వర్షాకాలం సమీపిస్తున్నా ఇంతవరకు నాలాల విస్తరణ జరగలేదు.. వర్షం వస్తే ఈసారీ ముంపు తప్పదు. ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీలు అన్ని ప్రాంతాల్లో వెలగడం లేదు.. పారిశుధ్య కార్యక్రమాలు అధ్వానంగా సాగుతున్నాయ్. రంజాన్ పనుల పేరిట నిధులు మంజూరైనా పనులు మాత్రం జరగలేదు. అధికారులు ఏం చేస్తున్నారంటూ సభ్యుల ప్రశ్నలతో బుధవారం జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం సాగింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరంలోని పలు సమస్యలపై సభ్యులు ధ్వజమెత్తారు.
వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలకో సారి జరిగే సమావేశంలో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని అంతా భావిస్తారు. కానీ గతంలో లేవనేత్తిన సమస్యలపైనే తిరిగి మళ్లీ ప్రస్తావించడం మామూలైంది. ప్రశ్నించేవారు.. సమస్యలు పరిష్కరించేవారు అక్కడే ఉన్నా గ్రేటర్ పాలనలో మాత్రం ఏమంత మార్పు కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన జీహెచ్‌ఎంసీ.. గ్రేటర్‌లో సంపూర్ణ ప్లాస్టిక్ వినియోగం నిషేధానికి సిద్ధమైంది. ఈమేరకు సర్వసభ్య సమావేశం ఆమోదించి, అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించడం చెప్పుకోదగ్గ అంశం.
– సాక్షి, సిటీబ్యూరో
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం మొక్కుబడి తంతుగా సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు సైతం ప్రజా సమస్యలపై ధ్వజమెత్తారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, పరిష్కార మార్గాలు మాత్రం చూపడం లేదంటూ అధికారులను నిలదీశారు. సభ ఎలా సాగిందంటే...
ఎల్‌ఈడీ వీధి దీపాలు 98 శాతం వెలుగుతున్నాయని అధికారులు చెబుతున్నా అది వాస్తవం కాదని, ఇఫ్తార్ సమయంలోనూ చీకట్లతో అవస్థలు పడుతున్నామని, రోడ్లపై చెత్త ఎప్పటికప్పుడు తరలించడం లేదని, తగినన్ని డంపర్‌బిన్లు, డంపర్ ప్లేసర్లు లేక చెత్త సమస్యలు తీరడం లేవని, అధికారులను సంప్రదిస్తే అది తమ బాధ్యత కాదంటున్నారని ఎంఐఎం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ ఏర్పాట్లకు సంబంధించి ఇంకా 147 పనులు ప్రారంభం కాలేదని అధికారుల నివేదికలోనే ఉందని, వాటినెప్పుడు చేస్తారని ఎంఐఎం సభ్యులు సలీంబేగ్, ఫహద్‌బిన్ అబ్దుల్, ఎండి రషీద్ ప్రశ్నించారు.
రంజాన్ పనులన్నీ రెండు రోజుల్లోగా పరిష్కారం కావాలని, ఆ తర్వాత తనకు ఒక్క ఫిర్యాదు కూడా రావద్దని మేయర్.. అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్నా నాలాల విస్తరణ పనులు పూర్తికాలేదని, టెండర్లు పిలిచినా పనులు మొదలు కాలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలాలపై కప్పులేక, పూడిక తిరిగి అందులోకే చేరుతోందని, తలాబ్‌కట్ట వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుతోందని సభ దృష్టికి తెచ్చారు. సఫ్దర్‌నగర్, పరికిచెరువు, ఫాక్స్‌సాగర్ తదితర ప్రాంతాల్లో పనులు జరగలేదన్నారు. లాలాపేటలో ఎనిమిదేళ్లుగా పూడిక తీసిందేలేదని టీఆర్‌ఎస్ సభ్యులు బంగారి ప్రకాశ్, శ్రీలత, ఎంఐఎం సభ్యులు అయేషా రూబినా, నస్రీన్ సుల్తానా, ఎండీ హుస్సేన్ తదితరులు సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఫాక్స్‌సాగర్‌కు సంబంధించి బహుళ అంతస్తుల భవనాలు, పట్టా భూములు ఉన్నందున.. కోర్టు కేసుల వల్ల ఆస్తుల సేకరణ జాప్యమవుతోందని సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. సఫ్దర్‌నగర్‌లో డిజైన్ మార్పుతో ఆలస్యమైందన్నారు. పూడికతీత గత సంవత్సరం ఇదే సమయానికి 32 శాతం జరగ్గా ఈ సంవత్సరం 35 శాతం జరిగిందని చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు.
