కొంచెమే ధ్వంసమైంది
- రాజధానిలో అక్రమ నిర్మాణం కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ విఫలయత్నం
- ఉన్నచోటే కుప్పకూల్చేందుకు ‘ఇంప్లోజన్’ పద్ధతిన ప్రయోగం
- పిల్లర్లకు రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్‌తో కూల్చే యత్నం
- కూలింది గ్రౌండ్ ఫ్లోరే... మిగతా నాలుగంతస్తులు పక్కకొరిగిన వైనం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో అక్రమంగా చేపట్టిన ఓ ఐదంతస్తుల భవన నిర్మాణాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం (ఇంప్లోజన్) సాయంతో కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ తొలిసారిగా చేసిన ప్రయత్నం పాక్షికంగానే ఫలించింది. మొత్తం నిర్మాణాన్ని రెండు మూడు నిమిషాల్లో ఉన్నచోటే కుప్పకూలుస్తామని ప్రకటించడంతో, భవనమంతా పేకమేడలా కూలుతుందనే ప్రచారం జరిగింది. కానీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడింటిదాకా ఏడు గంటలపాటు ప్రయత్నించినా నిర్మాణం పాక్షికంగానే కూలింది. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా, మొదటి అంతస్తులో పిల్లర్ల వరకు మాత్రం కూలడంతో మిగతా అంతస్తులన్నీ ఒకవైపు దిగబడి మొత్తం నిర్మాణం ప్రమాదకరంగా మారింది. దీనిపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్పందిస్తూ, ఇంప్లోజన్ పద్ధతిన కూల్చివేతను పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే చేపట్టామని చెప్పారు. పైలట్‌గా మరో రెండు 3 భవనాలను ఈ పద్ధతిన కూల్చాక పూర్తి స్థాయి కూల్చివేతలు జరుగుతాయన్నారు.
ఏడు గంటల ఉత్కంఠ..
మాదాపూర్‌లోని సున్నం చెరువు బఫర్ జోన్‌లో సియట్ కాలనీ ప్లాట్ నెంబర్ 22లో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన జగన్‌మోహన్‌రెడ్డి ఐదంతస్తులతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నాడు. జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంతో దీన్నిప్పటికే రెండుసార్లు పాక్షికంగా కూల్చేశారు. అయినా నిర్మాణపు పనులు ఆపలేదు. దాంతో నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయిం చింది. అక్రమ నిర్మాణాలను త్వరితగతిన కూల్చేసేందుకు ఇంప్లోజన్ విధానాన్ని అవలంబించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ బ్లాస్టెక్ సంస్థ అందుకు ముందుకొచ్చింది.
జరిగిందిదీ...
కూల్చివేతకు సోమవారం ముహూర్తంగా నిర్ణయించారు. పోలీస్ బందోబస్తుతో ఉదయం ఎనిమిదింటికే రంగంలోకి దిగారు. భవనానికి మొత్తం 18 పిల్లర్లుండగా గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుల్లోని 12 పిల్లర్లకు రంధ్రాలు చేసి మధ్యాహ్నం రెండింటిదాకా వాటిలో 60 జిలిటెన్ స్టిక్స్ (డిటోనేటర్లు) అమర్చారు. అనంతరం బొంతు, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, వెస్ట్ జోనల్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి సమక్షంలో మధ్యాహ్నం 2.53కు భవనాన్ని పేల్చివేశారు. పెద్ద శబ్దంతో పాటు పరిసరాల్లో పూర్తిగా దుమ్ము అలముకుంది. కానీ పొరుగునున్న మరో భవనానికి ముప్పు తప్పించేందుకు ఒకవైపు పిల్లర్లలో జిలెటిన్లు అమర్చలేదు. దాంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని పిల్లర్లే పూర్తిగా ధ్వంసమయ్యాయి.
తొలి అంతస్తులో పిల్లర్లు విరిగినా శ్లాబ్ అలాగే ఉండటంతో భవనం నిలువుగా నేలమట్టం కావడానికి బదులుగా ఒకవైపు కుంగి ప్రమాదకరంగా మారింది. మిగతా 4 అంతస్తులను జేసీబీలు, కూలీల సాయంతో తొలగించాలి. పొరుగు భవనానికి అన్ని అనుమతులూ ఉన్నందున దానికి నష్టం వాటిల్లొద్దనే అదున్నవైపు జిలెటిన్లు పెట్టలేదని అధికారులంటున్నారు. అయితే ఆ భవనమూ బఫర్ జోన్‌లోనే ఉండటం విశేషం! దానికి అనుమతులెలా ఇచ్చారని ప్రశ్నించగా, అది బఫర్‌జోన్‌లో ఉందని ఇప్పుడే తెలిసిందన్నా రు! అందులోని వారినీ ఖాళీ చేయిస్తా మన్నారు. ఇంతా చేసి, కూల్చేసిన భవనం ఎవరిదో చెప్పడానికి కూడా అధికారులు వెనకాముందాడారు! ‘‘యజమాని ఎవరో మాకు తెలియదు. నిర్మాణం అక్రమం గనుక కూల్చేస్తున్నాం’’ అంటూ సరిపెట్టారు!!
పొరుగు భవనాలకు ఇబ్బంది ఉండదు
పాక్షికంగా కూలిన ఈ నిర్మాణాన్ని రెండు మూడు రోజుల్లో మొత్తం నేలమట్టం చేస్తాం. ఇంప్లోజన్ ద్వారా కూల్చేస్తే పక్క భవనాలకు ఏ నష్టమూ ఉండదు. గత మూడేళ్లలో అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, భుజ్ తదితర పట్టణాల్లో ఇలాగే పలు భవనాలు, పారిశ్రామిక నిర్మాణాలను కూల్చేశాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయత్నం ఇదే తొలిసారి.
– వి.శ్రీకాంత్, ఉత్తమ్ బ్లాస్టెక్ ఎండీ
అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకే..
అక్రమ నిర్మాణాలను తక్కువ ఖర్చుతో కూల్చేందుకే ఆధు నిక పరిజ్ఞానం వైపు వెళ్లాం. 75% విజయవంతమయ్యాం. నగరంలో మిగతా జోన్లలో ఇదే తరహా కూల్చివేతలుం టాయి. ఈ విధానాన్ని సాంకేతిక నిపుణు లతో అధ్యయనం చేయిస్తాం. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తాం. నాలాలపై అక్రమ భవనాల కూల్చివేతకూ ఇంప్లోజన్ విధానాన్ని పరిశీలిస్తాం.
– బొంతు రామ్మోహన్,జీహెచ్‌ఎంసీ మేయర్