Bonthu Ram Mohan
-
హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్‌లు బుధవారం ట్యాంక్ బండ్‌ను సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు. వరద నీటి దృష్ట్యా నగర వాసులంతా బయటకు రావొద్దని ఇళ్లలోని సురక్షితంగా ఉండాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు. (చదవండి: వరద బీభత్సానికి అద్దం పడుతున్న దృశ్యం) అదే విధంగా జలమండలి ఎండీ దాన కిషోర్ హిమాయత్ సాగర్‌ను సందర్శించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమావేశమయ్యారు. జలాశయం దిగువన ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ మహాత్మగాంధీ బస్‌స్టాండ్‌లోకి వరద నీరు భారీగా రావడంతో వచ్చిపోయే బస్సులకు ఆటంకం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: తెలంగాణలో ఇవాళ, రేపు సెలవులు) -
కరోనా బారిన హైదరాబాద్ మేయర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన మేయర్.. ధైర్యంగా ఉంటే కరోనా ఏమీ చేయలేదని పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల క్రితం మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా వెల్లడి కావడంతో అప్పట్లో పరీక్షలు చేయించుకోగా రెండు పర్యాయాలు నెగెటివ్‌గానే రిపోర్టులొచ్చాయి. అధికారులతో తరచూ సమీక్షలతోపాటు క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తున్న మేయర్, కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరోసారి శనివారం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆదివారం వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించగా నెగెటివ్ రిపోర్టులొచ్చాయని తెలిపారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న తాను ‘సెల్ఫ్ ఐసోలేషన్’లో ఉన్నట్లు పేర్కొన్నారు. చికిత్స పూర్తయ్యాక హాస్పిటల్స్‌లో ఉన్న కరోనా బాధితులకు వైద్యంలో భాగంగా తాను ప్లాస్మా డొనేట్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్న వారితో కలిసి పెద్దఎత్తున ప్లాస్మా డొనేట్ చేసేందుకు తెలంగాణ భవన్లో శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, మేయర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అతి త్వరలోనే సాధారణ స్థితికి వస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. -
ఒకరికొకరూ తోడుగా ఉండాలి: మేయర్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకరికొకురు తోడుగా ముందుకు నడవాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భయం విడిచి కర్తవ్యం నిర్థేశించుకుని సాగాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలందరికీ ధైర్యం చెబుతూ ముందుకు తీసుకువెళుతున్న కేటీఆర్ కరోనాపై యుద్ధంతో పాటు నగరాభివృద్ధి పనులు శరవేగంతో ఉరికిస్తున్నారన్నారు. జూలై 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా #GiftASmile కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. మంత్రి స్పూర్తితో అందరూ #GiftASmile కార్యక్రమాన్ని చేపట్టి తోటివారి ముఖాల్లో చిరువ్వులు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజున నిర్వహించే #GiftASmile కార్యక్రమంలో భాగంగా మనందరం ఇబ్బందుల్లో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి ఆసరాగా ఉందామని పిలుపునిచ్చారు. ఆయన పుట్టిన రోజుల మనం పూల బోకేలు, శాలువాలు, పత్రికా ప్రకటనలు హోర్డింగుల మీద డబ్బులు ఖర్చు చేయకుండా దానికి బదులు సాటి మనిషికి సాయపడదామని పేర్కొన్నారు. వస్తు రూపంలో కానీ, ధన రూపంలో కానీ మేరే ఇతర వ్యక్తిగత సామాజిక అవసరాలను తీర్చి #GiftASmile అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కోవిడ్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి చిరునవ్వులను కానుకగా ఇవ్వడమే మన నాయకుడికి నిజమైన జన్మదిన శుభకాంక్షలు అన్నారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పోస్టులలో #GiftASmile హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేయాలని మేయర్ కోరారు. -
‘మరిన్ని రోబోటిక్ యంత్రాలు అందుబాటులోకి’
సాక్షి, హైదరాబాద్ : మ్యాన్‌హోల్‌లోని చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ హైటెక్‌సిటీలో ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మొట్ట మొదటిసారిగా హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని తీసుకొచ్చామని అన్నారు. గతంలో మ్యాన్‌హోల్స్ లోని చెత్త తీసే క్రమంలో దురదృష్టవశాత్తు పలువురు కార్మికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ యంత్రం తొడ్పడుతుందని తెలిపారు. అలాగే కొత్త టెక్నాలజీతో తయారైన రోబోటిక్ యంత్రం ద్వారా పూడికతీత పనులు చేస్తున్నామని, ఈ యంత్రంతో 24 గంటలు పని చేయవచ్చని పేర్కొన్నారు. దీనికి నాలుగు కెమెరాలతో పాటు రోబోటిక్ లెగ్స్, ఆర్మ్స్, యూజర్ ఇంటర్ ఫేస్ డిస్ప్లేకు అనుసంధానంగా ఉంటాయన్నారు. ఈ రోబో యంత్రాలకు రహేజా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో మరిన్ని రోబోటిక్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జోనల్ కమిషనర్ హరి చందన హాజరయ్యారు. -
భారీ వర్షాలు, జీహెచ్ఎంసీ చర్యలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శుక్రవారం అర్థరాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతొ జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 384 ప్రత్యేక బృందాలను జీహెచ్ఎంసీ రంగంలోకి దించింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బుద్ద భవన్ దగ్గర ఇ.వి.డి.ఎం కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి తెల్లవారుజామున నాలుగు గంటలకు నీట మునిగిన ప్రాంతాలకు చేరుకొని సహాయక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. భారీ వర్షానికి రోడ్లపై కూలిన చెట్లను ఎన్డీఆర్ఎప్ బృందాలతో కలిసి స్వయంగా తొలిగించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన 13 ప్రత్యేక డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో నియమించారు. అత్యవసర పరిస్థుతుల్లో డయల్ 100, జిహెచ్ఎంసి కాల్ సెంటర్ 040-21111111 లకు ఫోన్ చేయాలని బల్దియా విజ్జప్తి చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో కమిషనర్ లోకేష్ కుమార్ జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించి మొత్తం 252 మొబైల్ బృందాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 132 స్టాటిక్ బృందాలు ఉన్నాయి. మొత్తం 252 మొబైల్ బృందాలలో ఇన్స్టాంట్ రిపేర్ టీమ్‌లు 79, మినీ మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు 120, మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు 38, సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు 15 ఏర్పాటు చేశారు. టాటాఏస్, ఓమ్నీ వ్యాన్, నలుగురు లేబర్లు ,ట్రీ కట్టర్, పంప్, గొడ్డళ్లు, క్రోబార్స్ తో 120 మినీ మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు సిద్దంగా ఉన్నాయి. మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు(38): ప్రతి ఇంజనీరింగ్ డివిజన్‌కు ఒక మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాన్ని కేటాయించారు. దీనిలో డి.సి.ఎం వ్యాన్‌లో ఐదుగురు లేబర్లు, ఒక జనరేటర్, నీటిని తొలగించే పంపులు, చెట్లను కట్‌చేసే మిషన్లు ఇతర పరికరాలతో సిద్దంగా ఉంటారు. సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు (15) : సెంట్రల్ కంట్రోల్ రూంలో 15 ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచారు. ప్రతి బృందంలో డి.సి.ఎం వ్యాన్, ఐదుగురు లేబర్లు, ఒక జనరేటర్, నీటిని తొలగించే పంపులు, చెట్లను కట్‌చేసే మిషన్లు ఇతర పరికరాలతో సిద్దంగా ఉంటారు. నగరంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 132 ఎమర్జెన్సీ బృందాలను నియమించారు. నలుగురు కార్మికులతో కూడిన ఒక్కో బృందం నాలాల్లో నీటి ప్రవాహాన్ని నిలువరించే ప్లాస్టిక్ కవర్లను తొలగించే పనిని చేపడతారు. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించడానికి 255 పంపులను సిద్దంగా ఉంచారు. -
మురుగు శుద్ధికి ఇక రోబోటిక్ టెక్నాలజీ
సాక్షి,సిటీబ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్‌మిషన్‌లో భాగంగా ప్రకటించిన బహిరంగ మలవిసర్జన రహితం(ఓడీఎఫ్)తోపాటు రాష్ట్రంలోని మున్సిపాల్టీలను మెరుగైన పారిశుద్ధ్యంతో ఓడీఎఫ్ ప్లస్ నగరాలుగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మురుగునీటి పైప్లైన్లు, మ్యాన్‌హోళ్లను శుద్ధిచేసే అధునాతన రోబోటిక్ సాంకేతికత పనితీరును ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీవరేజి కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే రోబోటిక్ సాంకేతికను అమలు చేస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం జలమండలి చేపట్టే నూతన ప్రాజెక్టు వ్యయంలో 0.25 శాతం సెస్ వసూలు చేసి కార్మికుల సంక్షేమం, నూతన సాంకేతిక ఆవిష్కరణల అమలు కోసం వినియోగిస్తామని ప్రకటించారు. ఇప్పటికే కార్మికులు నేరుగా మురుగునీటి పైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగకుండా జలమండలి 73 మినీ జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు మరో 70 యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మొత్తం 143 జెట్టింగ్ యంత్రాలకు తోడుగా అవసరమయితే మరిన్ని యంత్రాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఇటీవల ఉప్పల్‌లో ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. సదరు కంపెనీపై చర్యలు తీసుకోవడంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సీఐపీపీ సాంకేతికతో రోడ్డును తవ్వకుండానే ఎన్టీఆర్ మార్గ్‌లో శిథిలమైన పైపులైనుకు పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో మురుగు,మంచినీటి పైపులైన్ల జాడ తెలిపేందుకు జలమండలి అధికారులు జీఐఎస్ మ్యాపులు సిద్ధంచేయాలని ఆదేశించారు. నగరంలో వికేంద్రీకృత మురుగుశుద్ధికేంద్రాలు.. గ్రేటర్లో ఎస్టీపీల వ్యవస్థను వికేంద్రీకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం మూసీ నదిపై ఉన్న ఎస్టీపీలతో పాటు నాలాలపై ఎక్కడికక్కడ మినీ ఎస్టీపీలు నిర్మించనున్నట్లు తెలిపారు. ముందుగా 3.2 కిమీ పొడవు ఉన్న కూకట్పల్లి నాలాపై ప్రయోగాత్మకంగా మినీ ఎస్టీపీలు నిర్మించనున్నామన్నారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను సంపూర్ణ ప్రక్షాళన చేసేందుకు డ్రైనేజీ నీరు చెరువుల్లో చేరకుండా చూస్తామన్నారు. నగరంలో 100 ఫ్లాట్ల కంటే అధికంగా ఉన్న అపార్ట్మెంట్లలో తప్పనిసరిగా మినీ ఎస్టీపీలు నిర్మించుకోవాలని సూచించారు. జలమండలి ఎండీ దానకిషోర్‌కు అభినందనలు.. జలమండలి ఎండీగా దానకిషోర్ బాధ్యతలు చేపట్టిన తరువాత విప్లవాత్మక సంస్కరణలు, ఆవిష్కరణలు తీసుకువచ్చారని అభినందించారు. గ్రాండ్ పేరెంట్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ వినూత్న కార్యక్రమంతో జలంజీవం, ఇంకుడుగుంతలపై చిన్నపిల్లలకు అవగాహన కల్పించడం విశేషమన్నారు.నూతన సాంకేతికత వినియోగంలో జలమండలి అం దరికంటే ముందుందని ప్రశంసించారు. ము న్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్, జలమండలి ఈడీ సత్యనారాయణ,డైరెక్టర్లు అజ్మీ రాకృష్ణ,విజయ్‌కుమార్‌రెడ్డి,రవి,శ్రీధర్‌బాబు,సత్యసూర్యనారాయణ,సఫాయి కర్మచారి ఆందోళన్ అధ్యక్షుడు బెజవాడ విల్సన్ తదితరులున్నారు. నూతన రోబోటిక్ టెక్నాలజీ వివరాలు రోబోటిక్ 360 డిగ్రీస్ కెమెరా : బెంగుళూరుకు చెందిన సానిటర్ సంస్థ రూపొందించిన ఈ కెమెరాను మ్యాన్‌హోల్ ద్వారా సెవరెజీ పైప్లైనులోకి ప్రవేశపెడితే.. మురుగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న వస్తువులను గుర్తిస్తుంది. ఆపరేటర్ చేతిలోని రిమోట్ ద్వారా కెమెరాను పైపులో 360 డిగ్రీస్ తిప్పి అందులో అడ్డుగా ఉన్న వాటిని గుర్తించవచ్చు. కెమెరాకు దాదాపు 30 మీటర్ల పొడవున్న కేబుల్ ఉంటుంది. ఇది డ్రైనేజీ లైనులో 30మీటర్ల వరకు వెళుతుంది. కెమెరా పైపులో వెళుతుంటే పైన ఉన్న మానిటర్లో మనకు కెమెరా చిత్రికరించే వీడియోలను చూడవచ్చు. సెవర్ క్రాక్ రోబో సానిటర్ సంస్థ రూపొందించింన మినీ రోబోనే సెవర్ క్రాక్. దాదాపు 12 కిలోల బరువుండే ఈ రోబో సెవరెజీ పైపులైను అడ్డుగా ఉన్న వస్తువులను తొలగిస్తుంది. ముందుగా ఈ యంత్రాలను జెట్టింగ్ యంత్రాలకు అనుసంధానం చేస్తారు. గుండ్రంగా ఉన్న ఈ యంత్రానికి మూడు వైపులా ఆరు వరుసల్లో చిన్న చక్రాలు ఉంటాయి. వీటి సాయంతో యంత్రం సులువుగా ముందుకు సాగుతుంది. ఒకవేళ వాహనం బోల్తా పడినప్పటికీ మరో వైపు ఉన్న చక్రాల ద్వారా ముందుకు కదులుతుంది. అలాగే వీటికే ముందు భాగంలో బలమైన బ్లేడులు ఉండడంతో అడ్డుగా ఉన్న వస్తువును ముక్కలుగా కట్‌చేస్తుంది. రాళ్లు ,మట్టి, ప్లాస్టిక్ తదితర ఘన వ్యర్థాలు,ధృడమైన పదార్థాలను సైతం సులువుగా కట్‌చేస్తుంది. దీంతో మురుగు ప్రవాహాం సాఫీగా> సాగుతుంది. ఎప్పుడైనా మురుగు ప్రవాహానికి ఏ దైనా అడ్డుగా ఉంటే వెంటనే వీటిని రంగంలోకి దింపి ప్రవాహాన్ని సాఫీగా వెళ్లేలా చూడవచ్చు. గ్యాస్ డిటెక్టర్ తాగునీరు,మురుగునీటి పైపులైన్లలో ఉత్పన్నమయ్యే విష వాయువులను గుర్తించడానికి ఈ గ్యాస్ డిటెక్టర్లను వినియోగించవచ్చు.దీనికి ఉ న్న అబ్జర్వర్‌ను మ్యాన్‌హోళ్ల గుండా పైపులైన్ లోనికి పంపితే విషవాయువుల ఉనికిని గుర్తిస్తుంది. ఇక దీనికున్న డిటెక్టర్ ద్వారా పైప్‌లైన్‌లో వెలువడే మిథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ తదితర విష వాయువులను గుర్తిస్తుంది. దీంతో పారిశుద్ద్య పనులు చేపట్టే కార్మికుల జీవితాలకు భద్రత చేకూరుతుంది. -
సర్వం..ధ్వజం
వర్షాకాలం సమీపిస్తున్నా ఇంతవరకు నాలాల విస్తరణ జరగలేదు.. వర్షం వస్తే ఈసారీ ముంపు తప్పదు. ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీలు అన్ని ప్రాంతాల్లో వెలగడం లేదు.. పారిశుధ్య కార్యక్రమాలు అధ్వానంగా సాగుతున్నాయ్. రంజాన్ పనుల పేరిట నిధులు మంజూరైనా పనులు మాత్రం జరగలేదు. అధికారులు ఏం చేస్తున్నారంటూ సభ్యుల ప్రశ్నలతో బుధవారం జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సాగింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరంలోని పలు సమస్యలపై సభ్యులు ధ్వజమెత్తారు. వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలకో సారి జరిగే సమావేశంలో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని అంతా భావిస్తారు. కానీ గతంలో లేవనేత్తిన సమస్యలపైనే తిరిగి మళ్లీ ప్రస్తావించడం మామూలైంది. ప్రశ్నించేవారు.. సమస్యలు పరిష్కరించేవారు అక్కడే ఉన్నా గ్రేటర్ పాలనలో మాత్రం ఏమంత మార్పు కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన జీహెచ్ఎంసీ.. గ్రేటర్లో సంపూర్ణ ప్లాస్టిక్ వినియోగం నిషేధానికి సిద్ధమైంది. ఈమేరకు సర్వసభ్య సమావేశం ఆమోదించి, అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించడం చెప్పుకోదగ్గ అంశం. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం మొక్కుబడి తంతుగా సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు సైతం ప్రజా సమస్యలపై ధ్వజమెత్తారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, పరిష్కార మార్గాలు మాత్రం చూపడం లేదంటూ అధికారులను నిలదీశారు. సభ ఎలా సాగిందంటే... ఎల్ఈడీ వీధి దీపాలు 98 శాతం వెలుగుతున్నాయని అధికారులు చెబుతున్నా అది వాస్తవం కాదని, ఇఫ్తార్ సమయంలోనూ చీకట్లతో అవస్థలు పడుతున్నామని, రోడ్లపై చెత్త ఎప్పటికప్పుడు తరలించడం లేదని, తగినన్ని డంపర్బిన్లు, డంపర్ ప్లేసర్లు లేక చెత్త సమస్యలు తీరడం లేవని, అధికారులను సంప్రదిస్తే అది తమ బాధ్యత కాదంటున్నారని ఎంఐఎం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ ఏర్పాట్లకు సంబంధించి ఇంకా 147 పనులు ప్రారంభం కాలేదని అధికారుల నివేదికలోనే ఉందని, వాటినెప్పుడు చేస్తారని ఎంఐఎం సభ్యులు సలీంబేగ్, ఫహద్‌బిన్ అబ్దుల్, ఎండి రషీద్ ప్రశ్నించారు. రంజాన్ పనులన్నీ రెండు రోజుల్లోగా పరిష్కారం కావాలని, ఆ తర్వాత తనకు ఒక్క ఫిర్యాదు కూడా రావద్దని మేయర్.. అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్నా నాలాల విస్తరణ పనులు పూర్తికాలేదని, టెండర్లు పిలిచినా పనులు మొదలు కాలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలాలపై కప్పులేక, పూడిక తిరిగి అందులోకే చేరుతోందని, తలాబ్‌కట్ట వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతోందని సభ దృష్టికి తెచ్చారు. సఫ్దర్‌నగర్, పరికిచెరువు, ఫాక్స్‌సాగర్ తదితర ప్రాంతాల్లో పనులు జరగలేదన్నారు. లాలాపేటలో ఎనిమిదేళ్లుగా పూడిక తీసిందేలేదని టీఆర్ఎస్ సభ్యులు బంగారి ప్రకాశ్, శ్రీలత, ఎంఐఎం సభ్యులు అయేషా రూబినా, నస్రీన్ సుల్తానా, ఎండీ హుస్సేన్ తదితరులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఫాక్స్‌సాగర్‌కు సంబంధించి బహుళ అంతస్తుల భవనాలు, పట్టా భూములు ఉన్నందున.. కోర్టు కేసుల వల్ల ఆస్తుల సేకరణ జాప్యమవుతోందని సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. సఫ్దర్‌నగర్‌లో డిజైన్ మార్పుతో ఆలస్యమైందన్నారు. పూడికతీత గత సంవత్సరం ఇదే సమయానికి 32 శాతం జరగ్గా ఈ సంవత్సరం 35 శాతం జరిగిందని చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు. వివిధ మార్గాల నుంచి చార్మినార్‌కు దారితీసే రహదారుల పనులు పదేళ్లయినా పూర్తికాలేదని, ట్రాక్టర్లు లేక ఎత్తిన చెత్త రోడ్లపైనే ఉంటోందని పలువురు ఎలుగెత్తారు. అవార్డుల సంగతి అటుంచి, పారిశుధ్య పనుల్లో అవినీతిని అరికట్టాలని కోరారు. పారిశుధ్య పనులు నిర్వహించే ఎస్సార్పీలు ఏడాదిన్నరగా పనిచేయడం లేదని టీడీపీ సభ్యుడు మందడి శ్రీనివాసరావు సభ దృష్టికి తెచ్చారు. దోమల నివారణకు అదనపు డ్రైవ్‌లు చేపట్టి, అదనపు సామగ్రిని సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని మేయర్ అధికారులకు సూచించారు. చెరువులను శుభ్రపరిచాక ట్రీట్ చేసిన నీరు మాత్రమే చెరువులో చేరేలా కొత్త పాలసీ తెస్తున్నామన్నారు. వారు బదిలీ అయితే.. మీకెందుకు బాధ..? శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎస్ఎఫ్ఏ)బదిలీలపై పలువురు సభ్యులు ఆక్షేపించగా మేయర్ ఘాటుగానే సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియాల బుకింగ్‌కు ఆన్లైన్ అందుబాటులోకి తేవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా, కమిషనర్, మేయర్ వారికి తగిన సమాధానమిచ్చారు. ఎస్ఎఫ్ఏల బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని, రంజాన్ అనంతరం బదిలీ చేయాలని కోరగా, రంజాన్ తర్వాత బోనాలు, వినాయక చవితి ఉంటాయని.. ప్రత్యేక సందర్భంలేని సమయముంటుందా? అంటూ మేయర్ అన్నారు. బయోమెట్రిక్ హాజరుతోనే ఎన్నో నిధులు ఆదా అయ్యాయని, ఎస్ఎఫ్ఏలను బదిలీ చేస్తే మీకు బాధేంటని ప్రశ్నించారు. బదిలీ అయిన వారు వెంటనే విధుల్లో చేరేలా డిప్యూటీ కమిషనర్లు బాధ్యత వహించాలని జగదీశ్వర్ సూచించారు. స్పోర్ట్స్ స్టేడియాల్లో స్థానికులకు సదుపాయం, కాలనీల్లోని స్టేడియాల్లో ఇరుగుపొరుగువారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సభ్యులు శేషుకుమారి, స్వర్ణలతారెడ్డి కోరారు. క్రికెట్ కిట్ల పంపిణీల్లో అవకతవకలు జరుగుతున్నాయని విజిలెన్స్ నివేదిక ఉన్నందున జీహెచ్ఎంసీ క్యాంపుల్లోనే వీటిని పంపిణీ చేస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. అందరి కృషితోనే అవార్డులు: కమిషనర్ జనార్దన్‌రెడ్డి జీహెచ్ఎంసీకి సంవత్సర కాలంలో 13 అవార్డులు రావడం వెనుక అందరి సమష్టి కృషి ఉందని కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. దీంతో సభలోని అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలో 96 శాతం ఎల్ఈడీ వీధిదీపాలు వెలుగుతున్నాయని, అయితే 98 శాతానికి పైగా వీధిదీపాలు వెలిగితేనే ఈఈఎస్ఎల్ సంస్థకు చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం! ఇప్పటికే 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన జీహెచ్ఎంసీ.. గ్రేటర్లో ప్లాస్టిక్ వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించాలని నిర్ణయించింది. సర్వసభ్య సమావేశంలో ఈమేరకు ఆమోదం తెలుపుతూ, అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉందన్నారు. జీహెచ్ఎంసీలో రోజుకు దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, అందులో 400– 500 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలేనన్నారు. తాత్కాలిక అవసరాల నిమిత్తం ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను నిత్యజీవితంలో ఉపయోగిస్తున్నప్పటికీ ఇవి దీర్ఘకాలికంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపించి ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని మేయర్ అన్నారు. ముఖ్యంగా వర్షాలకు నాలాలు, సివరేజీ లైన్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో పేరుకుపోయి నీరు పారే దారిలేక రోడ్లు మునుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 1986 పర్యావరణ పరిరక్షణ చట్టానికి లోబడి 50 మైక్రాన్ల కన్నా అధికంగా ఉండే అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల తయారీ, సరఫరా, అమ్మకాలపై నిషేధం విధించాలని నిర్ణయించామన్నారు. ఈ అంశం స్టాండింగ్ కమిటీలో చర్చించాక ఆమోదించవచ్చని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అభ్యంతరం వ్యక్తం చేయబోగా, ప్రభుత్వ ఆమోదానికి ఎంతో సమయం పడుతుందని, అసెంబ్లీ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుందని మేయర్ బదులిచ్చారు. -
ఆస్తి పన్ను సేకరణలో జీహెచ్ఎంసీ రికార్డు
సాక్షి, హైదరాబాద్ : 2017-18 సంవత్సరానికిగానూ ఆస్తి పన్నుల సేకరణలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 1205 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా 1320.26 కోట్లతో రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 115 కోట్లు అధికం. గత ఏడాదితో పోల్చితే అడ్వర్టైజ్మెంట్ వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైంది. 2016-17లో రూ. 26.19 కోట్లు వసూలు కాగా ప్రస్తుతం రూ. 38.44 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం 42 కోట్లు ఉన్న ట్రైడ్ లైసెన్స్ వసూళ్లు ప్రస్తుతం రూ. 52 కోట్లకు చేరాయి. రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను సేకరించడం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్డన్రెడ్డి అధికారులకు అభినందనలు తెలిపారు. -
కొంచెమే ధ్వంసమైంది
- రాజధానిలో అక్రమ నిర్మాణం కూల్చివేతకు జీహెచ్ఎంసీ విఫలయత్నం - ఉన్నచోటే కుప్పకూల్చేందుకు ‘ఇంప్లోజన్’ పద్ధతిన ప్రయోగం - పిల్లర్లకు రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్‌తో కూల్చే యత్నం - కూలింది గ్రౌండ్ ఫ్లోరే... మిగతా నాలుగంతస్తులు పక్కకొరిగిన వైనం సాక్షి, హైదరాబాద్: రాజధానిలో అక్రమంగా చేపట్టిన ఓ ఐదంతస్తుల భవన నిర్మాణాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం (ఇంప్లోజన్) సాయంతో కూల్చేందుకు జీహెచ్ఎంసీ తొలిసారిగా చేసిన ప్రయత్నం పాక్షికంగానే ఫలించింది. మొత్తం నిర్మాణాన్ని రెండు మూడు నిమిషాల్లో ఉన్నచోటే కుప్పకూలుస్తామని ప్రకటించడంతో, భవనమంతా పేకమేడలా కూలుతుందనే ప్రచారం జరిగింది. కానీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడింటిదాకా ఏడు గంటలపాటు ప్రయత్నించినా నిర్మాణం పాక్షికంగానే కూలింది. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా, మొదటి అంతస్తులో పిల్లర్ల వరకు మాత్రం కూలడంతో మిగతా అంతస్తులన్నీ ఒకవైపు దిగబడి మొత్తం నిర్మాణం ప్రమాదకరంగా మారింది. దీనిపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్పందిస్తూ, ఇంప్లోజన్ పద్ధతిన కూల్చివేతను పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే చేపట్టామని చెప్పారు. పైలట్‌గా మరో రెండు 3 భవనాలను ఈ పద్ధతిన కూల్చాక పూర్తి స్థాయి కూల్చివేతలు జరుగుతాయన్నారు. ఏడు గంటల ఉత్కంఠ.. మాదాపూర్‌లోని సున్నం చెరువు బఫర్ జోన్లో సియట్ కాలనీ ప్లాట్ నెంబర్ 22లో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన జగన్మోహన్రెడ్డి ఐదంతస్తులతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నాడు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంతో దీన్నిప్పటికే రెండుసార్లు పాక్షికంగా కూల్చేశారు. అయినా నిర్మాణపు పనులు ఆపలేదు. దాంతో నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయిం చింది. అక్రమ నిర్మాణాలను త్వరితగతిన కూల్చేసేందుకు ఇంప్లోజన్ విధానాన్ని అవలంబించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ బ్లాస్టెక్ సంస్థ అందుకు ముందుకొచ్చింది. జరిగిందిదీ... కూల్చివేతకు సోమవారం ముహూర్తంగా నిర్ణయించారు. పోలీస్ బందోబస్తుతో ఉదయం ఎనిమిదింటికే రంగంలోకి దిగారు. భవనానికి మొత్తం 18 పిల్లర్లుండగా గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుల్లోని 12 పిల్లర్లకు రంధ్రాలు చేసి మధ్యాహ్నం రెండింటిదాకా వాటిలో 60 జిలిటెన్ స్టిక్స్ (డిటోనేటర్లు) అమర్చారు. అనంతరం బొంతు, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, వెస్ట్ జోనల్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి సమక్షంలో మధ్యాహ్నం 2.53కు భవనాన్ని పేల్చివేశారు. పెద్ద శబ్దంతో పాటు పరిసరాల్లో పూర్తిగా దుమ్ము అలముకుంది. కానీ పొరుగునున్న మరో భవనానికి ముప్పు తప్పించేందుకు ఒకవైపు పిల్లర్లలో జిలెటిన్లు అమర్చలేదు. దాంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని పిల్లర్లే పూర్తిగా ధ్వంసమయ్యాయి. తొలి అంతస్తులో పిల్లర్లు విరిగినా శ్లాబ్ అలాగే ఉండటంతో భవనం నిలువుగా నేలమట్టం కావడానికి బదులుగా ఒకవైపు కుంగి ప్రమాదకరంగా మారింది. మిగతా 4 అంతస్తులను జేసీబీలు, కూలీల సాయంతో తొలగించాలి. పొరుగు భవనానికి అన్ని అనుమతులూ ఉన్నందున దానికి నష్టం వాటిల్లొద్దనే అదున్నవైపు జిలెటిన్లు పెట్టలేదని అధికారులంటున్నారు. అయితే ఆ భవనమూ బఫర్ జోన్లోనే ఉండటం విశేషం! దానికి అనుమతులెలా ఇచ్చారని ప్రశ్నించగా, అది బఫర్‌జోన్‌లో ఉందని ఇప్పుడే తెలిసిందన్నా రు! అందులోని వారినీ ఖాళీ చేయిస్తా మన్నారు. ఇంతా చేసి, కూల్చేసిన భవనం ఎవరిదో చెప్పడానికి కూడా అధికారులు వెనకాముందాడారు! ‘‘యజమాని ఎవరో మాకు తెలియదు. నిర్మాణం అక్రమం గనుక కూల్చేస్తున్నాం’’ అంటూ సరిపెట్టారు!! పొరుగు భవనాలకు ఇబ్బంది ఉండదు పాక్షికంగా కూలిన ఈ నిర్మాణాన్ని రెండు మూడు రోజుల్లో మొత్తం నేలమట్టం చేస్తాం. ఇంప్లోజన్ ద్వారా కూల్చేస్తే పక్క భవనాలకు ఏ నష్టమూ ఉండదు. గత మూడేళ్లలో అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, భుజ్ తదితర పట్టణాల్లో ఇలాగే పలు భవనాలు, పారిశ్రామిక నిర్మాణాలను కూల్చేశాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయత్నం ఇదే తొలిసారి. – వి.శ్రీకాంత్, ఉత్తమ్ బ్లాస్టెక్ ఎండీ అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకే.. అక్రమ నిర్మాణాలను తక్కువ ఖర్చుతో కూల్చేందుకే ఆధు నిక పరిజ్ఞానం వైపు వెళ్లాం. 75% విజయవంతమయ్యాం. నగరంలో మిగతా జోన్లలో ఇదే తరహా కూల్చివేతలుం టాయి. ఈ విధానాన్ని సాంకేతిక నిపుణు లతో అధ్యయనం చేయిస్తాం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తాం. నాలాలపై అక్రమ భవనాల కూల్చివేతకూ ఇంప్లోజన్ విధానాన్ని పరిశీలిస్తాం. – బొంతు రామ్మోహన్,జీహెచ్ఎంసీ మేయర్ -
నేడే మహా నిమజ్జనపర్వం..
- ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వ విభాగాలు - 388.5 కి.మీ. మేర సాగనున్న శోభాయాత్ర సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జన పర్వానికి భాగ్యనగరం సర్వ సన్నద్ధమైంది. భారీ ఊరేగింపు.. టపాసుల మోతలు.. బాణసంచా వెలుగులు.. బ్యాండ్ మేళాలు.. డీజే హోరు.. భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా నేడు జరగనున్న వేడుకకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిమజ్జనోత్సవానికి అన్ని ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. నగరంలోని అన్ని మార్గాలనూ కలుపుకుని సుమారు 388.5 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్రలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు విభాగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, సీపీడీసీఎల్, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, రైల్వే, రవాణా శాఖలు నిమజ్జనానికి అన్ని వసతులు కల్పించాయి. హుస్సేన్‌సాగర్‌తోపాటు ప్రధాన నిమజ్జన కేంద్రాలైన సరూర్‌నగర్, ఐడీఎల్, హస్మత్‌పేట, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గంచెరువు, పల్లె చెరువు, పత్తికుంట చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. హుస్సేన్‌సాగర్ వద్ద 23 భారీ క్రేన్లను ఏర్పాటు చేశాయి. ఆయా ప్రాంతాల్లో సుమా రు 60 వేలకు పైగా విగ్రహాలు బుధ, గురువారాల్లో నిమజ్జనం కానున్నట్లు అంచనా. ప్రజలు సహకరించాలి: మేయర్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పకడ్బందీ ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని సైతం గురువారం ఉదయం 6 గంటలకే కదిలించేందుకు నిర్వాహకులు అంగీకరించారని చెప్పారు. వర్షాలు కురుస్తున్నందున మండపాల నిర్వాహకులు, కాలనీ సంఘాలు సాయంత్రానికే నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం జీహెచ్ఎంసీలో విలేకరుల సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లను ఆయన వెల్లడించారు. గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సంతోషంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది అనుభవం దృష్ట్యా ఈసారి నిమజ్జనం ఆలస్యం కాకుండా.. సాంప్రదాయ పద్ధతిలో శుభగడియల్లోనే నిమజ్జనం పూర్తయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ప్రజలు స్వేచ్ఛగా నిమజ్జనంలో పాల్గొనేందుకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు డయల్ 100, జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ 040-2111 1111కు ఫోన్ చేయవచ్చని, ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రూ.7.17 కోట్లతో శోభాయాత్ర మార్గంలో రోడ్ల మరమ్మతులు, అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. భారీ బందోబస్తు శోభాయాత్రలో 30 వేల మంది పోలీసులు, 13 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పాతబస్తీలో శోభాయాత్ర సాగే ప్రధాన రోడ్డు, సమస్యాత్మక ప్రాంతాలు, వినాయక మండపాలను బుధవారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స చీఫ్ నవీన్ చంద్‌తో కలసి ఆయన సందర్శించారు.