వివిధ మార్గాల నుంచి చార్మినార్‌కు దారితీసే రహదారుల పనులు పదేళ్లయినా పూర్తికాలేదని, ట్రాక్టర్లు లేక ఎత్తిన చెత్త రోడ్లపైనే ఉంటోందని పలువురు ఎలుగెత్తారు. అవార్డుల సంగతి అటుంచి, పారిశుధ్య పనుల్లో అవినీతిని అరికట్టాలని కోరారు. పారిశుధ్య పనులు నిర్వహించే ఎస్సార్పీలు ఏడాదిన్నరగా పనిచేయడం లేదని టీడీపీ సభ్యుడు మందడి శ్రీనివాసరావు సభ దృష్టికి తెచ్చారు. దోమల నివారణకు అదనపు డ్రైవ్‌లు చేపట్టి, అదనపు సామగ్రిని సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని మేయర్ అధికారులకు సూచించారు. చెరువులను శుభ్రపరిచాక ట్రీట్ చేసిన నీరు మాత్రమే చెరువులో చేరేలా కొత్త పాలసీ తెస్తున్నామన్నారు.
వారు బదిలీ అయితే.. మీకెందుకు బాధ..?
శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎస్‌ఎఫ్‌ఏ)బదిలీలపై పలువురు సభ్యులు ఆక్షేపించగా మేయర్ ఘాటుగానే సమాధానమిచ్చారు. జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ స్టేడియాల బుకింగ్‌కు ఆన్‌లైన్ అందుబాటులోకి తేవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా, కమిషనర్, మేయర్ వారికి తగిన సమాధానమిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఏల బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని, రంజాన్ అనంతరం బదిలీ చేయాలని కోరగా, రంజాన్ తర్వాత బోనాలు, వినాయక చవితి ఉంటాయని.. ప్రత్యేక సందర్భంలేని సమయముంటుందా? అంటూ మేయర్ అన్నారు. బయోమెట్రిక్ హాజరుతోనే ఎన్నో నిధులు ఆదా అయ్యాయని, ఎస్‌ఎఫ్‌ఏలను బదిలీ చేస్తే మీకు బాధేంటని ప్రశ్నించారు. బదిలీ అయిన వారు వెంటనే విధుల్లో చేరేలా డిప్యూటీ కమిషనర్లు బాధ్యత వహించాలని జగదీశ్వర్ సూచించారు. స్పోర్ట్స్ స్టేడియాల్లో స్థానికులకు సదుపాయం, కాలనీల్లోని స్టేడియాల్లో ఇరుగుపొరుగువారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ సభ్యులు శేషుకుమారి, స్వర్ణలతారెడ్డి కోరారు. క్రికెట్ కిట్ల పంపిణీల్లో అవకతవకలు జరుగుతున్నాయని విజిలెన్స్ నివేదిక ఉన్నందున జీహెచ్‌ఎంసీ క్యాంపుల్లోనే వీటిని పంపిణీ చేస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.
అందరి కృషితోనే అవార్డులు: కమిషనర్ జనార్దన్‌రెడ్డి
జీహెచ్‌ఎంసీకి సంవత్సర కాలంలో 13 అవార్డులు రావడం వెనుక అందరి సమష్టి కృషి ఉందని కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. దీంతో సభలోని అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలో 96 శాతం ఎల్‌ఈడీ వీధిదీపాలు వెలుగుతున్నాయని, అయితే 98 శాతానికి పైగా వీధిదీపాలు వెలిగితేనే ఈఈఎస్‌ఎల్ సంస్థకు చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎంసీలో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం!
ఇప్పటికే 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన జీహెచ్‌ఎంసీ.. గ్రేటర్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించాలని నిర్ణయించింది. సర్వసభ్య సమావేశంలో ఈమేరకు ఆమోదం తెలుపుతూ, అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉందన్నారు. జీహెచ్‌ఎంసీలో రోజుకు దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, అందులో 400– 500 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలేనన్నారు. తాత్కాలిక అవసరాల నిమిత్తం ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను నిత్యజీవితంలో ఉపయోగిస్తున్నప్పటికీ ఇవి దీర్ఘకాలికంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపించి ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని మేయర్ అన్నారు. ముఖ్యంగా వర్షాలకు నాలాలు, సివరేజీ లైన్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో పేరుకుపోయి నీరు పారే దారిలేక రోడ్లు మునుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 1986 పర్యావరణ పరిరక్షణ చట్టానికి లోబడి 50 మైక్రాన్ల కన్నా అధికంగా ఉండే అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల తయారీ, సరఫరా, అమ్మకాలపై నిషేధం విధించాలని నిర్ణయించామన్నారు. ఈ అంశం స్టాండింగ్ కమిటీలో చర్చించాక ఆమోదించవచ్చని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అభ్యంతరం వ్యక్తం చేయబోగా, ప్రభుత్వ ఆమోదానికి ఎంతో సమయం పడుతుందని, అసెంబ్లీ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుందని మేయర్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment