సాక్షి, హైదరాబాద్: అనుమతిలేని బీజీ–3 పత్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. అందుకోసం బీజీ–3కి ఉపయోగించే గ్లైపోసెట్ అనే కలుపు మందును నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. ప్రధానంగా పత్తి సాగు చేసే ఖరీఫ్ సీజన్‌లో జూన్ నుంచి నవంబర్ వరకు ఈ కలుపు మందును నిషేధించాలని విజ్ఞప్తి చేసింది.
గ్లైపోసెట్‌ను నిషేధిస్తే సాధారణంగా బీజీ–3 పత్తి సాగును నిలువరించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. అయితే గ్లైపోసెట్‌ను నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, లేకుంటే కేంద్రానికి సిఫార్సు చేయాలా అన్న దానిపై స్పష్టత లేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
తేడా గుర్తించడం కష్టం..
రాష్ట్రంలో ఖరీఫ్‌లో అన్ని పంటలకంటే పత్తి సాగే అధికంగా ఉంటుంది. గతేడాది 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. దేశంలో అనుమతి కలిగిన బీజీ–1, 2 విత్తనాలనే విక్రయిస్తారు. దానికే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే బీజీ–2ని గులాబీరంగు పురుగు పట్టి పీడిస్తుండటంతో అనేకమంది రైతులు గతేడాది ఖరీఫ్‌లో అనుమతిలేని బీజీ–3 విత్తనాన్ని ఆశ్రయించారు.
ఇదే అదనుగా భావించిన అనేక కంపెనీలు బీజీ–3ని రైతులకు రహస్యంగా అంటగట్టాయి. ఒక అంచనా ప్రకారం పత్తి సాగులో 20 శాతం వరకు రైతులు బీజీ–3ని సాగు చేశారు. బీజీ–2కు, బీజీ–3కి తేడా కనిపించదు. రెండు రకాల మొక్కలు ఒకేలా ఉంటాయి. కాబట్టి వాటిని నేరుగా చూసి గుర్తించడం కష్టం. కాబట్టి బీజీ–3కి అడ్డుకట్ట గ్లైపోసెట్ కలుపు మందు నిషేధంతోనే సాధ్యమని భావిస్తున్నారు.
గ్లైపోసెట్‌ను నిషేధిస్తే..?
బీజీ–3 పత్తి విత్తనాలను నిషేధించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. కానీ అది విచ్చలవిడిగా రైతులకు అందుబాటులోనే ఉంటోంది. మోన్‌శాంటో కంపెనీ రౌండ్ అప్ రెడీ ప్లెక్స్(ఆర్‌ఆర్‌ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. మహికో కంపెనీ ఆర్‌ఆర్‌ఎఫ్ కారకం గల బీటీ–3 పత్తి రకాలను రైతు క్షేత్రాల్లో ప్రయోగాత్మక పరిశీలనలు జరిపింది. ఇప్పుడది పత్తి పంటలో ఉంది.
ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసే విధంగా వ్యాపిస్తోంది. బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు గ్లైపోసెట్‌ను వాడతారు. ఆ మందు లేకుంటే బీజీ–3లో కలుపు నివారణ సాధ్యంకాదు. దీనిని బీజీ–3 పత్తికి వేస్తే, పక్కనున్న ఇతర పంటలపైనా ప్రభావం చూపుతుంది. అవీ విషపూరితమవుతాయి. బీజీ–3 విక్రయాలు రహస్యంగానైనా అమ్ముడుకాకుండా చూడాలంటే గ్లైపోసెట్ నిషేధమే సరైన పద్ధతిగా వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తేనే బీజీ–3పై ఉక్కుపాదం మోపడానికి వీలవుతుందని అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment