, కాలనీ సంఘాలు సాయంత్రానికే నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం జీహెచ్‌ఎంసీలో విలేకరుల సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లను ఆయన వెల్లడించారు. గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సంతోషంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది అనుభవం దృష్ట్యా ఈసారి నిమజ్జనం ఆలస్యం కాకుండా.. సాంప్రదాయ పద్ధతిలో శుభగడియల్లోనే నిమజ్జనం పూర్తయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ప్రజలు స్వేచ్ఛగా నిమజ్జనంలో పాల్గొనేందుకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ 040-2111 1111కు ఫోన్ చేయవచ్చని, ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రూ.7.17 కోట్లతో శోభాయాత్ర మార్గంలో రోడ్ల మరమ్మతులు, అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు.
భారీ బందోబస్తు
శోభాయాత్రలో 30 వేల మంది పోలీసులు, 13 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పాతబస్తీలో శోభాయాత్ర సాగే ప్రధాన రోడ్డు, సమస్యాత్మక ప్రాంతాలు, వినాయక మండపాలను బుధవారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్‌స చీఫ్ నవీన్ చంద్‌తో కలసి ఆయన సందర్శించారు.