
తెలుగుజాతికి బహుమతి
‘అందమైన వర్ణాల పర్వం సంక్రాంతి. ఇది పాడిపంటల పండుగ. మనుషుల మధ్య అనుబంధాలను పెనవేసే సంక్రాంతి.. తెలుగుజాతికి లభించిన గొప్ప బహుమతి..’
‘అందమైన వర్ణాల పర్వం సంక్రాంతి. ఇది పాడిపంటల పండుగ. మనుషుల మధ్య అనుబంధాలను పెనవేసే సంక్రాంతి.. తెలుగుజాతికి లభించిన గొప్ప బహుమతి..’ అంటున్నారు నాటక రంగ రారాజు చాట్ల శ్రీరాములు. మంగళవారం రవీంద్రభారతిలో ‘సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవం’ నిర్వహించిన సందర్భంగా ఆయన సాక్షి సిటీప్లస్‌తో సంక్రాంతి గురించి పంచుకున్న అనుభూతులు..
..:: కోన సుధాకరరెడ్డి
సంక్రాంతి మూడు రోజుల పండుగ. ఆ రోజులు తలుచుకుంటేనే అద్వితీయమైన అనుభూతి.. పండక్కి వారం ముందు నుంచే పల్లెలు కళకళలాడేవి. పిల్లలకైతే ఇది కొత్త బట్టల పండుగ. భోగి మంటల కోసం చేసే ఏర్పాట్లు మరువలేనివి. కొన్ని ప్రాంతాల్లో భోగి మంటల్లో వేసే కలప కోసం ముందు రోజు రాత్రంతా యువత చేసే హంగామా భలే ఉండేది. సంక్రాంతి అలంకరణ ప్రధానమైన పండుగ. లోగిళ్లలో రంగవల్లులు.. ఇళ్లకు మామిడాకుల, బంతిపూల తోరణాలు.. ముంగిట ధాన్యరాశులు..రంగులద్దుకున్న ఎడ్లబండ్లు.. ఎన్నని చెప్పాలి?.
తెలవారుతూనే మేల్కొలుపు
సంక్రాంతికి ముప్ఫై రోజుల ముందే నెల పడతారు. ఆ నెల రోజులూ ఉదయం, సాయంత్రం హరిదాసు కీర్తనలు పాడుతూ ఇంటింటికీ వస్తాడు. ప్రత్యేకించి పండుగ మూడు రోజుల్లో బుడబుక్కల వాళ్లు, గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసులు, జంగమదేవరలు వచ్చి వెళ్తూనే ఉంటారు. భోగినాడు తెల్లవారుజామున 3 గంటలకే పల్లెలు మేల్కొనేవి. ప్రతి ఇంటి ముంగిట కల్లాపుల చప్పుళ్లు.. వాటిపై ముగ్గులేసే పడుచులు.. పట్టులంగాలు, ఓణీల వయ్యారం.. ఆలయాల్లో దైవ దర్శనం.. ఇంటికొచ్చాక పిండివంటల ఘుమఘుమలు.. మధ్యాహ్నం పంటపొలాల్లో హాయిగా పిల్లాపాపలతో కాలక్షేపం.. సాయంత్రానికి డూ డూ బసవన్నల విన్యాసాలు..
సామాజిక పర్వం
తెలుగు పండుగ లన్నీ ఆనందోత్సాహాలను పంచేవే. సంక్రాంతి మరీను. రైతు తనకు చేతికందిన పంట నుంచి కొంత ఫలాన్ని తన వద్ద పని చేసేవారికి పంచేవాడు. పండుగ పిండివంటలు సైతం ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ విధంగా ఇది సామాజిక పర్వం. హరికథలు, తోలుబొమ్మలాటలు, ఒకరినొకరు ఆటపట్టించుకోవడాలు.. ఇవన్నీ సామూహిక ఆనందాన్ని పంచేవి. అప్పుడు మనిషి సంఘజీవి. ఇప్పుడు వ్యక్తిగత జీవి. నా జీవితంలో ఎన్నో సంక్రాంతుల్ని చూసిన కళ్లతో చెబుతున్నాను. ఈనాడు పల్లెల్లోనూ ఆ క్రాంతి లేదు. ఇక పట్టణాల్లో సరేసరి.
ఏనాటికైనా..
అమెరికాలో చూశాను.. అక్కడి తెలుగు వారు పండుగ పూట సంప్రదాయ వస్త్రధారణలో శుచిగా కనిపిస్తారు. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతారు. పండుగలు, పర్వాలను శాస్త్రోక్తంగా జరుపుకొంటారు. పిల్లలకు పట్టుబట్టి తెలుగు నేర్పుతున్నారు. మనం.. ఈ గడ్డపై పుట్టి మన సంప్రదాయాలను మనమే పలుచన చేసుకుంటున్నామేమో అనిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం. తెలుగుదనంలోని తియ్యదనం ఏనాటికీ తగ్గదు. మన సంస్కృతి.. అందులోని పండుగలు, పర్వాల ప్రాబల్యం అటువంటిది. అవి మనకు శక్తిని, యుక్తిని, వికాసాన్ని ఇస్తాయి. మేం నాటకాల ద్వారా ఇదే ప్రజలకు తెలియజేస్తున్నాం. మన సంస్కృతి- సంప్రదాయాలపై మక్కువ పెంచేందుకు కృషి చేస్తున్నాం.